ఉమాబాల వర్సెస్ వర్మ.. నరసాపురంలో ఎవరి సత్తా ఎంత?

గత ఐదేళ్లుగా నిత్యం వార్తల్లో నానిన లోక్ సభ నియోజకవర్గం ఏదైనా ఉందంటే… ఠక్కున చెప్పే పేరు నరసాపురం అని చెప్పినా అతిశయోక్తి కాదు! ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కీలకమైన ఈ లోక్ సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామ కృష్ణంరాజు రెబల్ గా మారడం.. రోజూ “రచ్చ”బండ పేరుతో తాను గెలిచిన పార్టీని, ఆ పార్టీ అధినేతనీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం తెలిసిందే!

అయితే.. కారణాలు ఏవైనా, కారకులు మరెవరైనా ఈ ఏడాది రఘురామ కృష్ణంరాజుకి ఎంపీ టిక్కెట్ దక్కలేదు. కూటమిలో భాగంగా… నరసాపురం లోక్ సభ టిక్కెట్ ఎవరికి వచ్చినా.. పోటీ చేసేది మాత్రం తానే అనే స్థాయిలో కాన్ ఫిడెన్స్ చూపించిన రఘురామ కృష్ణంరాజు.. తనకు బీజేపీ టిక్కెట్ దక్కకపోవడానికి జగన్ కారణమనే వరకూ వచ్చారు! ఈ సమయంలో నరసాపురం లోక్ సభ కూటమి అభ్యర్థిగా శ్రీనివాస వర్మను ప్రకటించింది బీజేపీ.

దీంతో… క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వర్మకు, బీసీ సామాజికవర్గానికి చెందిన ఉమాబాలకూ మధ్య నరసాపురంలో పోటీ ఏస్థాయిలో ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ క్షత్రియులు, కాపుల డామినేషన్ ఎక్కువ.

ఈ క్రమంలోనే… నరసాపురం, ఉండి, ఆచంట నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా క్షత్రియులే ఎన్నికవ్వగా… పాలకొల్లు, భీమవరం తాడేపల్లి గూడెంలలో కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అంటే ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆరుచోట్ల రెండు సామాజిక వర్గాల హవాయే కనిపిస్తోంది.

ఈ క్రమంలో ఈ రెండు సామాజికవర్గాలకూ కాకుండా… బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు జగన్. కూటమిలో భాగంగా క్షత్రియ సామాజికవర్గానికి చెందిన నేతను బరిలోకి దించారు. దీంతో.. ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. పైగా ఇద్దరు నేతలూ కొత్తవారే కావడంతో ఈ గెలుపులో ఎమ్మెల్యే అబ్యర్థుల పాత్రే కీలకంగా మారబోతోందని అంటున్నారు.

వాస్తవానికి గత ఎన్నికల్లో నరసాపురంలో త్రిముఖ పోటీ రసవత్తరంగా మారింది. ఇందులో భాగంగా వైసీపీ నుంచి రఘురామ కృష్ణంరాజు, టీడీపీ నుంచి ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, జనసేన నుంచి కొణిదెల నాగబాబు బరిలోకి దిగడంతో పోరు ఆసక్తిగా మారింది. ఆ త్రిముఖ పోరులోనూ ఫ్యాన్ గాలి ప్రభావంతో రఘురామ స్వల్ప మెజారిటీతో గట్టేక్కారు!! ఇక కాంగ్రెస్ నుంచి కనుమూరి బాపిరాజు, ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్ లు పోటీ చేసినా డిపాజిట్లు దక్కలేని పరిస్థితి.

ఇక నరసాపురం పార్లమెంటు పరిధిలో సుమారు 18 లక్షల జనాభా ఉండగా.. 13 లక్షల ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలో 2019 ఎన్నికలలో సుమారు 11 లక్షల 74 వేల 441 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీ నుంచి పోటీ చేసిన రఘురామకు 4 లక్షల 47 వేల 594 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి శివరామరాజుకు 4 లక్షల 15 వేల 685 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన నాగబాబుకు రెండు లక్షల 50 వేల 259 ఓట్లు వచ్చాయి.

ఈసారి కూడా అక్కడ వైసీపీ వర్సె కూటమి మధ్య బలమైన పోటీ ఉంటుందని అంటున్నారు. టీడీపీ – జన్సేన – బీజేపీ కలిస్తే… క్షత్రియ, కాపు ఓట్లు బలంగా పడతాయని.. ఫలితంగా తమ అభ్యర్థి గెలుపు కన్ ఫాం అని కూటమిలో పార్టీలు భావిస్తున్నారని అంటున్నారు. మరోపక్క.. గతేడాది నియోజకవర్గంలో పర్యటించిన జగన్ దాదాపు 100కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయగా.. ప్రస్తుతం ఈ పనులు నిర్మాణ దశలో ఉన్నాయని చెబుతున్నారు ఉమాబాల!

ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంతా జగన్ వైపే ఉన్నారని.. జగన్‌ అమలు చేస్తున్న ప్రభుత్వ, సంక్షేమ పథకాలతో తాను విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఉమాబాల. ఇదే క్రమంలో… ముఖ్యంగా ప్రధాని మోడీ ఇమేజ్‌ తోపాటు కూటమి పార్టీల బలంతో తన విజయం ఖాయమంటున్నారు శ్రీనివాస వర్మ. మరి నరసాపురం ప్రజానికం అభిప్రాయం ఎలా ఉందనేది వేచి చూడాలి!