జగన్ లెవెల్ వెడల్పు… ట్రిపుల్ ఆర్ ను వెనక్కినెట్టిన ఎవరీ వర్మ!

నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నరసాపురం ఎంపీగా వైసీపీ నుంచి గెలిచినప్పటికి కంటే… ఆ పార్టీతో విభేదించిన తర్వాత ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదనే చెప్పాలి! ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా నరసాపురం టిక్కెట్ బీజేపీకి దక్కగా.. అది కాస్తా రఘురామ కృష్ణంరాజు చేజారింది. దీంతో ఈ విషయం వెస్ట్ గోదావరిలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

టీడీపీ, జనసేన, బీజేపీ… పార్టీ ఏదైనా నరసాపురం ఎంపీ అభ్యర్థి తానే అనే స్థాయిలో రఘురామకృష్ణంరాజు మాటలు ఉండేవి! అయితే.. అది గతం! ఇప్పుడు తన ఓటమిని ఆయన అంగీకరిస్తున్నారు.. ఇదే సమయంలో జగన్ గెలుపునూ ఆమోదిస్తున్నారు. దీని వెనుక చాలా రాజకీయం జరిగిందనేది ఆయన అభిప్రాయంగా ఉంది. తనకు టిక్కెట్ ఇవ్వనందుకు బీజేపీ అధిష్టాణంపై ఫైర్ అయ్యే అవకాశం లేకో, శక్తి చాలకో తెలియదు కానీ… ఆ క్రెడిట్ ని కూడా జగన్ ఖాతాలో వేస్తున్నారు ట్రిపుల్ ఆర్.

ఈ విషయాలపై స్పందిస్తూ తాజాగా వీడియో విడుదల చేసిన రఘురామ కృష్ణంరాజు.. రాబోయే ఎన్నికల్లో కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు. ఈ సమయంలో తనకు టిక్కెట్ రాకపోవడంతో కొంతమంది ఆనందిస్తుండగా.. చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో… తనకు టిక్కెట్ దక్కడంలేదని తెలిసినప్పటి నుంచీ తన రెండు ఫోన్లూ సెకను సెకనుకూ మోగుతున్నాయని చెప్పడం గమనార్హం.

ఇక తనకు టిక్కెట్ రాకపోవడంలో జగన్ పాత్ర ఉందన్నట్లు చెప్పిన ఆయన.. ఏపీ బీజేపీ ఎక్స్ చీఫ్ సోము వీర్రాజు సహాయంతో తనకు టిక్కెట్ రాకుండా చేసి జగన్ విజయం సాధించారని రఘురామ చెప్పుకొచ్చారు! ఈ మేరకు తనకు పక్కా సమాచారం ఉందని అన్నారు. దీంతో.. ఇది కచ్చితంగా జగన్ లెవెల్ ని వెడల్పు చేయడమే అని.. జగన్ స్థాయి బీజేపీలో టిక్కెట్లను మార్చే స్థాయిలో ఉందని.. జగన్ కు బీజేపీలో ఉన్న విలువ అంత పెద్దదని.. ట్రిపుల్ ఆర్ చెప్పకనే చెప్పినట్లయ్యిందని అంటున్నారు పరిశీలకులు.

ఎవరీ శ్రీనివాస్ వర్మ:

నిన్న మొన్నటి వరకూ నరసాపురం టిక్కెట్ కూటమిలో భాగంగా ఏ పార్టీకి దక్కినా పోటీ చేసేది మాత్రం రఘురామ కృష్ణంరాజే అని చెప్పుకున్న తరుణంలో… అనూహ్యంగా భూపతిరాజు శ్రీనివాస వర్మ పేరు తెరపైకి వచ్చింది. నరసాపురం లోక్ సభ టిక్కెట్ ఆయనకు కేటాయించింది బీజేపీ అధిష్టాణం. దీంతో… ఈయన గురించి చర్చ తెరపైకి వచ్చింది.

వాస్తవానికి శ్రీనివాస వర్మ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆ పార్టీ సీనియర్‌ నేత.. కాకపోతే మీడియాలో పెద్దగా కనిపించలేదంతే! ఈ టిక్కెట్ కోసం ఈయనతో పాటు పాకా సత్యనారాయణ, తదితరులు కూడా ధరఖాస్తు చేస్తుకున్నారు. ఈ సమయంలో తన అభ్యర్థిత్వంపై స్పందించిన వర్మ… బీజేపీలో సాధారణ కార్యకర్త గుర్తింపు ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు.

మరి ఈయన అభ్యర్థిత్వం నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీకి, కూటమి అభ్యర్థులకు ఏ మేరకు సహకరిస్తుందనేది వేచిచూడాలి! ఏది ఏమైనా… బీజేపీ నుంచి నరసాపురం లోక్ సభ టిక్కెట్ తనకు దక్కకపోవడానికి జగనే కారణం అని రఘురామ కృష్ణంరాజుకు చెప్పడం మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హైలైట్ గా నిలుస్తుంది!