చంద్రబాబుకు ఎంపిల షాక్ తప్పదా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలుగుదేశంపార్టికి చెందిన ఎంపిలపై బిజెపి కన్ను పడిందట. ఎలాగైనా కనీసం ఓ ఐదుగురు ఎంపిలను లాగేసుకోవాలని కమలంపార్టీ నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

ఢిల్లీ స్ధాయిలో తీసుకున్న నిర్ణయాన్ని డిల్లీలోనే అమలు చేయటానికి పెద్ద ప్రణాళికతోనే బిజెపి నేతలున్నారట. అందుకనే ముందుగా  రాజ్యసభ సభ్యులతో టచ్ లోకి వెళ్ళినట్లు పచ్చ పత్రికే చెబుతోంది.  రాజ్యసభలో టిడిపికి 6 మంది సభ్యులున్నారు. వారితో మాట్లాడే బాధ్యత బిజెపిలో కీలక నేతకు అప్పగించారట.

టిడిపిలో ఉన్న రాజ్యసభ సభ్యుల్లో సిఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ రావు, తోట సీతారామలక్ష్మి, టిజి వెంకటేష్, కనకమేడల రవీంద్ర ఉన్నారు. వీరిలో కనకమేడల, తోట తప్ప మిగిలిన వారందరూ వ్యాపారస్తులే. పైగా సిఎం, సుజనా అయితే అనేక కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు. కాబట్టి వీళ్ళలో కొందరు ఏ రోజైనా చంద్రబాబుకు షాక్ ఇచ్చే అవకాశం ఉంది.

ఇక లోక్ సభ ఎంపిల విషయం చూస్తే గెలిచిందే ముగ్గురు. వారిలో విజయవాడ ఎంపి కేశినేని నాని గడచిన పదిరోజులుగా  చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆయన ఇప్పటికే బిజెపి నేతలతో టచ్ లోకి వెళ్ళారనే ప్రచారం బాగా జరుగుతోంది. కాబట్టి ఏ రోజైనా నాని టిడిపిలో జెండా ఎత్తేయచ్చని టిడిపి నేతలే అనుమానిస్తున్నారు.

కాబట్టి ఏ విధంగా చూసినా ఇటు అసెంబ్లీలో కానీ అటు పార్లమెంటులో కానీ చంద్రబాబుకు షాకులు తప్పేట్లు లేదు.  అధికారంలో ఉన్నపుడు యధేచ్చగా ఫిరాయింపులను ప్రోత్సహించారు చంద్రబాబు. నియమాలు, సంప్రదాయాలు వేటినీ చంద్రబాబు అప్పట్లో పట్టించుకోలేదు. ఇపుడదే అంశం చంద్రబాబు మెడకే చుట్టుకుంటోంది. జగన్ విలువల గురించి మాట్లాడుతున్నా బిజెపికి ఆ అవసరం లేదు. కాబట్టి తొందరలోనే షాక్ తప్పేట్లు లేదు.