1996 మ్యాజిక్ రిపీట్ చేయగలరా ?

అందరిలోను ఇఫుడిదే ప్రశ్న తొలిచేస్తోంది. బిజెపి అనేకన్నా నరేంద్రమోడి వ్యతిరేక పార్టీలతో బలమైన కూటమిని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో అంటే 1996లో కూడా కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలు యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ ఫ్రంట్ కు చంద్రబాబే కన్వీనర్ గా ఉన్నారు. అవి సమైక్య ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రయిన తొలినాళ్ళు. చంద్రబాబు ఏ విధంగా సిఎం అయ్యారో దేశం మొత్తానికి తెలుసు. వెన్నుపోటు మచ్చను తుడిచేసుకునేందుకు, జాతీయ స్ధాయి నేతల మద్దతును కూడగట్టుకునేందుకు చంద్రబాబు పెద్ద ప్రయత్నమే చేశారు.

అప్పుడే ముఖ్యమంత్రవ్వటం, యువకుడు కావటం నిధుల కొరత లేకపోవటం లాంటి అనేక అంశాలు చంద్రబాబుకు సానుకూలమయ్యాయి. దాంతో కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తేగలిగారు. జాతీయ స్ధాయి నేతలు కూడా కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలను కూడగట్టే బాధ్యత చంద్రబాబుకే వదిలేశారు. దాంతో 23 ఏళ్ళ క్రితం కాలికి బలపాలు కట్టుకుని చంద్రబాబు దేశవ్యాప్తంగా తిరిగి మద్దతు సాధించారు. దాంతో యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ వల్ల రాష్ట్రానికి వచ్చిన ఉపయోగమేంటని అడక్కూడదు.

 

కేంద్రంలో అధికారంలోకి వచ్చినా యునైటెడ్ ఫ్రంట్ ప్రయోగం పెద్దగా ఫలించలేదనుకోండి అది వేరే సంగతి. కానీ ఆ ఫ్రంట్ ఎంతకాలం అధికారంలో ఉందనే కన్నా అప్పటి ప్రయత్నాలు చంద్రబాబుకు జాతీయ స్ధాయిలో మంచి ఇమేజినైతే తెచ్చిపెట్టిందనే చెప్పాలి. తర్వాత ఎప్పుడు కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలను కలపాలన్నా అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది చంద్రబాబే అన్నంతగా ముద్రపడిపోయింది. అప్పటి పార్టీల్లో చాలా వరకూ ఇప్పటికీ కాంగ్రెస్, బిజెపిలపై వ్యతిరేకతతోనే ఉన్నాయి. చంద్రబాబు మాత్రమే అవసరానికి తగ్గట్లుగా మద్దతు పలుకుతున్నారు.

 

ఇక ప్రస్తుతానికి వస్తే పోయిన ఎన్నికల్లో మోడితో జతకట్టి అధికారంలోకి వచ్చారు. నాలుగేళ్ళు కలిసి కాపురం చేసిన తర్వాత ఏం జరిగిందో అందరూ చూసిందే. ఆరుమాసాల క్రితం ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబుకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఎంపిలపై ఐటి, ఈడి దాడులు, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో జనాల్లోకి దూసుకుపోతున్నారు. నాలుగున్నరేళ్ళ పాలనలో పెరిగిపోయిన అవినీతి, ప్రజల్లో వ్యతిరేకత తదితరాల వల్ల వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేది అనుమానమే. దాంతో చంద్రబాబులో బాగా అభద్రత కనిపిస్తోంది.

 

కేంద్రంలో మళ్ళీ మోడి వచ్చి, రాష్ట్రంలో జగన్ సిఎం అయితే తన పరిస్ధితేంటి ? అన్నదే చంద్రబాబును బాగా వేధిస్తోందట. దాంతో మళ్ళీ 1996లో పాడిన పాటనే అందుకున్నారు. కాకపోతే పాట పాతదే అయినా రాగం మాత్రం కొత్తది. ఎలాగంటే అప్పట్లో కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలన్నారు. ఇఫుడు కాంగ్రెస్ ను కలుపుకుని నరేంద్రమోడి యేతర పార్టీలంటున్నారు. అప్పటికి ఇప్పటికీ తేడా ఏమిటంటే ఆర్ధికంగా చంద్రబాబు బాగా బలోపేతమయ్యారు.

 

అప్పట్లో తిరిగినట్లే ఇపుడు కూడా శరద్ పవార్, మాయావతి, దేవేగౌడ, కుమారస్వామి, స్టాలిన్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ తదితర నేతలను కలిశారు. అయితే వారిలో ఎంతమంది చంద్రబాబుతో కలవటానికి సుముఖంగా ఉన్నారనే విషయంలో స్పష్టత లేదు. ఎందుకంటే, చంద్రబాబుకు ఉన్నట్లు మోడితో వ్యక్తిగత వైరం ఒక్క కేజ్రీవాల్ కు మాత్రమే ఉంది. ఏపిలో ఓడిపోతే తక్షణ సమస్య చంద్రబాబుకు మాత్రమే ఉంది. శరద్ పవార్, స్టాలిన్, మమతా బెనర్జీ, మాయావతిలకు నరేంద్రమోడి వల్ల తక్షణ సమస్యలేమీ లేవు.

 

పైగా రేపటి ఎన్నికల్లో భాగస్వామ్య పార్టీలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సొస్తే మోడి అడిగితే పై నేతల్లో కొందరు మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అదే విధంగా మోడి స్ధానంలో ప్రధానిగా ఇంకోరుంటారని బిజెపి ప్రకటించి మద్దతు అడిగితే చంద్రబాబు మద్దతిచ్చే అంశాన్నీ కూడా కొట్టేయలేం. చంద్రబాబు ప్రస్తుత వ్యతిరేకత మోడిపైనే కానీ బిజెపిపైన మాత్రం కాదు. అప్పుడు ఏ ఎల్ కె అద్వానీ లాంటి వాళ్ళు చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడితే వెంటనే చంద్రబాబు మద్దతిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే 1996లో ఉన్న పరిస్ధితులు ఇఫుడు లేవనే చెప్పాలి. అప్పట్లో ఏవో సిద్ధాంతాలపై చాలా పార్టీలు ఏకమయ్యాయి. కానీ ఇఫుడు సిద్ధాంతాలు వెనక్కుపోయి అవసరాలు మాత్రమే కలుపుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో చంద్రబాబు 1996 మ్యాజిక్ ను ఎంత వరకూ రిపీట్ చేయగలరో చూడాలి.