బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలలో రకములు !

Types in Sri venkateswara swami Brahmotsavalu

కలియుగ దైవం శ్రీవేకంటేశ్వరుడు. స్వామికి తిరుమలలో నిత్యకళ్యాణం పచ్చతోరణం. స్వామి ఆరాధనకు లక్షలాదిమంది భక్తులు నిత్యం ఎదురుచూస్తుంటారు. స్వామి అనుగ్రహం కోసం పరితపిస్తుంటారు. స్వామి వారికి నిత్యం జరిగే కైంకర్యాల నుంచి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల వరకు ఎప్పుడూ సందడే సందడి. అయితే స్వామివారికి ఏటా నిర్వహిచే బ్రహ్మోత్సవాలు ఎన్నిరకాలు? వాటి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం…
అధిక ఆశ్వీయుజమాసం రావడంతో ఈసారి స్వామి వారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇక వీటి గురించి పరిశీలిస్తే… బ్రహ్మోత్సవాలు మొత్తం 9 రోజులు కన్నులపండువగా జరుగుతాయి. ‘నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి’
అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో- అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా వస్తారు. స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి, భక్తిపారవశ్యంతో పునీతులవుతారు.

Types in Sri venkateswara swami Brahmotsavalu
Types in Sri venkateswara swami Brahmotsavalu

బ్రహ్మోత్సవాల రకాలు…

నిత్య బ్రహ్మోత్సవం :ప్రతి సంవత్సరం నిర్ధారిత మాసంలో నిర్ధారిత నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మోత్సవాలు. ఇవి మూడురోజులుగానీ అయిదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు రోజులుగానీ జరుగుతాయి.
శాంతి బ్రహ్మోత్సవం:కరవు, కాటకాలు, భయాలు, ప్రమాదాలు, వ్యాధులు, గ్రహపీడల నివారణ కోసం ప్రత్యేకంగా జరిపించేవి ‘శాంతి బ్రహ్మోత్సవాలు’. ఇలాంటి శాంతి బ్రహ్మోత్సవాలను గత చరిత్రకాలంలో చాలామంది ప్రభువులు, దేశ, ప్రాంత, జనహితార్థం అయిదు రోజులపాటు నిర్వహించిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి.
శ్రద్ధా బ్రహ్మోత్సవాలు:ఎవరైనా భక్తుడు, తగినంత ధనాన్ని దేవస్థానంలో, దైవసన్నిధిలో సమర్పించి, భక్తిశ్రద్ధలతో జరిపించుకొనేది ‘శ్రద్ధా బ్రహ్మోత్సవం’. శ్రీవారి ఆలయంలో ఇలాంటి శ్రద్ధా బ్రహ్మోత్సవాలను ‘ఆర్జిత బ్రహ్మోత్సవాలు’గా పేర్కొంటున్నారు.
ఒకరోజు బ్రహ్మోత్సవం:రథసప్తమి రోజు స్వామిని సప్తవాహనాలలో ఊరేగిస్తారు. అందువల్ల దీనిని ఒకరోజు బ్రహ్మోత్సవమని చెబుతారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభించి, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనంలో స్వామిని ఊరేగిస్తారు. చక్రస్నానానంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలలో ఊరేగిస్తారు. సప్తాశ్వాల, సప్తమి నాటి, సప్తవారాల సంకేతంగా సూర్యుడు పుట్టినప్పుడు ఈ ఉత్సవం జరుగుతుంది.