స్థానిక సంస్థల ఎన్నికల సమరంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. ఎవరి నోట చూసినా ఆయన గెలుస్తాడా, ఇయన గెలుస్తాడా అన్న చర్చే. అసలు వ్యక్తిగతంగా ఆయన గా పనులు చేసిండు.ఈయన గీ పనులు చేసిండు అని ముచ్చట. బాయికాడ, కలువ పోయిన కాడ, పత్తి ఏరే కాడ, పశువులు, గొర్లమేకలు కాపేకాడ ఏడ చూసినా ఇదే ముచ్చట. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రచారంలో మునిగిపోయారు. అయితే నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడుకి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఆ గ్రామానికి కమ్యూనిష్టుల కంచుకోటగా పేరుంది. ఆ కంచుకోటను కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి బొంతల చంద్రారెడ్డి.
బొంతల చంద్రారెడ్డి చిన్నతనంలోనే కమ్యూనిష్టు ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. చంద్రారెడ్డి హైదరాబాద్ లో చదువుతుండగా గ్రామానికి చెందిన కొంత మంది పెద్దలు నీ అవసరం పార్టీకి గ్రామానికి ఉందని చెప్పడంతో మరోసారి ఆలోచించకుండా గ్రామానికి వచ్చి పార్టీ అభివృద్దికి కృషి చేశారు. గ్రామంతో పాటు చుట్టు పక్కల ఊర్లను బలోపేతం చేశారు. అప్పడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని నాయకుడిగా 1981 లో మొట్ట మొదటి సారి చంద్రారెడ్డి సర్పంచ్ గా గెలిచారు. 1981 నుంచి 1995 వరకు తిరుగులేని నాయకునిగా వెలిమినేడు గ్రామ సర్పంచ్ గా సేవలందించారు. ఆయన పదవిలో ఉన్నా గర్వం దగ్గరకు రానీయకుండా నిత్యం ప్రజల కోసం పని చేశారు. ఆ కాలంలోనే కొట్లాడి గ్రామానికి అనేక అభివృద్ది పనులు చేశారు.
1988 లో చిట్యాల మండలంలోనే మొట్టమొదటిసారి వాటర్ ట్యాంక్ ను వెలిమినేడులో ఏర్పాటు చేయించారు. 1990 లోనే ఇంటింటికి నల్లాలిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తక్కువ ఖర్చుతోనే నల్లాల కనెక్షన్లు ఇచ్చారు. ఇప్పుడు బిసి కాలనీగా పిలవబడుతున్న స్థలంలో అంతా పిచ్చి చెట్లతో కూడుకొని ఉండేది. అది ప్రభుత్వ భూమి కావడంతో అధికారులు, ఎమ్మెల్యేతో మాట్లాడి ఆ స్థలాన్ని ఇండ్ల స్థలాలుగా మార్చి ఇల్లు లేని పేదలకు పట్టాలిప్పించారు. వడ్డెర కాలనీ మరియు ఎస్సీ కాలనీ కూడా ఆ విదంగా ఏర్పడినవే. సబ్ స్టేషన్ ఏర్పాటు, పశువుల దవాఖానా, ప్రాథమిక ఆస్పత్రి ఏర్పాటు చేసిన ఘనత కూడా చంద్రారెడ్డికే దక్కింది. ప్రాథమిక ఆస్పత్రి కోసం స్థలం కొని ఇచ్చారు. హైస్కూల్ కు ఎక్కువ మంది ఉపాధ్యాయులు వచ్చేలా విద్యాశాఖతో మాట్లాడి ఎక్కువ పోస్టులు మంజూరు అయ్యేలా చూశారు.
చంద్రారెడ్డి సర్పంచ్ గా ఉన్న సమయంలో అనేక మందికి ఉపాధి చూపించారు. ఆయన సర్పంచ్ గా ఉన్నప్పుడే కొందరిని పంచాయతీ కార్యాలయ సిబ్బందిగా తీసుకున్నారు. వారందరికి కూడా ఇప్పుడు పర్మినెంట్ అయ్యింది. హెల్పర్లుగా, లైన్ మెన్లుగా, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులుగా, టిచర్లుగా ఉన్నారు. నర్రా రాఘవరెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయనతో మాట్లాడి అనేక మందికి ఉద్యోగాలిప్పించారు. ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్, ఆర్టీసీలో పలువురు ఉద్యోగులుగా చేస్తున్నారు. వెలిమినేడు ఆంజనేయ స్వామి గుడిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని కోర్టులో కేసు వేసి కొట్లాడారు. ఆ గుడిలో కూడా కొంత మంది సిబ్బందిని తీసుకొగా వారికి కూడా ఇప్పుడు పర్మినెంట్ ఉద్యోగాలయ్యాయి.
పేరేపల్లి ఎంపీటిసిగా కూడా పని చేశారు. 1995 సర్పంచ్ గా ఉన్న సమయంలోనే జిల్లా పార్టీ, రైతు సంఘం రాష్ట్ర నాయకత్వం బాధ్యతలు అప్పగించడంతో హైదరాబాద్ కు మకాం మార్చారు. ఆ తర్వాత కూడా సీపీఎం తరపున అరూరి వీరయ్య సర్పంచ్ గా గెలిచారు. 2000 సంవత్సరంలో హోంమంత్రి గా ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డి చనిపోవడంతో భువనగిరి అసెంబ్లీ స్థానం ఖాళీ ఏర్పడింది. దీంతో ఆ సమయంలో సీపీఎం తరపున ఎమ్మెల్యే అభ్యర్దిగా బొంతల చంద్రారెడ్డి పోటి చేసి ఓటమి పాలయ్యారు. అంచెంలంచెలుగా ఎదుగుతూ సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులుగా, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పని చేసే స్థాయికి వచ్చారు. ఎన్ని పదవులు అలంకరించినా, ఆయన స్థాయి పెరిగినా సాదాసీదాగానే బతుకుతున్నారు. ఇప్పటికి కూడా ఆర్టీసీ బస్సు, ఆటోలలోనే ప్రయాణిస్తూ సామాన్యునిగానే నిరాడంబర జీవితం గడుపుతున్న వ్యక్తిగా చంద్రారెడ్డికి పేరుంది.
ఇప్పుడు గ్రామంలో ఇతర పార్టీలో ఉన్న నాయకులకు ఓనమాలు నేర్పిందే చంద్రారెడ్డి అని గ్రామస్థులు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో పాత్ర పోషించి వెలిమినేడు రాజకీయాలను రాష్ట్రానికి పరిచయం చేసిన ఘనత చంద్రారెడ్డికే దక్కుతుందని వారన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో వెలిమినేడు గ్రామానికి జనరల్ మహిళ రిజర్వు అయ్యింది. గ్రామం మీద మమకారంతో చంద్రారెడ్డి తన కోడలు బొంతల లక్ష్మీ ఉపేందర్ రెడ్డిని బరిలో నిలిపారు. వెలిమినేడు గ్రామానికి ఓ రూపు రేఖ తీసుకొచ్చిన వ్యక్తి మరో సారి తన బలం నిరూపించుకోబోతున్నాడు. ధనం, మద్యం ప్రభావితం చేసే ఈ ఎన్నికల్లో మంచితనమే గెలుస్తుందన్న నమ్మకముందని చంద్రారెడ్డి అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు. ఒక్క రిమార్క్ లేని నేతగా చంద్రారెడ్డి ఉన్నారు. ఆయన చేసిన పనులే ఆయన మద్దతిచ్చిన వ్యక్తిని గెలిపిస్తాయా లేక ఇతరాత్ర ప్రలోభాలు గెలుస్తాయా అనేది చూడాలి.
బొంతల లక్ష్మీ ఉపేందర్ రెడ్డి తెలుగు రాజ్యంతో మాట్లాడారు.. ఆమె ఏమన్నారంటే
” సిపిఎం, అనుబంధ సంఘాల మద్దతుతో వెలిమినేడు గ్రామ సర్పంచ్ అభ్యర్ధిగా బరిలోకి దిగాను. నాకు ప్రజా సమస్యల పై అవగాహన ఉంది. వాటన్నింటి పరిష్కారం కోసం కృషి చేస్తాను. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి, రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తాను. నేను ఎక్కువగా చెప్పదలుచుకోెలేదు. చేసే చూపించాలని నిర్ణయించుకున్నాను. మహిళల సమస్యల పట్ల అవగాహన ఉంది కాబట్టి వారికి ఎల్లవేళలా అండగా ఉంటాను.
గ్రామంలో చదువుకునే అమ్మాయిలు ఎంత చదువుకుంటే అంత చదువుకునేలా ప్రోత్సాహిస్తాం. మహిళలు కూడా ఈ రోజుల్లో అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. మా గ్రామం నుంచి కూడా కలెక్టర్లు, ఎస్పీలు, మంచి ఉద్యోగులు అయ్యేలా మేం ప్లాన్ వేస్తాం. మేజర్ అయ్యాకనే అమ్మాయిలకు పెళ్లిలు చేసేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాను. గ్రామం నుంచి చదువుకునేందుకు వెళ్లే విద్యార్దులకు సమయానికి బస్సులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. హైస్కూలులో కూడా విద్యా విధానం మెరుగుపడి ఉత్తమ ఫలితాలు సాధించేలా చూస్తాం. గ్రామ గ్రంథాలయంలో కాంపిటేటివ్ పోటి పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు అందుబాటులో ఉంచి గ్రామం నుంచే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేలా విద్యార్ధులకు సహాయం అందిస్తాం. హైస్కూల్ లో కమ్యూనికేషన్ క్లాసులు పెట్టించి పిల్లలకు చిన్నతనంలోనే తమ జీవిత లక్ష్యాల పై క్లారిటి వచ్చే విధంగా చూస్తాం.
వైద్య రంగానికి సంబంధించి… గ్రామంలో వ్యవసాయ కుటుంబాలు అధికంగా ఉన్నాయి. వారు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లినప్పుడు తేలు, పాము కాటులకు గురయ్యే అవకాశం ఉంది. కనీసం కుక్క కరిస్తే కూడా మందు అందుబాటులో లేదు. ఇక ఆ పరిస్థితి లేకుండా గ్రామ హాస్పిటల్ లో మందులు అందుబాటులో ఉండేలా చూస్తాం. గర్బిణీ స్త్రీల ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు డేటా అనలైజ్ చేసి శిశు మరణాల రేటు తగ్గేలా చూస్తాం. జన్మనిచ్చిన ఏ తల్లి మరణించకూడదు. జన్మించిన ఏ బిడ్డ చనిపోకూడదు. వెలిమినేడు ప్రాథమిక ఆస్పత్రి హైవే పై ఉండడంతో 30 పడకల ఆస్పత్రిగా మారాల్సిన అవసరముంది. హైవే పై నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. సరైన వైద్యం అందక అనేక మంది చనిపోతున్నారు. 30 పడకల ఆస్పత్రిగా మారి 24 గంటల వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని సర్కార్ పై ఒత్తిడి తెస్తాను. ప్రతి ఆరు నెలలకొకసారి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తాం.
ఉపాధికి సంబంధించి కూడా చాలా మంది గ్రామంలో ఉన్నత చదువులు చదివినా చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా ఉంది. అలా కాకుండా విద్యావంతులంతా ఉన్నత స్థానంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. వారికి ఉపాధి కల్పించే మార్గాలు చూపిస్తాం.
విద్యుత్ విషయంలో కూడా చాలా బాావుల దగ్గర స్తంభాలు సరిగాలేవు. షార్ట్ సర్క్యూట్ వల్ల గతంలో అనేక మంది రైతులు చనిపోయారు. ఇటీవల కాలంలో గొర్రెలు కాపేందుకు వెళ్లిన విద్యార్ధి కూడా మరణించాడు. ఇక నుంచి గ్రామంలో అటువంటి పరిస్థితి విద్యుత్ శాఖాదికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం.
గ్రామంలో జమ్మికుంట, గూడెం చెరువు ద్వారా పొలాలకు నీరు మళ్లీంచే ప్రయత్నాలు చేస్తాం. తాగునీటి సమస్య లేకుండా చేస్తాం. గ్రామంలో కాలనీలకు సీసీ రోడ్డు వేయిస్తాం. సిరిపురం వెలిమినేడు, సిరిపురం వెల్లంకి రోడ్లను బిటి రోడ్లుగా చేయిస్తాం. గ్రామంలో డ్రైనేజిల వ్యవస్థ మెరుగు పరుస్తాం. పశువుల దవాఖానాను పటిష్టం చేసి పశు సంపదను కాపాడుకుందాం. గ్రామంలో అల్లర్లకు తావు లేకుండా శాంతియుత వాతావరణం ఉండేలా చూస్తాను. వెలిమినేడు మేజర్ గ్రామానికి మండలం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. మండలం చేసేందుకు గ్రామస్థుల సహకారంతో శాయశక్తులా కృషి చేస్తాను. మా మామ చంద్రారెడ్డి గారు చేసిన పనులు ప్రజల కళ్లముందే ఉన్నాయి. నాకు అవకాశం ఇస్తే ఆయన సలహాలు, సూచనలతో పాటు గ్రామ పెద్దల సహాకారంతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను.
నేను మిమ్ముల నమ్ముతున్నా.. మీరు నన్ను నమ్మండి. నిరంతరం గ్రామంలోనే ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. డబ్బు, మద్యం కు ప్రభావితులై మీ ఓటును అమ్ముకోవద్దని మనవి చేస్తున్నాను.” అని లక్ష్మీ అన్నారు.