ఉత్తరాంధ్రలో వైద్యుడు డాక్టర్ సుధాకర్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. హై కోర్టు కూడా మంగళవారం ఉదయానికల్లా డాక్టర్ సుధాకర్ ను తమ ముందు హాజరు పర్చాలని ఆదేశం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే డాక్టర్ సుధాకర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
డాక్టర్ సుధాకర్ వివాదం కరోనాతో మొదలయింది. ఆయన ఒక వైద్యుడిగా మాస్కులు అడిగినందుకు ప్రభుత్వం సస్పెండు చేసింది అనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యాధి విస్తరించకుండా మాస్కులు అడగడం సమర్ధనీయమే. కానీ అడిగిన విధానం సమర్ధనీయం కాదు. ప్రభుత్వ ఉద్యోగికి సర్వీసు నిబంధనలు ఉంటాయి. ఏ ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నారో ఆ ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేయడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదు. ప్రభుత్వ విధానంపై విమర్శ చేయాలంటే ప్రభుత్వోద్యోగి ముందుగా తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలా రాజీనామా చేయకుండా ప్రభుత్వంపై మీడియాలో బహిరంగ విమర్శలు చేయడం అంగీకారం కాదు. ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేయాలంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఉండాల్సింది.
ఈ నిబంధన ప్రభుత్వ ఉద్యోగానికే కాదు… అన్ని రంగాలకు, కుటుంబంతో సహా, వర్తిస్తుంది. రాజకీయ పార్టీల్లో కూడా పార్టీ అధినాయకత్వాన్ని బహిరంగంగా విమర్శించి పార్టీలో కొనసాగలేరు. అలాంటి పరిస్థితుల్లో పార్టీ అధినాయకత్వం సదరు వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తుంది. కుటుంబంలో కూడా వ్యతిరేకత వచ్చినప్పుడు వేరు కాపురం పెట్టిస్తారు. భార్యా భర్తల మధ్య అభిప్రాయబేధాలు వచ్చినప్పుడు విడాకులతో విడిపోతారు. ఇవన్నీ మనవాళ్లకు తెలియని విషయాలు కాదుకానీ, రాష్ట్రంలో అంతా రాజకీయమే కాబట్టి చిక్కుముళ్ళు వేసి చిక్కు ప్రశ్నలు వేస్తున్నారు.
డాక్టర్ సుధాకర్ ప్రభుత్వంపై బహిరంగ ఆరోపణలు చేయగానే మీడియా అలాగే రాజకీయం ఆయన కులాన్ని బహిర్గతం చేసింది. పైగా ఆయన కులం అడ్డం పెట్టి ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకు రాజకీయం ప్రయంత్నం చేసింది. కులాధిపత్యంతో నడిచే మీడియా కూడా డాక్టర్ సుధాకర్ కులాన్ని ముందుపెట్టి రాజకీయ పోరాటానికి ఊతం ఇచ్చే ప్రయత్నం చేసింది.
ప్రభుత్వంపై విమర్శలు చేసి సస్పెండు అయిన డాక్టర్ సుధాకర్ హఠాత్తుగా రోడ్డుమీద ప్రత్యక్షమై పోలీసులతోనూ, కొందరు మీడియా వారితోనూ దురుసుగా ప్రవర్తించి మరోసారి మీడియాలో చోటు సంపాదించుకున్నారు. ఆ సమయంలో డాక్టర్ సుధాకర్ మద్యం సేవించి ఉన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. పోలీసుల ఆరోపణలపై నమ్మకం లేకపోయినా సస్పెన్షన్లో ఉన్న వైద్యుడు లాక్ డౌన్ సమయంలో కారులో రోడ్డుమీదకు ఎందుకు వచ్చారు అన్నది ఒక ప్రశ్న. అలాగే అసభ్యపదజాలం ప్రయోగిస్తూ, చేతిలోని సిగిరెట్లు మనుషులపై విసిరేస్తూ ఎందుకు కనిపించాడు అనేవి ఇక్కడ ఆలోచించవలసిన విషయాలు.
పోలీసులు ఎలాగూ ప్రభుత్వానికి అనుకూలంగానో, ధనం, అధికారం ఉన్న వర్గాలకు అనుకూలంగానో పనిచేస్తారు. ఇందులో విబేధించాల్సిందేమీ లేదు. కానీ డాక్టర్ సుధాకర్ విషయంలో పోలీసులు ఆయనను ఇంటినుండి రోడ్డుకు ఈడ్చుకు రాలేదు. ఆయనే రోడ్డుపై వచ్చి అభ్యంతరకరంగా ప్రవర్తిస్తుంటే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న విధానం పూర్తిగా అభ్యంతరకరం. పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తారు. వారినుండి గౌరవనీయమైన పద్ధతులు ఆశించలేం.
కానీ దురదృష్టవశాత్తూ ఈ విషయంలో కులం ప్రధాన అంశంగా మారి వివాదాన్ని ఎటో తీసుకెళ్ళే ప్రయత్నాలు జరగడం దురదృష్టకరం. అయితే ఇలాంటి ప్రయత్నాలు నిన్న గుంటూరులో అరెస్టు అయిన మహిళ రంగనాయకి విషయంలో జరగలేదు. ఆమె విషయంలో జెండర్ ప్రధాన భూమిక పోషిస్తోంది.
రాష్ట్ర పోలీసులు రంగనాయకమ్మపై కేసు పెట్టగానే మహిళా సంఘాలు గొంతు విప్పాయి. అంతకు ముందే రాజకీయం కూడా వృద్ధ మహిళపై కేసులా అంటూ కూనిరాగం అందుకుంది. డాక్టర్ సుధాకర్ విషయంలో వర్తించిన కులం ఇక్కడ మాయం అయింది. ఈమె విషయంలో వృద్ధాప్యం మరియు లింగవివక్ష తెరపైకి వచ్చాయి.
అయితే ఇక్కడ గమయించాల్సింది ఏమంటే డాక్టర్ సుధాకర్ కానీ, రంగనాయకి కానీ తమ కుల లేదా లింగ స్పృహతో ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. వారు రాజకీయ ప్రత్యర్ధులుగానే విమర్శలు చేశారు. డాక్టర్ సుధాకర్ టీడీపీ అభిమాని. పైగా పాయకరావుపేట ఎమ్మెల్యే సీటు కోసం గత కొన్నేళ్ళుగా అయ్యన్నపాత్రుడు ద్వారా ప్రయాత్నాలు చేస్తున్న వ్యక్తి. ఆయన విమర్శలు కూడా రాజకీయపరమైనవే. అవి వివాదం కావడంతో కులం అస్త్రం ప్రయోగిస్తున్నారు.
ఇక రంగనాయకి కూడా టీడీపీ కార్యకర్తే. అయినా 60 యేళ్ళ వృద్ధురాలు అని ఇప్పుడు మాట్లాడే వారు ఆమె చేసిన రాజకీయ పోరాటం విషయంలో మౌనంగా ఉండడం సమర్ధనీయం కాదు. ఆమె 60 ఏళ్ళ వృద్ధురాలి హోదాలో విమర్శలు చేయలేదు. ఒక రాజకీయ పార్టీ కార్యకర్త హోదాలోనే విమర్శలు చేశారు. విమర్శలకు ప్రతి దాడి కూడా రాజకీయంగానే ఎదుర్కోవాల్సి ఉండగా ఇప్పుడు ఆమె వృద్ధాప్యం, లింగబేధం ముందుకు తెచ్చి ప్రత్యర్థిపై లేదా ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదు.