ఆర్మూర్ లో రోడ్డెక్కిన పసుపు రైతు, ఉద్రిక్త పరిస్థితి

పసుపు రైతులు మరోసారి రోడ్డెక్కారు. పసుపుకి మద్దతు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో “పసుపు రైతు ఆత్మగౌరవ ర్యాలీ” పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతులు రోడ్డు పై కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం మద్దతు ధర ఇస్తామని ప్రకటించినా కూడా ఇంత వరకు అది అమలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో పసుపు రైతులు అత్యధికంగా ఉండడంతో వారికి తగిన వసతులు కల్పించాలన్నారు. 

పసుపు పంట వాణిజ్య పంట కావడంతో అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, దానికి మధ్దతు ధర కల్పించాలంటే కేంద్ర పసుపు బోర్డు మాత్రమే చేయగలదని చెప్తూ నేతలు తప్పించుకుంటుని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టిఆర్ఎస్ నాయకులతో పాటు ఎంపీ కవిత సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చినా అది ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. రైతుల ఆందోళనతో ఆర్మూర్ లో భారీ ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో పోలీసులు వారికి సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా వారు ఆందోళన విరమించలేదు. వీరికి రైతు సంఘాల నాయకులు మరియు ఇతర పార్టీ నేతలు మద్దతు పలికారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 

                                  పసుపు రైతుల డిమాండ్లు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కానీ ఆర్మూరులో కానీ వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేసి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చెయ్యాలి

నందిపేట్ మండల కేంద్రంలో స్మార్ట్ ఆగ్రో మెగా ఫుడ్ పార్క్ ను త్వరగా ఏర్పాటు చేయాలి

వేల్పూర్ మండలం లోని పడగల్ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న పసుపు పార్క్ కు అయ్యే వ్యయం మొత్తం 30.82కోట్లు విడుదల చేసి పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి పసుపు పంటను కొనుగోలు చేసేలా కృషి చేయాలి

పడగల్ నుండి పసుపు ను విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రత్యేక బ్రాండ్ సృష్టించాలి పసుపును  మద్దతు ధర కు కొనుగోలు చెయ్యాలి

పసుపు శుద్ధి చేసే పరిశ్రమలకు రాయితీలిచ్చి పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి అయ్యేలా చూడాలి

పసుపు సాగు పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. ఒకవేళ ధర పడిపోతే ఈ విభాగం ద్వారా కొనుగోలు చేయాలి. ఇందుకు 500 కోట్లతో ప్రత్యేక నిధి కేటాయించాలి. రైతు తక్కువ ధరకు అమ్మి నష్టపోతే  ఈ నిధి నుండి పరిహారం చెల్లించాలి.

రైతులకు నాణ్యమైన ఎర్రజొన్న మరియు పసుపు విత్తనాలను 75% రాయితీతో రైతులకు అందించాలి. ఈ రాయితీ కోసం బడ్జెట్లో 100 కోట్లు కేటాయించాలి. 

పసుపు కొమ్ములు ఉడకబెట్టక ఆరబెట్టడానికి ఊరికి 15 చదరపు మీటర్ల సిమెంట్ కల్లాలు ఏర్పాటు చేయాలి.

పసుపు పంటను నిల్వ చేయడానికి 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాముల ను నిర్మించాలి.

జాతీయ ఎలక్ట్రిక్ వ్యవసాయ మార్కెట్ , ఈ నామ్ లో చేరి పసుపుని మార్కెట్లో ఆన్లైన్లో అమ్మకాలు జరిగేలా చూడాలి.

ఎర్ర జొన్న పంట మరో పది రోజుల్లో చేతికి వస్తుండడంతో వ్యాపారులు రైతులను మోసాగించేందుకు పావులు కదుపుతున్నారు. అలా కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. 

ప్రతి సారి రైతు ఎర్రజొన్న విత్తనాలను దళారుల దగ్గర అధిక ధరలకు కొని రైతు మోసపోతున్నాడు. ఇప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం 75% రాయితితో విత్తనాలను సరఫరా చేయాలి. 

గత ఏడాది లాగే ఈ సారి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ  టీ పి ఎస్ సి ద్వారా 4000 రూపాయలకు ఎర్రజొన్నలను కొనుగోలు చెయ్యాలి. అని రైతులు డిమాండ్ చేస్తున్నారు.