ఆంధ్రాలో ఎన్నో ఏళ్లుగా మీడియా యుద్దాలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ పార్టీలకు కొమ్ముకాయడమే ధ్యేయంగా పెట్టుకున్న మీడియా సంస్థలు ఒకరి మీద ఒకరు నిత్యం బురద చల్లుకుంటూ ఎవరి మాటలు నమ్మాలి, ఎవరు నిజం చెబుతున్నారనే విషయమై పాఠకులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇక ఏ పత్రికకు అనుకూలమైన పార్టీ అధికారంలో ఉంటే ఆ ఛానెల్, పత్రికకు భారీ స్థాయిలో ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం ప్రత్యర్థి పత్రికను ఎండగట్టడం పరిపాటిగా మారింది. చంద్రబాబు హాయాంలో అయితే ఆయన అనుంగ మీడియా ఆంధ్రజ్యోతికి ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రకటనల్లో ఎక్కువ శాతాన్ని కట్టబెట్టి ప్రయోజనం చేకూర్చేవారు. ఆ తర్వాత మరొక అనుకూల పత్రిక ఈనాడుకు కూడ బాగానే ప్రకటనలు వెళ్లేవి. జగన్ కుటుంబానికి చెందిన సాక్షి పత్రికకు మాత్రం ప్రకటనల్లో తక్కువ శాతం వాటా ఉండేది.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇదే ఫార్ములాను మరింత గట్టిగా అమలుచేశారు. తమ మీడియా సంస్థ సాక్షికి 51.62 శాతం ప్రకటనలు ఇచ్చి చంద్రబాబు మద్దతు మీడియా ఆంధ్రజ్యోతికి మాత్రం కేవలం 0.25 శాతం మాత్రమే యాడ్స్ ఇచ్చేవారు. దీంతో ఆ పత్రిక రాబడి మరీ తగ్గిపోయింది. ఇది కక్షపూరిత రాజకీయమని విజయవాడకు చెందిన కిలారు శ్రావణ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఇది సుప్రీం ఉత్తర్వుల ఉల్లంఘనే :
ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టగా పిటిషనర్ తరపు న్యాయవాది లెక్కలతో సహా వివరాలను బయటపెట్టి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం ఉత్తర్వులని ఉల్లంఘిస్తోందని అన్నారు. గతంలో సుప్రీం కోర్టు అనుకూల మీడియాను ప్రోత్సహించడం, లేనివాటిని పట్టించుకోకపోవడం సమంజసం కాదని, ప్రభుత్వం అన్ని పత్రికలను సమదృష్టితో చూడాలని ఉత్తర్వులు ఇచ్చి ఉంది. వాటిని అన్ని రాష్ట్రాలు చట్టంగా భావించి పాటించాలి. ఆ చట్ట ప్రకారం చూస్తే ఏపీ ప్రభుత్వం తీరు ఆంక్షనీయమే. జగన్ కుటుంబ సభ్యులకు సొంతమైన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు ప్రభుత్వ ప్రకటనల్లో ఎక్కువ శాతం వెళుతున్నాయనేది వాస్తవం. దీనికి సర్క్యులేషన్ ను బట్టే కదా ప్రకటనలు ఇచ్చేది అంటూ పాలక పక్షం సమాధానం ఇస్తోంది.
ఆ ప్రకారం చూసుకున్నా కూడా అతి తక్కువ ప్రకటనలు అందుకుంటున్న ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ పరంగా మూడవ స్థానంలో ఉంది. మొదట సాక్షి, ఈనాడు ఉన్నాయి. వాటిలో సాక్షికి పైన చెప్పినట్టు 51.62 శాతం, ఈనాడుకు 33.33 శాతం ప్రకటనలు పోగా ఆ తర్వాత ప్రాధాన్యం ఆంధ్రజ్యోతికి ఉండాలి. కానీ ఆంధ్రజ్యోతి కంటే తక్కువ సర్క్యులేషన్ ఉన్న ప్రజాశక్తి, విశాలాంద్ర, ఆంధ్రభూమిలకు కూడ ఆంధ్రజ్యోతికి మించి ఎక్కువ శాతం ప్రకటనలు వెళ్తున్నాయి. ఇది కక్షపూరిత చర్య కాకపోతే మరేమిటి. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసింది కూడ ఇదే. సాక్షికి తక్కువ శాతం ప్రకటనలు ఇచ్చేవారు. అది కూడ ముమ్మాటికీ తప్పే.
పేపర్ ప్రకటనల్లో కూడ వైసీపీ రంగులే:
ఇక మరొక అంశం పత్రికా ప్రకటనల్లో వైసీపీ రంగుల వాడకం. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మొదటి నుండి తన పార్టీ వైసీపీ జెండాను జనం మనసుల్లో గట్టిగా ముద్ర వేయాలనే తపన ఉంది. అందుకే పంచాయతీ కార్యాలయాలకు ప్రజాధనంతో వైసీపీ జెండా రంగులు వేశారు. హైకోర్టు దీన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులేమిటని చురకలు వేసి వాటిని తొలగించే వరకు ఊరుకోలేదు. ఇదే తరహా రంగుల ప్రచారాన్ని పత్రికల ప్రకటనల్లో చేశారు. దీన్ని కూడ ధర్మాసనం ఖండించింది. ప్రభుత్వం తరపున ఏజీ గతంలో టీడీపీ ప్రభుత్వం కూడ ప్రకటనల్లో పసుపు రంగును వాడిందని వాదించగా దాన్ని సమర్థించడం లేదని జస్టిస్ అన్నారు.
ఇక ముఖ్యంగా వైసీపీ మంత్రుల ఫొటోలను సైతం ప్రభుత్వ ప్రకటనల్లో విరివిగా వాడుతున్నారు. దీన్ని కూడ ధర్మాసనం సమర్థించలేదు. ఏ మంత్రుల ఫొటోలైనా మాటిమాటికీ ప్రచురించడమనేది సరికాదని తన వ్యక్తిగత అభిప్రాయమని జస్టిస్ అంటూ గత ప్రకటనలనూ నేను సమర్థించడం లేదు. ప్రభుత్వం చేసే పనుకి ప్రజలకు తెలిసేలా ప్రకటనలు ఉండాలి అంతేకానీ ఫొటోలను ప్రచురించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పనిని ప్రజలకు తెలియజేయండి. మంత్రులేమీ హీరోలు కాదు కదా ఫొటోలు వేసి ప్రచారం చేయడానికి అన్నారు. 151 స్థానాల భారీ మెజారిటీతో గెలిచిన వైసీపీ ఇలా అనవసరంగా రంగుల ప్రచారానికి వెళ్ళి కోర్టులో అక్షింతలు వేయించుకోవడం ఇది రెండోసారి. కాబట్టి ఇకనైనా ఈ పద్దతిని మార్చుకుంటే మంచిది.