వివేకా హత్య కేసు… వైరల్ గా “వైర్” లాగిన విషయాలివి!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యోదంతంపై సీబీఐ ఫైనల్‌ చార్జిషీట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మొత్తం 259 మంది సాక్షుల అభిప్రాయాలను సేకరించిన సీబీఐ… ఫైనల్ చార్జ్ షీట్ ను సమర్పించింది. ఇందులో భాగంగా… వివేకా హత్యకు రాజకీయ కారణాలు, కుటుంబ విభేదాలే కారణమని చెప్పింది.

అయితే వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ చాలా అంశాలను వదిలేసిందని “ది వైర్‌” వెబ్‌ సైట్‌ చెబుతోంది. ఈ మేరకు వివేకా హత్య కేసు – సీబీఐ ఎంక్వైరీ కి సంబంధించి ఒక కీలక కథనాన్ని ప్రచురించింది. దీంతో ఇప్పుడు ఈ కథనం హాట్ టాపిక్ గా మారింది. ఈ కథనంలో పొందుపరచబడిన అంశాలు.. లేవనెత్తిన ప్రశ్నలు.. సీబీఐ వదిలేసిన కీలక విషయాలపై చర్చ మొదలైంది.

చంద్రబాబు సీఎం – ప్రతిపక్షంలో జగన్:

2019 మార్చి 15 అర్ధరాత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు.. అప్పుడు ఏపీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు. సాధారణ ఎన్నికలకు సుమారు నెల రోజులకు ముందు ఈ హత్య జరిగింది. టీడీపీ నేతలే వివేకాను చంపారని అప్పట్లో జగన్‌ ఆరోపించారు.

ఈ సమయంలో జగన్‌ తో పాటు.. వివేకానంద కుటుంబ సభ్యులు, వివేకా హత్యపై సీబీఐ విచారణ జరగాలని పిటిషన్లు వేశారు. అయితే అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా జీవో జారీ చేశారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక:

2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏపీలో ప్రభుత్వం మారింది. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. సీబీఐ దర్యాప్తు చేయాలని 2020 మార్చి 11న ఏపీ హైకోర్టు తీర్పు నిచ్చింది. కేసు నమోదుకు 120 రోజులు తీసుకున్న సీబీఐ.. 2021 అక్టోబర్‌ లో మొదటి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

ఎర్ర గంగిరెడ్డి, యాదవ్‌, ఉమాశంకర్‌, దస్తగిరి పేర్లను అందులో నమోదు చేసింది. హత్యకేసులో పలు ఆధారాలను ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, అవినాష్‌ రెడ్డిలు చెరిపేశారని.. హత్య, కుట్ర సహా పలు సెక్షన్లు పెట్టింది సీబీఐ. అయితే దర్యాప్తును వైర్‌ వెబ్‌ సైట్‌ అనేక ఎపిసోడ్‌ లుగా వివరించింది.

1558 రోజుల తర్వాత సిబిఐ ఫైనల్ రిపోర్ట్:

వివేకా హత్య జరిగిన 1558 రోజుల తర్వాత సిబిఐ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. ఫైనల్‌ ఛార్జ్‌ షీట్‌ పరిశీలిస్తే.. ఎన్నో అంశాలను సీబీఐ వదిలేసినట్లు తెలుస్తోందని వైర్‌ తెలిపింది. ఫైనల్ గా… వివేకా హత్యకేసులో సీబీఐ ఛార్జ్‌ షీట్ల ప్రకారం దర్యాప్తు పూర్తయ్యిందో లేదో అనుమానమే అంటోది!

వివేకా కుమార్తె సునీత స్టేట్ మెంట్:

వివేకా ఒక్కగానొక్క కుమార్తె సునీత ఇచ్చిన స్టేట్‌మెంట్లే ఆధారంగా 2004 తర్వాత వివేకానంద రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరని.. హత్యకు 15 సంవత్సరాలు ముందు మాత్రమే వివేకా పాలిటిక్స్‌ లో యాక్టివ్‌ గా ఉన్నారని వైర్‌ చెబుతోంది. హత్య సమయానికే.. తన తండ్రి పాలిటిక్స్‌ లో రిటైర్‌ అయినట్లు రెండుసార్లు సీబీఐకి స్టేట్‌ మెంట్లు ఇచ్చారని పేర్కొంది.

2019లో ఎన్నికల నోటిఫికేషన్‌ కు ముందే అవినాష్‌ ఎంపీ:

2014 ఎన్నికల్లో అవినాష్‌ మెజారిటీ 1.90లక్షల ఓట్లు. 2019లో మార్చి 10న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. మార్చి 17నే అభ్యర్థుల వివరాలు ప్రకటించాల్సినప్పటికీ.. మృతి కారణంగా మార్చి 19న అభ్యర్థుల లిస్టును ప్రకటించారు జగన్. ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే.. అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నారు.

ఇదే క్రమంలో… 2014 కడప ఎన్నికల్లో అవినాష్‌ కు 1.90 లక్షల మెజారిటీ ఉంది. అలాంటప్పుడు అవినాష్‌ వీక్‌ కాండిడేట్‌ ఎలా అవుతాడని వైర్‌ ప్రశ్నిస్తోంది. అవినాష్ ని కాదని వివేకాకు ఎంపీ సీటు ఇస్తారనే అనుమానంతో హత్య జరిగిందని ఎలా అంటారని పేర్కొంది?

అవినాష్‌ కోసం వివేకా ప్రచారం… సునీత భర్త స్టేట్‌ మెంట్‌:

సునీత భర్త రాజశేఖర్ రెడ్డి సైతం అవినాష్ రెడ్డి ఎంపీ టికెట్ పై సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చారు. అవినాష్ రెడ్డి ఎంపీ అభ్యర్థి అంటూ మర్డర్ కి ముందు అవినాష్ కోసమే వివేకా ప్రచారం నిర్వహించినట్టు రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. వివేకానంద రెడ్డి సోదరి విమల సైతం కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డేనని చెప్పినట్టు వైర్‌ అంటోంది.

2021లో జులైలో పార్టీ స్థాపించిన షర్మిల:

వివేకా హత్య జరిగిన రెండేళ్లకు.. షర్మిల..జగన్‌ నుంచి దూరమయ్యారు.. ఆ తర్వాత.. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిలతో విజయమ్మ కలిశారు. జగన్ షర్మిల మధ్య బేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ షర్మిల తో వివేకానంద రెడ్డి కడప సీటు గురించి మాట్లాడారా లేదా అనే దానికి ఎలాంటి ఆధారం లేదు. రాజ్యసభ సీటు విషయంలో అన్నాచెల్లెలి మధ్య అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. ఈ సమయంలో అన్నా చెల్లెలి మధ్య వివేకా ఏం చెప్పారన్నది ఎవరికీ తెలియదు.

సీనియర్‌ లీడర్‌ తిట్టారని ఎవరైనా హత్య చేస్తారా..?:

ఎన్నికల ముందు ఎవరైనా హత్యకు పాల్పడతారా..? 2014, 2019 ఎన్నికల్లో అవినాష్‌ మెజారిటీ లక్షల్లో ఉంది. ఈ సమయంలో ఎంతో అనుభవమున్న ఒక రాజకీయ నేత తిట్టారనే కారణంతో హత్య చేస్తారా? 2019లో వివేకా హత్యకు గురయ్యారు. అప్పుడు ఎన్నికల హడావిడి.. ఎన్నికలు ముందు పెట్టుకుని ఎప్పుడో రెండేళ్ల కింద తమను తిట్టాడని ఏ లీడర్‌ అయినా హత్యకు పాల్పడతారా?

చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వివేకా:

వివేకా కేర్ టేకర్ రాజశేఖర్ స్టేట్మెంట్ ప్రకారం.. ఆర్ధిక ఇబ్బందులతో వివేకానంద రెడ్డి ఆందోళన చెందినట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల.. దస్తగిరి, సునీల్ యాదవ్ లతో వివేకా ఎక్కువగా వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. ఫైనాన్షియల్‌ టెన్షన్స్‌తో వివేకా మోతాదుకు మించిన మద్యాన్ని సేవించేవారు.

ఈ సమయంలో 8 మంది దగ్గర నుంచి సుమారు ఐదు కోట్ల రూపాయలు వివేక అప్పుగా తీసుకున్నారు. అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్టరీ కోసం నాలుగు కోట్లు వివేకా ఖర్చు పెట్టారని వైర్‌ వెబ్‌ సైట్‌ డీటైల్డ్‌ గా చెబుతోంది.

క్రెడిట్‌ స్కోర్‌ కోసం నాన్నకు చెక్‌ పవర్‌ తీసేశామన్న సునీత:

తన తండ్రికి క్రెడిట్‌ స్కోర్‌ లేనందు వల్ల.. తమకు క్రెడిట్‌ కార్డు రావడం లేదని..అందుకే కొన్ని మార్పులు చేయాలనుకుని నాన్నకు చెక్‌ పవర్‌ తీసేశాము. అయినా తన తండ్రి పేరు మీద 50 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. తన తండ్రితో పాటు.. తన భర్త నిర్వహిస్తున్న వ్యాపారాలకు తాను డైరెక్టర్‌గా ఉన్నానని సునీత సీబీఐకి చెప్పారు.

డ్రైవర్‌ దస్తగిరి, వాచ్‌ మెన్‌ రంగన్న స్టేట్‌ మెంట్లతోనే దర్యాప్తు:

మొదటి నుంచీ వైఎస్ ఫ్యామిలీ క్రిస్టియన్ గా కన్వర్ట్ అవ్వడంతో అటు టిడిపి ఇటు బిజెపి వారిపై విమర్శలు చేస్తూ వచ్చేది. వీరికి క్రిస్టియానిటీ నుంచీ ఫండ్స్ ఎక్కువగా వస్తున్నాయని విమర్శలు చేసేవారు. అయితే అనంతర కాలంలో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. యుఎస్ పౌరుడు కావటంతో ఆ సమస్యను పక్కకు పెట్టారు.

సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న అంశాలు.. చేసిన ఆరోపణలు చూస్తే కుటుంబ కలహాలు, ఎదుగుదల అడ్డుకోవడమే హత్యకు ప్రధాన కారణాలుగా సిబిఐ అభియోగాలు మోపింది. కేసు మొత్తాన్ని డ్రైవర్‌ దస్తగిరి, వాచ్‌ మెన్‌ రంగన్న స్టేట్మెంట్లతోనే దర్యాప్తు చేసింది. కానీ వారు నిజం చెబుతున్నారని గ్యారంటీ ఏంటి.? అని వైర్ ప్రస్నిస్తోంది.

ఇదే సమయంలో… కేసు మొత్తాన్ని కుటుంబ విభేదాలు కేంద్రంగానే దర్యాప్తు చేసింది తప్ప.. వివేక హత్య లో బయట వారి ప్రమేయం ఏంటనేది సీబీఐ వెలికి తీయలేకపోయింది ఎందుకు? అనేది వైర్‌ వెబ్‌ సైట్‌ ప్రశ్న!

మరి ఈ స్థాయిలో డిటైల్డ్ గా చెబుతున్నట్లు అనిపిస్తున్న “ది వైర్” వెబ్ సైట్ కథనంపై సీబీఐ, సునీత ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి. అసలు రియాక్ట్ అవుతరా లేదా అన్నది కూడా ఆసక్తిగా మారింది.