హాట్ టాపిక్… 50 రోజుల్లో చంద్రబాబు షాకింగ్ పెర్ఫార్మెన్స్ ఇదే!?

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కూటమి అధికారంలోకి రావడంలో జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కంటే ఎక్కువగా చంద్రబాబు ఇచ్చిన హామీలు వర్కవుట్ అయ్యాయనేది తెలిసిన విషయమే! జగన్ పై ఎంత కోపం ఉన్నా 11 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉండకపోవచ్చు.. కానీ కూటమి ఇచ్చిన హామీలు ఆ స్థాయిలో ప్రభావం చూపగలిగాయి.

ఎన్నికలకు ముందు వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పులపాలు అయిపోయిందని, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని చంద్రబాబు & కో తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అలా చెబుతూనే… తాము అధికారంలోకి వస్తే ఆల్ మోస్ట్ రెట్టింపు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. అదేలా అని ప్రశ్నించినవారికి… సంపద సృష్టిస్తామంటూ గట్టిగా దబాయించిమరీ చెప్పారు చంద్రబాబు!

కట్ చేస్తే… ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయిపోయింది. అదేమిటి.. కనీసం మూడు నెలలు అయినా వెయిట్ చెయ్యాలి కదా? అని ఎవరైనా అనొచ్చు. అది ఫస్ట్ టైం సీఎం అయిన జగన్, రేవంత్ రెడ్డి లాంటివారికి అప్లై అవుతుంది తప్ప… నలభై ఏళ్ల అనుభవం ఉండి, నాలుగోసారి సీఎం అయిన వ్యక్తికి అప్లై కాదు!!

చంద్రబాబుకి కూడా మూడు నెలలు, ఆరు నెలలూ హనీమూన్ పిరియడ్ అడిగితే అంతకు మించిన నిస్సిగ్గు చర్య మరొకటి ఉండదు..! ఆ కోరిక చంద్రబాబుని అగౌరవ పరచడం కిందే లెక్క! అందుకని నెల రోజులు బాబుకి చాలా ఎక్కువ! అయితే… ఇప్పుడు బాబు అధికారంలోకి వచ్చి రమీరమీ 50 రోజులు కావొస్తుంది. మరి ఈ 50 రోజుల్లో బాబు ఏమి చేశారు.. ఎంత సంపద సృష్టించారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఈ 50 రోజుల్లో చేసిన అప్పు అక్షరాల 12 వేల కోట్ల రూపాయలు. ఇదేమీ చిన్న విషయం కాదు! మొదటి 50 రోజుల్లోనే 12 వేల కోట్ల అప్పు అంటే… ఇక ముందు ముందు పరిస్థితి ఏమిటనేది ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. కేంద్రం అప్పు ఇప్పించే రూ.15వేల కోట్లూ పూర్తిగా అమరావతి నిర్మాణానికే అయిపోతాయి.. అసలు ఆ 15వేల కోట్లు అమరావతికి ఏమూలకి?

అయితే ఈ విషయంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మౌనాన్నే తన భాషగా చేసుకున్నారు. పైగా అమరావతికి అప్పు ఇస్తే మోడీకి థాంక్స్ చెబుతున్నారు. దీంతో… పవన్ కు విషయం అర్ధం కాలేదా.. లేక, ఆత్మవంచన చేసుకుంటున్నారా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇక ఓ వర్గం మీడియా అయితే… ఏపీలో చంద్రబాబు సర్కార్ అసలు అప్పులే చేయడం లేదు అన్నట్లుగా ఆ వార్తలను దాచేస్తోంది!?

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… పవన్ ప్రశ్నించకపోయినా.. శ్వేతపత్రాల పేరు చెప్పి అసలు విషయాన్ని బాబు దాచాలని ప్రయత్నించినా.. ఓ వర్గం మీడియా తాము చెబితే తప్ప ప్రజలకు తెలియదనే అజ్ఞానంలో ఉన్నా.. ప్రజలకు తెలిసేది తెలుస్తూనే ఉంది. పైగా జగన్ కి వచ్చిన 40% ఓటు బ్యాంక్ తో పాటు న్యూట్రల్ ఓటు బ్యాంక్ ఈ విషయాలను నిశితంగా పరిశీలిస్తోందనే ఉంది.

బాబు ఇప్పటివరకూ సంపద సృష్టించలేదు అనే కంటే… ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదనే చెప్పాలి! పైగా జాతీయ స్థాయిలో ఏపీలో శాంతిభద్రతల విషయం వైరల్ గా మారడం.. అక్కడ అంబానీకి అత్యంత సన్నిహితులు కూడా జగన్ తో కనిపించడంతో… ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు ముందుకు వచ్చే అవకాశం కూడా కష్టమని అంటున్నారు. మరి బాబు ఇవన్నీ గమనిస్తున్నారా.. లేక, ఇంకా సుమారు నాలుగు సంవత్సరాల 10 నెలలు ఉందని ధైర్యంగా ఉంటారా అనేది వేచి చూడాలి.

ఏది ఏమైనా… చంద్రబాబు త్వరగా సంపద సృష్టించే పనిలో ఉండాలి.. అలా కాకుండా ఇంకా ఆ కియా పేరే చెప్పి పబ్బం గడిపేద్దామంటే… అస్తమానం ఒకేలా కుదరకపోవచ్చు!