అటెన్షన్ ప్లీజ్… జనసేనలో ఆ 3 నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో జనసేనకు సరికొత్త సమస్యలు వచ్చాయని తెలుస్తుంది. ఉన్నవి 21 సీట్లలోను అధినేత సీటు పక్కనపెడితే ఇక మిగిలినవి 20. అందులోనూ జనసేనకు అత్యంత బలమైన ప్రాంతంగా చెబుతున్న గోదావరిజిల్లాల్లోని వెస్ట్ లో ఇప్పుడు మూడు నియోజకవర్గాలు తెగ టెన్షన్ పెడుతున్నాయని తెలుస్తుంది. అధినేత కల్పించుకోవడం అత్యవసరం అని అంటున్నా.. ఆయన మాత్రం తాంబూలాలు ఇచ్చేశాం.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే… ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించింది!! ఇందులో భాగంగా నరసాపురం టిక్కెట్ ను బొమ్మిడి నాయకర్ కు ఇచ్చారని ఆయన చెబుతుండగా… ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు & కో మాత్రం.. తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారని తెలుస్తుంది. పైగా కొత్తపల్లి వర్గం సెపరేట్ గా ప్రచారం చేసుకుంటుందని తెలుస్తుంది.

దీంతో… నరసాపురంలో కాస్త గెలుపు అవకాశాలున్నాయని అంటున్న తరుణంలో ఇదేమి కొత్త సమస్యరా బాబూ అంటూ జనసైనికులు తలలు పట్టుకున్నారని సమాచారం. ఇక చివరి నిమిషంలో టీడీపీ నుంచి జనసేనలో చేరి కీలకమైన భీమవరం టిక్కెట్ ను దక్కించుకున్నారు అంజిబాబు. అయితే… ఈ విషయంపై జనసైనికులు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. పైగా… జనసైనికులకంటే ఎక్కువగా పాతపరిచయాలున్న టీడీపీ కార్యకర్తలనే కలుపుకుపోతున్నారని ఫిర్యాదు కూడా చేస్తున్నారంట.

వీటితోపాటు ప్రధానంగా జనసేన టిక్కెట్ పై ఎన్నో ఆశలుపెట్టుకుని, ఎన్నో వ్యవయప్రయాసలకు ఓర్చిన తణుకు జనసేన నేత విడివాడ రామచంద్రరావు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని అంటున్నారు. వారాహి యాత్ర సాక్షిగా వేలమంది ప్రజానికం ముందు తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి.. అన్ని అవసరాలకూ వాడుకుని, తీరా టిక్కెట్లు ప్రకటించే సమయానికి హ్యాండ్ ఇచ్చారని ఆయన గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తణుకు టీడీపీ అభ్యర్థికి ఈయన రెబల్ గా మారతారనే బెంగ పెరిగిపోతుందని చెబుతున్నారు.

ఇలా ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలోని మూడు కీలక నియోజకవర్గాల్లో జనసేనలో ఇంటిపోరు పెరిగిపోతుందని.. ఇది కూటమిలో కుంపటి రాజేస్తుందని.. ఫలితంగా ఈ పరిస్థితి రానున్న ఫల్లితాలపై పెను ప్రభావం చూపించే ప్రమాధం లేకపోలేదని అంటున్నారని తెలుస్తుంది.