దేశంలో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి పగ్గాలు చేపట్టినప్పుడు ఆమె జవహర్ లాల్ నెహ్రూ కూతురు మాత్రమే. లాల్ బహదూర్ శాస్త్రి అకాల మరణంతో ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆ పదవి ఆమెను అంత తేలికగా వరించలేదు. ఉద్దండపిండం మొరార్జీ దేశాయ్ గట్టి పోటీ ఇచ్చారు.
నెహ్రూ మరణం తర్వాత కూడా ప్రధాని అవ్వాలని మొరార్జీ గట్టిపట్టు పట్టారు. కానీ అప్పట్లో ఉన్న పెద్దలు రాజీ కుదిర్చి శాస్త్రిని ఆ పదవిలో కూర్చోబెట్టారు. శాస్త్రి మరణం తర్వాత మొరార్జీ మరోసారి పోటీకి దిగారు. ఈ సారి ఆయన రాజీపడదలచుకోలేదు. ఇందిరా గాంధీ కూడా గట్టిగా పట్టుబట్టి కూర్చున్నారు.
ఇద్దరిమధ్య రాజీ కుదిర్చేందుకు పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పార్టీ ఎంపీల్లో రహస్య ఓటింగ్ జరిగి ఇందిరాగాంధీ నెగ్గారు. పగ్గాలు చేపట్టారు.
అప్పుడున్న పార్టీ పెద్దలంతా నెహ్రూతో కలిసి పనిచేసినవాళ్ళే కావడంతో ఇందిరా గాంధీని “నెహ్రూ కూతురు” అనే చూశారు. “బ్యాక్ సీట్ డ్రైవింగ్” చేసుకోవచ్చని చాలామంది భావించారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే వృద్ధనేతలకు ” తాను ఇందిరా గాంధీని అని నెహ్రూ కూతురు మాత్రమే కాదని” గట్టి సందేశం ఇచ్చారు.
నెహ్రూ సమకాలికులు చాలా మందికి ఇందిరా గాంధీ పద్దతి మింగుడు పడలేదు. పార్టీ నాయకత్వం వారి చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం మాత్రం ఇందిరా గాంధీ చేతుల్లో ఉంది. “నెహ్రూ కూతురు, మన కళ్ళముందే పెరిగిన అమ్మాయి ఏముందిలే” అనుకున్నవాళ్ళంతా ఆమె తన “ఐడెంటిటీని ఎస్టాబ్లిష్” చేసుకునే పద్దతిపట్ల ఖిన్నులయ్యారు. ఫలితంగా ఇందిరా గాంధీ చాలా సమస్యలు, సవాళ్ళు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ క్రమంలోనే 1970లో పార్టీని చీల్చారు.
బ్యాంకుల జాతీయకరణ, గరీబీ హఠావో వంటి చర్యలు, నినాదాలతో 1971 ఎన్నికల్లో వృద్ధ నాయకత్వానికి వ్యతిరేకంగా పోటీచేసి భారీ ఆధిక్యతతో గెలిచారు. ఈ గెలుపు ఆమె నాయకత్వాన్ని పటిష్టం చేయడంతో కొంత అహం కూడా పెరిగింది. అధికారం అలాంటిది మరి! ఈ గెలుపు ఇచ్చిన బలంతోనే అనేక నిర్ణయాలు తీసుకున్నారు.
ఒకవైపు వృద్ధ నేతలతో పోరాటం మరోవైపు కోర్టుల్లో ఓటమి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయినా తన నిర్ణయాలు, విధానం మార్చుకోలేదు. ఏకపక్ష నిర్ణయాలు అనేకం తీసుకున్నారు. వీటిలో ప్రధానమైనది ఎమర్జెన్సీ.
అప్పటివరకు కాంగ్రెస్ నాయకత్త్వంలోనే ఉండి ఇందిరా గాంధీపై పోరాటం చేస్తున్న నేతలు, కాంగ్రెస్ బయట ఉన్న కాంగ్రెస్ వ్యతిరేక శక్తులతో కలిసి “జనతా పార్టీ” ఏర్పాటు చేసి మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రి అభ్యర్థిగా లోక్ నాయక్ నాయకత్వంలో ఎమర్జెన్సీకి వ్యతిరేక పోరాటం చేసి 1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీని చిత్తుగా ఓడించారు.
ఎన్నికల్లో గెలిచిన జనతా నేతలు ఇందిరా గాంధీని అణచివేసే చర్యలు మొదలు చివరికి ఆమెను జైలుకు కూడా పంపించారు. ఇందిరా గాంధీపై వ్యక్తిగత ద్వేషంతో అధికారంలోకి వచ్చిన జనతా నేతలు ఆమె వ్యూహంలోనే చిక్కుకుని పతనం అయ్యారు. 1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ తిరుగులేని ఆధిక్యతతో అధికారంలోకి వచ్చారు.
నెహ్రు కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చిన ఇందిరా గాంధీ 1980 ఎన్నికల తర్వాత ప్రపంచ నాయకురాలుగా గుర్తింపు పొందారు. ఇది 1960-70 కాలం నాటి చరిత్ర. సరిగ్గా ఆరు దశాబ్దాల తర్వాత ఈ చరిత్ర పునరావృతం అవుతున్నట్టు కనిపిస్తోంది. తమ సహచరుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని నాడు నెహ్రు కూతురు ఇందిరా గాంధీని చూసినట్టే చూస్తున్నారు చాలా మంది నేతలు. అప్పట్లో ఇందిరా గాంధీ కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వారసత్వ రాజకీయాలు మోస్తూ బ్యాక్ సీట్ డ్రైవింగ్ కు సిద్ధంగా లేరు.
అప్పట్లో ఇందిరకు ఎదురైన రాజకీయ ఉద్దండుల ప్రతిఘటనలు, ఎత్తులు, పైఎత్తులే ఇప్పుడు జగన్ విషయంలో కనిపిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులు జగన్ కు వ్యతిరేకంగా ఏకం అవుతున్నారు. అప్పుడు ఇందిర ప్రభుత్వ నిర్ణయాలను కోర్టు తిరస్కరించినట్టే ఇప్పుడు జగన్ నిర్ణయాలు కూడా కోర్టులో తిరస్కారానికి గురవుతున్నాయి. అప్పుడు ఇందిరా అనేక ఇతర నిర్ణయాలతో పాటు గరీబీ హఠావో నినాదం, పాకిస్తాన్ తో యుద్ధం విజయం ఆమెను నేతగా నిలబెట్టాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని సంక్షేమ పధకాలు తెస్తున్నారు.
అయితే అప్పటికీ ఇప్పటికీ ఆరు దశాబ్దాల వ్యత్యాసం ఉంది. సాంకేతిక విప్లవం, సమాచార విప్లవం ప్రజల ముంగిట్లో ఉన్నాయి. రాజకీయ పరిస్థితుల వరకు మాత్రమే పోల్చి చూస్తే అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదు. వృద్ధ తరం, యువతరం మధ్య అదే పోటీ. అప్పుడు తమ సమకాలిక నేత కూతురు అని తేలిగ్గా తీసుకుని వ్యూహాలు పన్నిన సీనియర్ నేతలు. ఇప్పుడు తమ సమకాలిక నేత కొడుకు అని తేలిగ్గా తీసుకుని వ్యూహాలు పన్నుతున్న సీనియర్ నేతలు.
అప్పుడు ఇందిర పై అన్ని పార్టీల నేతల్లో వ్యతిరేకత. ఇప్పుడు జగన్ పై అన్నిపార్టీల నేతల్లో వ్యతిరేకత. రాజకీయ పోరాటంలో ఇందిరా గాంధీ మరో అభిమన్యుడు అవుతుంది అనుకుంటే అర్జునిడిలా గెలిచారు. ఇప్పుడు ఆరు దశాబ్దాల తర్వాత అదే వ్యూహం. జగన్ మరో అభిమన్యుడు అవుతాడా లేక అర్జునుడు అవుతాడా? ఇది తేల్చాల్సింది కాలమే. ఇది తేల్చాల్సింది ఆయన పాలనా సమర్ధతే