(యనమల నాగిరెడ్డి)
తెరాసకు అత్యంత అనుకూలంగా ప్రారంభమై చంద్రబాబు రాకతో ఉత్కంఠతా భరితంగా మారిన తెలంగాణా ఎన్నికలు పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన సర్వేలు ప్రజలను, పండితులను అయోమయంలో పడవేశాయి. కెసిఆర్ ప్రారంభించి అమలు చేసిన సంక్షేమ ఫథకాలు, పూర్తి కాని నీటిపారుదల ప్రాజెక్టులను ఆయనే పూర్తి చేస్తారనే ఆశతో తెలంగాణా ప్రజలు ఆయనను అందలం ఎక్కిస్తారా? లేక ఆయన ఇంతకాలం ప్రజాప్రతినిధుల పట్ల, ఇతరుల పట్ల చూపించిన అహంకారానికి శిక్ష వేస్తారా? లేక చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన మహాకూటమికి పట్టంకడతారా? అన్న ప్రశ్నలు అందరిని ప్రస్తుతం వేధిస్తున్నాయి.
కెసిఆర్ ఎత్తుగడలు- అమలు చేసిన ఫథకాలు
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కోసం కెసిఆర్ అనేక రకాల ఎత్తుగడలు వేశారు. తెలంగాణా వాదులను ఐక్యం చేయడం, మీడియాను తెలంగాణా వాదానికి అనుకూలంగా మార్చుకోవడం, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావులు, మావోయిస్టులు, కళాకారుల సహకారం సాధించారు. అన్ని రాజకీయ పార్టీలను కలపడం కోసం రాజకీయాలకు సంబంధం లేని ప్రొఫెసర్ కోదండరాంను జేఏసీ అధ్యక్షుడి గా చేసి “నాన్ అలైన్డ్ ఉద్యమం” గా ఈ ఉద్యమానికి రంగువేశారు. అలాగే కాంగ్రెస్ నాయకులను ఉత్తేజపరిచి కేంద్రంలో సోనియా గాంధీ తో సహా యూపీఏ ప్రభుత్వాన్ని,బీజేపీ నాయకులను ఒప్పించి “ లాబీయింగ్” చేయడంలో విజయం సాధించారు. అందరినీ అనేక రకాల వాగ్దానాలతో ఒప్పించి, మెప్పించి తెలంగాణను విజయవంతంగా సాధించారు. “ఈ క్రమంలో పూర్తిగా నష్టపోయింది మాత్రం రాయలసీమ మాత్రమే”.
తెలంగాణా ఏర్పడిన తర్వాత తనదైన శైలిలో రాజకీయం నడిపి ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ నీటి పధకాలు ప్రారంభించడం, తెలంగాణాకు నీటి వాటా సాధించడం కోసం కృషి చేశారు. ఆయన ప్రాజెక్టులు ప్రస్తుతానికి సగంలో ఉన్నాయి. ఇకపోతే ఆయన “ 24 గంటల విద్యుత్, రైతుబంధు, వృధ్యాప్య పెన్షన్, ఒంటరి మహిళలకు పెన్షన్,కులవృత్తుల ఆధారంగా సబ్సిడీ ఫథకాలు, మహబూబ్ నగర్ లాంటి కరువు జిల్లాలకు నీళ్లు సరఫరా చేయడం” లాంటి పధకాలను అమలు చేసి ప్రజల మద్దతు పొందారు.
ప్రతిపక్షాలు ఆయన పై చేసిన “ అవినీతి ఆరోపణలు, కుటుంభ పాలన” అంశాలు ఈ ఎన్నికలలో పెద్దగా ప్రభావం చూపలేక పోయాయి.అయితే ఆయన ఎవరికీ (మంత్రులు,ఎమ్మెల్యేలతో సహా) అందుబాటులోఉండరని, ఉద్యమకారులను పట్టించుకోలేదని, ప్రభుత్వా ఉద్యోగాల కల్పనలో విఫలం అయ్యారని, ఎవరిని లెక్కచేయకుండా అహంకారంతో “మోనార్క్” లాగా వ్యవహరించారనే ఆరోపణలు మాత్రం మేధావులలో, మధ్య తరగతి ఓటర్ల లో ప్రభావం చూపాయని చెప్పవచ్చు. అలాగే వ్యాపార వర్గాలలో తెరాస పట్ల కొంత వ్యతిరేకత ఉంది (ఇందుకు సరైన కారణాలు తెలియలేదు). అలాగే ఆయన కుమారుడు కేటీర్ మంత్రి అయినా ముఖ్యమంత్రి నివాసంలో ఉండి జనానికి అందుబాటులో లేరనే ఆరోపణలున్నాయి. కెసిఆర్ కుటుంభసభ్యులలో హరీష్ రావు, కొంతమేరకు ఎంపి కవిత తప్ప మిగిలిన వారు ప్రజలకు అందుబాటులో లేరనే జనం చెపుతున్నారు.
మహాకూటమి గెలుపు-ఓటమికి కర్త, క(ఖ)ర్మ చంద్రబాబే!
కెసిఆర్ ముందుగా శాసనసభను రద్దు చేయడంతో వచ్చిన మధ్యంతర ఎన్నికలే ఆయుధంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తన శైలిలో (తన భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం) రాజకీయ ఎత్తుగడలు వేసి కాంగ్రెస్ తో చేతులు కలిపారు. ఈ ఎన్నికలలో కెసిఆర్ ను ఓడించి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఏకైక లక్ష్యంతో చంద్రబాబు మహాకూటమిని ఏర్పాటు చేయగలిగారు.చంద్రబాబు ఈ ఎన్నికలలో తన రాజకీయ (40 సంవత్సరాల ఇండస్ట్రీ) అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించి, నిద్రావస్థలో జోగుతున్న కాంగ్రెస్ ను నిద్ర లేపి మహా(యా)కూటమిని ఏర్పాటు చేసి, కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో సహా అందరి నాయకులను, భాగస్వామ్య పార్టీలను తన కనుసన్నలలో నడిపగలిగారు. తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ, పోల్ మేనేజ్మెంటులో తనదైన శైలిలో పనిచేసి అన్నిటికీ తానే “కర్త, క(ఖ)ర్మగా” మెలిగారు. అలాగే తన అంతేవాసులతో కలసి “ఆర్ధిక, అంగ బలం, మీడియా” లను కూటమికి పూర్తి అనుకూలంగా చంద్రబాబు పనిచేయించ గలిగారు.
“తన రెండు కళ్ల సిద్ధాంతంతో” తెలంగాణా లో ఏర్పడిన వ్యతిరేకత, గత నాలుగు సంవత్సరాలుగా కార్యకర్తలను, పార్టీని పట్టించుకోకపోవడం వల్ల పార్టీలో ఏర్పడిన సూన్యత, రేవంతరెడ్డి లాంటి వారు పార్టీకి దూరం కావడం , ఓటుకు నోటు కేసు లాంటి అనేక అంశాలు చంద్రబాబు ప్రతిష్టను ఇక్కడ మసకబర్చాయి.
ఈ దశలో చంద్రబాబు రావడం వల్ల కాంగ్రెస్ కు ఎంత లాభం కలిగిందో, అంతే నష్టం కలిగిందని పరిశీలకులు అంటున్నారు.
తెలంగాణలో మధ్యంతర ఎన్నికల ప్రకటన నాటికి “కెసిఆర్ వ్యతిరేక పవనాలపై ఆశలు పెట్టుకున్న” కాంగ్రెస్ నిద్రావస్థలో జోగుతూ ఉన్నప్పటికీ బలంగానే ఉందని జనాభిప్రాయం. చంద్రబాబు తో కూటమి ఏర్పాటు చేయకుండా ఉంటె కాంగ్రెస్ తప్పకుండా బలమైన పోటీ ఇచ్చిఉండేదని కొందరు పండితుల అభిప్రాయం. ఈ ఎన్నికలలో మహాకూటమి తరుఫున సర్వశక్తులు ఒడ్డి పోరాడిన చంద్రబాబే కూటమి గెలిచినా, ఓడినా కారణమవుతారని చెప్పక తప్పదు.
సర్వము కోల్పోయిన టీజేస్
ఇకపోతే ఈ ఎన్నికలలో పూర్తిగా నష్టపోయింది మాత్రం టీజెస్ అని చెప్పవచ్చు. కెసిఆర్ ను, ఆయన వ్యవహార శైలిని పూర్తిగా వ్యతిరేకించిన వారు, తెలంగాణా ఆకాంక్షలను నిరవేర్చుకోవాలన్న ఆశపడుతున్న వారు, ఇతర పార్టీలకు దూరమైన వారు మద్దతు ఇవ్వడంతో ఏర్పడిన టీజెస్ ఎన్నికల నాటికి (బలమో-వాపో తెలియదు) బలంగా కనిపించింది. కొంతమేరకు తెరాస కు గండి కొడుతుందని అందరూ అభిప్రాయ పడ్డారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు టీజెస్ ప్రతిష్టను బాగా తగ్గించాయి. పార్టీ టికెట్లు ఆశించిన వారికి టికెట్లు సాధించడంలో కోదండరాం విఫలం కావడం, జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహించిన రచనారెడ్డి లాంటి వాళ్ళు పార్టీని వదలడం టీజెస్ కు పెద్ద దెబ్బగా మారింది. ఈ ఎన్నికలలో కోదండరాం ఆశించిన మేరకు ఆయన అనుచరగణం పనిచేయలేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఏది ఏమైనా ఈ ఎన్నికలలో తెలంగాణా జనం కెసిఆర్ సంక్షేమ పథకాలకు, నీటి పారుదల పథకాలకు పెద్దపీట వేసి అందలం ఎక్కిస్తారా లేక ఆయన చూపిన అహంకారానికి శిక్ష వేస్తారా అన్న అంశంతో పాటు, చంద్రబాబు ఎత్తుగడలు పారి మహాకూటమికి గెలుపు లభించి, ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలు నిజం అవుతాయా? కావా అన్న ప్రశ్నలకు సమాధానాలు ఈ నెల 11న దొరుకుతాయి.