వైఎస్ జగన్‌లో ఆ పోరాట స్ఫూర్తి ఏమైపోయింది.?

Fighting Sprit Of Jagan
Fighting Sprit Of Jagan
CM Jagan MohanReddy

అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీని కాదని, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ స్థాపించి.. ఎన్నో రాజకీయ ఇబ్బందుల్ని ఎదుర్కొని.. ఎట్టకేలకు నిలదొక్కున్నారు వైఎస్ జగన్ రాజకీయాల్లో. ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడం కోసం వైఎస్ జగన్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. సుదీర్ఘ పాదయాత్ర చేశారు.. టీడీపీ – బీజేపీలను ఎదుర్కొన్నారు.. జనసేన నుంచి పోటీని తట్టుకున్నారు. ఇంతలా అన్ని వైపుల నుంచీ వచ్చే ఆపదల్ని ఎదుర్కొన్న వైఎస్ జగన్, ముఖ్యమంత్రి పదవిలో వుండీ.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎందుకు ఇప్పుడు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు.? అన్నది వైసీపీ శ్రేణులకు కూడా అర్థం కావడంలేదు. ప్రత్యేక హోదా విషయంలో కావొచ్చు, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు పరిశ్రమ, మూడు రాజధానులు.. ఇలాంటి విషయాల్లో కావొచ్చు.. వైఎస్ జగన్ ఎందుకు కేంద్రంతో పోరాటం చేయలేకపోతున్నారన్నది మిస్టరీగా మారింది. ‘జగన్ ముఖ్యమంత్రి అయితే..

కేంద్రాన్ని నిలదీసి ప్రత్యేక హోదా సాధించగలరు..’ అన్న నమ్మకం జనంలో వుండబట్టే, 2019 ఎన్నికల్లో ఆయనకు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు రాష్ట్ర ప్రజలు. కానీ, వైఎస్ జగన్.. ఇప్పుడు పూర్తిగా డీలా పడిపోయారు. సంక్షేమ పథకాల్ని పెద్దయెత్తున అమలు చేస్తున్నారు.. ఈ క్రమంలో అనూహ్యంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. సరే, అప్పులనేవి ఏ రాష్ట్రానికైనా, దేశానికైనా సర్వసాధారణమనుకోండి. అది వేరే సంగతి. కానీ, ఇంతలా అప్పులు పెరిగిపోతే, అది రాష్ట్ర భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తుంది. అప్పులు కావాలంటే, కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవాలి. అదే సమయంలో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడితే ఎలా.? ప్రత్యేక హోదా ఏడేళ్ళ క్రితమే రావాల్సి వుంది.. కానీ, ఇప్పటికీ రాలేదు. భవిష్యత్తులో వచ్చే అవకాశమూ కన్పించడంలేదు. పోలవరం ప్రాజెక్టు కూడా ఈపాటికే పూర్తయిపోవాలి.. కానీ, అది ఇప్పుడు పూర్తవుతుందో స్పష్టత లేదు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కూడా వైసీపీ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష గతంలో చేసిన వైఎస్ జగన్, ఇప్పుడు ఆ నినాదాన్ని గట్టిగా వినిపించి.. రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కి సైతం పిలుపునివ్వలేకపోతున్నారెందుకో.! విశాఖ ఉక్కు కోసం జరుగుతున్న బంద్‌కి మద్దతిచ్చినట్లే.. ప్రత్యేక హోదా కోసమో.. మూడు రాజధానుల కోసమో.. వైసీపీ అలాంటి ఆందోళనలు ఎందుకు చేయడంలేదట.? లోపం ఎక్కడుంది.? అసలేం జరుగుతోంది ఆంధ్రపదేశ్‌లో.!