సాధారణంగా స్నేహితుల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరగటం వల్ల వారు కొంతకాలం ఒకరికొకరు మాట్లాడకుండా ఉంటారు. మరికొంతమంది చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహానికి గురి అవుతూ ఉంటారు. ఇలా అధిక కోపం వల్ల కొన్ని సందర్భాలలో విచక్షణ కోల్పోయి ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. మరి కొంతమంది అధిక కోపం వల్ల విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ ఎదుటివారిని హత్య చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
ఇద్దరి స్నేహితుల మధ్య రూ.400 పెట్టిన చిచ్చు ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. మరొకరిని జైలు పాలు చేసింది. వివరాలలోకి వెళితే… హైదరబాద్ బాలానగర్ లో కాశీరాం, శ్రీనివాస్ లు కూలీలుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు మంచి స్నేహితులు కావడంతో అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చిపుచ్చుకునేవాళ్లు. ఈ క్రమంలోనే ఇటీవల ఇద్దరి మద్య రూ.400 విషయంలో గొడవ మొదలైంది. తాజాగా నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న ఫుట్ పాత్ పై డబ్బుల కోసం ఇద్దరు గొడవకు దిగారు. ఇద్దరి మద్య ఘర్షణ పెరిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే కాశీరాం కోపంతో ఊగిపోతూ.. తన దగ్గర ఉన్న కర్రతో శ్రీనివాస్ పై దాడి చేశాడు. అంతే కాకుండా కోపంలో శ్రీనివాస్ ని అటుగా వస్తున్న లారీ కిందకు తోసేశాడు.
శ్రీనివాస్ లారీ కింద పడటంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మొదటగా కాశీరాం ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఇద్దరి మధ్య డబ్బు విషయమై గొడవ జరిగిందని.. కోపం తట్టుకోలేక శ్రీనివాస్ పొరపాటున లారీ కిందకు తోసేసినట్లు కాశీరాం పోలీసులకు వెల్లడించాడు. అయితే కోపాన్ని అదుపు చేసుకోలేక ఇలా డబ్బుల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీయడంతో స్థానికులు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకి శిక్ష పడేలా చేసి శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.