ఏ రాష్ట్రంలోనూ లేబి విధంగా ఏపీలో ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నడుమ ఘర్షణ వాతావరణ నెలకొంది. స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం, ప్రజాబలంతో ఏర్పడిన ప్రభుత్వం ఏకాభిప్రాయంతో లేకపోతే ఎలాంటి సందిగ్ధత నెలకొంటుంది అనేది ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో కొన్ని నెలలుగా వాదులాడుకుంటున్న ఈసీ, ప్రభుత్వం దూకుడుగానే ఉన్నాయి. ఇది వరకే కోర్టుకు వెళ్లగా ఇరు వర్గాలు కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని ధర్మాసం సూచించింది. అంటే ఎన్నికలు నిర్వహించడాన్ని, నిలిపివేయడాన్ని కోర్టు సమర్థించలేదు. చర్చించుకుని ఒకే దారిలో నడవమని సూచించింది.
అయినా పరిస్థితి మారలేదు. తాజాగా ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా కూడ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేశారు. రేపో మాపో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని అంటున్నారు. దీంతో ప్రభుత్వానికి చిర్రెత్తుకొస్తోంది. వద్దని చెబుతున్నా తమ సమ్మతం లేకుండా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని మండిపడుతోంది. ఈ విషయమై సుప్రీం కోర్టు వరకు వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ముందుగా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. అక్కడ అనుకూలమైన తీర్పు వచ్చి ఈసీ ఆదేశాలు మీద స్టేటస్ కో విధింపబడితే సీమే వైఎస్ జగన్ హ్యాపీ. లేదంటే అత్యున్నత న్యాయస్థానానికి వెళతారు.
అసలు హైకోర్టులో ప్రభుత్వానికి ఎలాంటి పరిణామాలు ఎదురవ్వొచ్చు అనేది పరిశీలిద్దాం. నిజానికి నిమ్మగడ్డ ఉద్దేశ్యాలు వెనుక పంతం అనేది ముమ్మాటికీ కనిపిస్తోంది. కోర్టులు సంప్రదించి ఏకాభిప్రాయానికి రమ్మని చెప్పగా ఆయన ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున జరగాల్సి ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక వేసుండాలి. కానీ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఉద్యోగ సంఘాలు, పోలీసులు ఈసీ నిర్ణయం ప్రమాదకరమని, దీనికి సహకరించలేమని అనేశారు. అధికారులు సైతం ఇది కుదరదని తేల్చేశారు. మరి ఎన్నికల సంఘం ఏ సిబ్బందితో ఎన్నికలు నిర్వహిస్తుంది అనేది పెద్ద సమస్య. అసలు తాను ఈసీగా ఉండగా ఎన్నికలు పెట్టకూడదనేది ప్రభుత్వం నిర్ణయమని ఆయన అంటూ వస్తున్నారు. అంటే ఆయన తీసుకున్న డెసిషన్ పంతంతోనే అనేది ఇక్కడ తెలుస్తూనే ఉంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.