వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు, ఆయన ప్రచార పనుల్లో ఉండగా విశాఖ విమానాశ్రయంలో ఆయన మీద కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. పందెం కోళ్లకు కట్టే చిన్నపాటి కత్తితో శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్ మీకు దాడిచేశాడు. ఆ దాడిలో జగన్ భూజానికి చిన్నపాటి గాయమై రక్తం కూడ కారింది. అప్పట్లో నడిచిన హైడ్రామా అంతా ఇంతా కాదు. శ్రీనివాస్ టీడీపీకి చెందిన వ్యక్తని కొందరంటే కాదు వైసీపీ మనిషేనని కొందరు. లేదు అతనికి మతిస్థిమితం సరిగా లేదని ఇంకొందరు. పోలీసులు, దర్యాప్తు అంటూ పెద్ద హడావిడి జరిగింది. అటు ఎల్లో మీడియా ఇటు బ్లూ మీడియా ఎవరికీ అనుకూలంగా వారు ప్రచారం చేసుకున్నారు. ఇరు పార్టీలు ఒకరిమీదొకరు తీవ్రస్థాయి విమర్శలు చేసుకున్నారు.
కానీ ఆతర్వాత ఎన్నికలు రావడంతో ఆ గోలలో ఆ కేసును మర్చిపోయారు జనం. జగన్ అధికారంలోకి వచ్చాక దాడిచేసిన వ్యక్తి మీద తీవ్రమైన చర్యలుంటాయనే చర్చ కూడ నడిచింది. కానీ ఆ కేసు ఏమైంది, పురోగతి ఏమిటనేది ఎవ్వరికీ తెలీదు. అయితే తాజాగా జరిగిన ఒక ఘటన మళ్ళీ ఆ సంగతిని గుర్తుచేసింది. విశాఖలో వీఎంఆర్‌డీఏ స్థలంలో కొనసాగుతున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌ను అధికారులు ఖాళీ చేయించడంతో శ్రీనివాస్ అందరికీ గుర్తొచ్చాడు. ఎందుకంటే శ్రీనివాస్ అప్పట్లో ఈ ఫ్యూజన్ ఫుడ్స్ నందే పనిచేసేవాడు. అప్పట్లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ రెస్టారెంట్ కాంట్రాక్టును రద్దుచేయగా యజమాని హర్షవర్ధన్ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.
నిబంధనల మేరకు లీజు గడువు మూడేళ్లు మాత్రమే అయినా యాజమాన్యం 2015 నుండి 2024 వరకు అనుమతులు తెచ్చుకుని ఆ స్థలంలోనే రెస్టారెంట్ ను కొనసాగిస్తోందని, సిరిపురం జంక్షన్ వద్ద ఉన్న ఆ స్ధలాన్ని ఉడా నుంచి లీజుకు తీసుకున్న టీడీపీ నేత హర్షవర్ధన్ రెండింతల అద్దెకు మరొకరికి ఇచ్చాడని, ఇది అక్రమ లీజు కిందికే వస్తుందని అధికారులు అంటున్నారు. ఇంకొందరు మాత్రం ఇది అప్పటి దాడికి ప్రతిచర్యని ఊహిస్తున్నారు. ఒకవేళ ప్రతిచర్యే అయితే ఆనాడు దాడి వెనుక జగన్ చేసిన ప్లానింగ్ ఏమీ లేదనే అర్థం చేసుకోవాలి.