యనమల ఏదో పొడిచేస్తారని అనుకుంటే చివరికి చంద్రబాబు పరువును తీశారు 

TDP strategy over Amaravathi is failed

మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో దూకుడుగా వెళుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో బ్రేకులు పడ్డ సంగతి తెలిసిందే.  శాసన సభలో ఆమోదం, మండలిలో రభస అనంతరం గవర్నర్ సంతకంతో మూడు రాజధానుల శాసన ప్రక్రియ పూర్తైనట్టేనని భావించింది.  అయితే హైకోర్టు రాజధాని తరలింపుపై స్టేటస్ కో ఇవ్వడంతో విశాఖలో కూర్చొని పాలన చేయాలన్న జగన్ ఆశలకు బ్రేకులు పడ్డాయి.  దీని వెనుక ప్రతిపక్షం టీడీపీ ఉందనేది నిర్వివాదాంశం.  కోర్టుకెళ్లి స్టే తీసుకొచ్చింది వారే.  మొదట్లో ప్రజా ఉద్యమం ద్వారా మూడు రాజధానులని ఆపాలని అనుకున్నారు చంద్రబాబు.  కానీ ప్రజల్లో ఉద్యమం చేయాలనే ఉద్దేశ్యం లేకపోవడంతో అది కాస్త  నీరుగారింది.  దాంతో కేంద్రం మీద ఆశలు పెట్టుకున్నారు.  మోదీ శంఖుస్థాపన చేసిన రాజధాని కాబట్టి తీసేస్తామంటే బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోదని భావించారు.  

కానీ అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని  విషయమని, అందులో తాము కలుగజేసుకోలేమని తేల్చి చెప్పేసింది.  అక్కడితో ఆ ఆశ కూడ ఆవిరైంది.  దీంతో సొంత వ్యూహాలతో రెడీ అయింది ప్రతిపక్షం.  రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని బిల్లును ఆపాలని చూసింది.  శాసన సభలో ఆమోదం పొందిన మూడు రాజధానుల బిల్లు శాసన మండలిలో కూడ ఆమోదం పొందాలి.  అసెంబ్లీలో తీర్మానం అయ్యాక బిల్లు మండలికి వచ్చింది.  సాధారణంగా అయితే బిల్లును ఆమోదించడమా, తిరస్కరించడమా లేకపోతే సవరణలు ఏవైనా ఉంటే చెప్పడమా చేయాలి.  ఇక్కడే టీడీపీ తన తెలివిని ప్రదర్శించింది.  సెలెక్ట్ కమిటీ అంశాన్ని తెరమీదకు తెచ్చింది.  మండలిలో  టీడీపీకి మెజారిటీ ఉండటంతో మండలి చైర్మన్ షరీఫ్ బిల్లును సెలెక్ట్ కమిటీ పంపుతూ నిర్ణయం తీసుకున్నారు.  

TDP strategy over Amaravathi is failed
TDP strategy over Amaravathi is failed

మండలిలో ఎలాగూ మెజారిటీ టీడీపీదే కాబట్టి కమిటీలో కూడ వారి ప్రాతినిథ్యమే ఎక్కువ.  అక్కడ బిల్లును ఆపేస్తే మూడు రాజధానుల అమలును ఆలస్యం చేయవచ్చనేది టీడీపీ వ్యూహం.  ఇదంతా టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పన్నిన వ్యూహం.  ఈ వ్యూహం మొదట్లో బాగానే ఉందని అనిపించినా తర్వాత పెద్ద తప్పిదమని తేలింది.  విచారణలో జడ్జీలు శాసన మండలిలో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపినప్పుడు శాసన సభ రెండోసారి ఎలా తీర్మానం చేస్తుందని అడిగారు.  రాజ్యాంగం మేరకు మూడు నెలలలోపు బిల్లు మండలి నుండి రాకపోతే తిరిగి చట్టం చేయవచ్చని, అందుకే చేయడం జరిగిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.  

అయితే మండలి చైర్మన్ చెప్పిన మేరకు బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లకపోవడానికి శాసన సభ కార్యదర్శి కారణమని ఆరోపణలున్నాయి కదా అనే ప్రశ్నకు ప్రభుత్వం తరఫున న్యాయవాది మండలి చైర్మన్ తన ఆదేశాలను కావాలనే అమలు జరపట్లేదని భావిస్తే కోర్టుకు వచ్చేవారు కదా.  కానీ రాలేదు.  అంటే అవి నిరాధార ఆరోపణలనే కదా అర్థం అన్నారు.  న్యాయవాది చెప్పినట్టు చైర్మన్ కోర్టులో పిర్యాధు చేయలేదు.  అంటే అక్కడ శాసన సభ కార్యదర్శి బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా అడ్డుపడ్డారనేది అవాస్తవమని తేలింది.  కాబట్టి ప్రతిపక్షం కావాలనే  బిల్లును ఆలస్యం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆమోదించకుండా, తిరస్కరించకుండా, సవరణలు సూచించి వెనక్కు పంపకుండా ఇలా సెలెక్ట్ కమిటీ పేరును వాడుకుందని రూఢీ అయిపోయింది.  అలా.. యనమల వేసిన వ్యూహం విఫలమై టీడీపీ మరోసారి వెనక్కు తగ్గాల్సి వచ్చింది.