ఒకే రోజు మహాశివరాత్రి, శని త్రయోదశి… ఈ సందర్భం అదృష్టమా.. లేక అరిష్టమా..?

ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీ మహాశివరాత్రి పండుగ. అయితే మహాశివరాత్రి రోజున శని త్రయోదశి కూడా రాబోతోంది. దీంతో ప్రజలు ముందుగా శివుడిని ఆరాధించాలా? లేక శనిదేవుని కొలువాలా ? అని ప్రజలు సంకట స్థితిలో ఉన్నారు. అంతేకాకుండా చాలా అరుదుగా వచ్చే ఈ సందర్భం అరిష్టమా? లేక అదృష్టమా? అని ప్రజలలో అనుమానం మొదలైంది.
మహా శివరాత్రి నాడు శని త్రయోదశి రావడం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది. అసలు శివరాత్రి నాడు ప్రథమ పూజ ఎవరికి చేయాలి ? అనే సందేహం లో ఉన్నారు.

మహాశివరాత్రి రోజున ఈశ్వరుడికి తొలి పూజ చేస్తే శనీశ్వరుడికి ఆగ్రహం వస్తుందా? శనీశ్వరుడికి ప్రథమ తాంబూలం ఇస్తే శివుడు మూడో కన్ను తెరుస్తాడా? ఎవరికి ముందు పూజ చేస్తే ఏం జరుగుతుందో అనే ఆలోచనలో పడ్డారు భక్తులు. మహా శివరాత్రి నాడు శివుడికే తొలి పూజ చేయాలని కొందరు అంటుంటే, శనీశ్వరుడికే అగ్ర తాంబూలం ఇవ్వాలని మరికొందరు అంటున్నారు. సాధారణంగా జాతకంలో శని దోషం ఉన్నవాళ్లు, ఏలిన్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దశలు నడుస్తున్నవాళ్లు…ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నల్ల వస్త్రాలు, నల్ల నువ్వులు దానం ఇస్తారు.ఇలా చేయటం వల్ల శని దోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.

అయితే ఇలాంటి దోషాలు ఉన్న వారు శని త్రయోదశి నాడు చేస్తే మరింత ఫలితం వస్తుందని భక్తులు నమ్ముతారు. అయితే ఈసారి మహా శివరాత్రి రోజే శని త్రయోదశి రావడంతో ఏం చేయాలా అనే ఆలోచనలో పడ్డారు. అయితే ఆ మహాశివుడు కి కూడా శని దోషం తప్పలేదు. అందువల్ల మొదట శని దేవుడిని పూజించి ఆ తర్వాత శివున్ని పూజించాలని కొంతమంది పండితులు సూచిస్తున్నారు. అయితే శివరాత్రి రోజున శివుడికి కాకుండా శనీశ్వరుడికి అగ్ర తాంబూలం ఇస్తే ముక్కంటి ఉగ్రరూపం దాల్చి తన మూడో కన్ను తెరుస్తాడని మరి కొంతమంది సూచిస్తున్నారు.