బాబుకు “రచ్చ”బండ… మోషన్ పోస్టర్ వదిలిన రఘురామ!

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన నరసాపురం లోక్ సభ టిక్కెట్ రఘురామ రాజుకి దక్కలేదనే అంశం మరో మలుపు తీసుకుంది. పార్టీ ఏదైనాసరే కూటమిలో భాగంగా నరసాపురం టిక్కెట్ తనదే అనే స్థాయిలో మాట్లాడిన రఘురామకు.. ఆ టిక్కెట్ తనది కాదని తెలిసిన నాడు విడుదల చేసిన వీడియోలో.. ఎంత వాల్యూం పెట్టుకున్న వినిపించని స్థాయిలో ఆయన మాట్లాడిన పరిస్థితి! అనంతరం తేరుకున్నారో ఏమో కానీ ఇప్పుడు తిరిగి వాయిస్ పెంచారు!

వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి.. గెలిచిన ఆరేడు నెలలకే ఆ పార్టీకి అతిపెద్ద ప్రత్యర్థిగా మారారు రఘురామ! ప్రత్యర్థి అనే కంటే.. జగన్ కి ఆజన్మ శత్రువు అన్న రేంజ్ లో విరుచుకుపడిపోయారు. దీంతో చంద్రబాబుకు, ఒక వర్గం మీడియాకూ దగ్గరైపోయారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో రఘురామ కృష్ణంరాజు టీడీపీ నుంచి నరసాపురం అభ్యర్థిగా.. అలా కానిపక్షంలో జనసేన అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేస్తారని ఆల్ మోస్ట్ ఆయనతో పాటు.. ఈ రెండు పార్టీల కార్యకర్తలు కూడా ఫిక్సయిపోయిన పరిస్థితి.

ఈ నేపథ్యంలో బీజేపీని కూడా తెచ్చుకొవడం.. తెరవెనుక ఏమి జరిగిందనేది తెలియదు కానీ… అనూహ్యంగా నరసపురం టిక్కెట్ బీజేపీ ఖాతాలో పడటం జరిగింది. నరసాపురం నియోజకవర్గం నుంచి రఘురామ పోటీ చేస్తారని తెలిసినా, ఆశలు పెట్టుకున్నారని అర్ధం చేసుకున్నా కూడా… నరసాపురాన్ని బీజేపీకి వదిలేయడం అంటే.. ఆయనను కూడా వదిలించుకోవడమే.. ఇదే బాబు ప్లాన్ అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది.

తనకు కావాల్సినవారికోసం, తనకు కావాల్సిన నియోజకవర్గాలను జనసేన, బీజేపీ నుంచి పట్టుబట్టి సాధించుకున్న చంద్రబాబుకు… నరసాపురం టిక్కెట్ రఘురామ కోసం ఆపడం పెద్ద విషయం కాదు! కాకపోతే… అది ఆయన వ్యూహాత్మకంగానే చేశారని అంటున్నారు. ఉదాహరణగా… విశాఖ లోక్ సభ స్థానాన్ని పట్టుబట్టి సాధించుకున్న వైనాన్ని చూపిస్తున్నారు! ఈ విషయం అర్ధమైందో ఏమో కానీ… ఆ లాజిక్కే లాగుతూ, చంద్రబాబుకు బాధ్యత గుర్తు చేశారు.

ఇందులో భాగంగా… తాజాగా ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన రఘురామ… బీజేపీ తనకు టిక్కెట్ ఇవ్వలేదు కాబట్టి, తనకు టిక్కెట్ ఇవ్వాల్సిన బాధ్యత టీడీపీ, జనసేనలపై ఉందని అన్నారు. నరసాపురంలోనే తనకు టీడీపీ టిక్కెట్ ఇవ్వాలని నొక్కి చెప్పారు. ఇదే సమయంలో… నమ్ముకున్న తనకే సీటు ఇప్పించలేనివాడు.. రేపు కేంద్రంతో పోరాడి పోలవరం ఎలా కడతాడు, రాష్ట్రానికి ఏదో తెస్తాడంటే ప్రజలు నమ్ముతారా అంటూ తనదైన శైలిలో స్పందించారు రఘురామ.

దీంతో… రఘురామ కృష్ణంరాజుకి టీడీపీ అధినేత చంద్రబాబు ఏదో రకంగా నరసాపురం టిక్కెట్ ఇప్పించే ప్రయత్నం చేసి సక్సెస్ అవ్వకపోతే… నెక్స్ట్ కూటమిపై “రచ్చ”బండ మొదలైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు. తనకే టిక్కెట్ ఇప్పించలేనివాడు.. కేంద్రంతో పోరాడి పోలవరం ఎలా తెస్తాడని ప్రజలు భావించే అవకాశం ఉందని చెప్పడం అనేది జస్ట్ ఒక మోషన్ పోస్టర్ మాత్రమే అని చెబుతున్నారు. ఇంకా టీజర్, ట్రైలర్, ఆడియో లాంచ్, సినిమా రిలీ, అనంతరం సక్సెస్ మీట్ కూడా ఉండొచ్చని చెబుతున్నారు. మరి బాబు ఏమి చేస్తారో వేచి చూడాలి!!