పవన్ కు సినీరంగం షాక్ తప్పదా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న విషయాలు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది అందరిలోను. సినిమారంగానికి చెందిన సెలబ్రెటీల్లో ఎక్కువమంది జగన్మోహన్ రెడ్డికే జై కొడుతున్నారు. ముందుముందు ఇంకెతమంది వైసిపికి జిందాబాద్ అంటారో తెలీదు. సరే సినిమారంగానికి చెందిన వారిలో మొదటినుండి తెలుగుదేశంపార్టీకి జై కొట్టిన వాళ్ళే ఎక్కువ. కాబట్టి టిడిపిలో కూడా కొందరు ప్రముఖులున్నారు. సినిమారంగానికి చెందిన వారిలో కొందరు టిడిపిలోను మరికొందరు వైసిపిలోను ఉంటే మరి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంగతేంటి ? ఇపుడిదే అందరిలోను అనుమానం మొదలైంది.

 

ఇప్పటి వరకూ సినిమారంగానికి చెందిన వారిలో పవన్ కు మద్దతుగా నిలిచిన వారు ఎవరూ పెద్దగా కనబడటం లేదు.  సినిరంగంలో మెగాకుటుంబానికి మంచిపట్టుంది. చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ పెట్టినపుడు కూడా కొందరు సినీ ప్రముఖులు మద్దతు పలికారు. కానీ పవన్ విషయమే ఎవరికీ అర్ధం కావటం లేదు. టిడిపిలో రాజమండ్రి ఎంపి మురళీమోహన్, ఏలూరుకు చెందిన అంబికా కృష్ణ, కమెడియన్ వేణుమాధవ్ ఉన్నారు. తాజాగ బాపు బొమ్మ దివ్యవాణి కూడా టిడిపిలో చేరారు. ఇక వైసిపిలో సీనియర్ నటుడు విజయ్ చందర్, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, భానుచందర్ లాంటి వాళ్ళున్నారు. ఇంకెతమంది చేరుతారో తెలీదు.

 

ఇక జనసేన విషయం చూస్తే చెప్పుకోవటానికి సినీరంగానికి చెందిన  ప్రముఖులెవరూ కనబడటం లేదు. మరి సినిమా రంగంలో పవన్  ప్రముఖుడే. అయినా ఎవరూ ఎందుకు చేరలేదో అర్ధం కావటం లేదు. కనీసం సోదరులు చిరంజీవి, నాగుబాబు కూడా జనసేన వైపు చూడటం లేదు. పైగా పవన్ ఇంట్లో మాత్రమే తమ్ముడంటూ నాగుబాబు చేసిన తాజా కామెంట్ సంచలనంగా మారింది. కనీసం చిరంజీవన్నా జనసేనలోకి వస్తే చిరంజీవి కోసమైనా కొందరు జనసేనలో చేరే అవకాశం ఉంది. కానీ ఆ ముచ్చట కూడా జరిగేట్లు కనబడటం లేదు.

 

చంద్రబాబును కాదని పలువురు ప్రముఖులు వైసిపిలో చేరుతున్నారంటే కారణముంది. వచ్చే ఎన్నికల్లో టిడిపి ఓటమి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఓడిపోయే పార్టీలో ఎందుకులే అని దూరంగా ఉన్నారని అనుకోవచ్చు. అదే సమయంలో జగనే కాబోయే సిఎం అనే ప్రచారం నేపధ్యంలో పలువురు వైసిపి వైపు ఆకర్షితులవుతున్నారని అనుకోవటమూ సహజమే. మరి పవన్ పరిస్దితి చూస్తే అటు ఇటు కాకుండా పోయాడే అనుమానం వస్తోంది. చూడబోతే పవన్ గురించి సినీ ప్రముఖులెవరూ పెద్దగా పట్టించుకున్నట్లు కనబడటం లేదు. అందుకే పవన్ కు మద్దతుగా సినీరంగానికి చెందిన వారెవరూ కనబడటం లేదు. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.