అర్థరాత్రి ముగిసిన టిడిపి హైడ్రామా, లోక్ సభ అభ్యర్థులు వీరే…

పదిమంది సిటింగ్ లతో టిడిపి లోక్ సభ అభ్యర్థులు జబితా…

తీవ్రమయిన ఉత్కంఠ, టెన్షన్ తర్వాత లోక్‌సభకు పోటీ చేసే తెలుగు దేశం అభ్యర్థుల జాబితాను సోమవారం అర్ధరాత్రి దాటాక పార్టీ  విడుదల చేసింది. ఈ విషయంలో వైసిపికంటే బాగా వెనకబడటంతో ఒకేసారి 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. జాబితాలో పది మంది సిట్టింగ్‌ ఎంపీలున్నారు. చివరి దాకా అభ్యర్థులను టెన్షన్ కు గురిచేసి, ఇలా అర్థరాత్రి , చివరి నిమిషంలో జాబితానువిడుదల చేయడం చంద్రబాబు ఎపుడూ చేసే పనే.

ఇద్దరు రాష్ట్ర మంత్రులు, నలుగురు కేంద్ర మాజీ మంత్రులకు  టిడిపి జాబితాలో చోటు కల్పించారు. అనుకున్నట్లుగా నే రాజమహేంద్రవరం, అనంతపురంలో ప్రస్తుతం ఎంపీలు వారసులకు టికెట్లు తెచ్చుకోగలిగారు. ఇద్దరెే ఇద్దరు మహిళలకూ సీట్లు దక్కాయి. నలుగురు ఎస్సీలు, అయిదుగురు బీసీలు, ఒక ఎస్టీ ల పేర్లున్నాయి జాబితాలో. సిటింగ్ ఎంపిలు కె.రామ్మోహన్‌నాయుడు, అశోక గజపతిరాజు, మాగంటి బాబు, కొనకళ్ల నారాయణ, కేశినేని నాని, గల్లా జయదేవ్‌, రాయపాటి సాంబశివరావు, శ్రీరామ్‌ మాల్యాద్రి, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్‌లను కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఇందులో కొందరి పేర్లు మాయమవుతాయని భావించినా, సర్వేలలో సిటింగ్ లకే ఓట్లు ఎక్కువ పడటంతో వారినే కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది.

రాజమహేంద్రవరం ఎంపి తాను ఈ సారి పోటీచేయనని ప్రకటించడంతో ఆయన కోడులు మాగంటి రూపకు సీటు కేటాయించారు.

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కూడా రాజకీయాలనుంచి రిటైర్ కావాలనుకుంంటున్నట్లు చెబుతూ కుమారుడికి టికెట్ అడిగారు. ఆయన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డికి టికెట్‌ దక్కింది. అదే విధంగా విశాఖ డెయిరీ ఛైర్మన్‌ అడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌కు అనకాపల్లి సీటు దక్కింది.

ఇటీవల పార్టీలో చేరిన మాజీ కాంగ్రెస్ కేంద్ర మంత్రులు కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డికి కర్నూలు, వైరిచర్ల కిశోర చంద్రదేవ్‌కి అరకు, పనబాక లక్ష్మికి తిరుపతి లోక్‌సభ టికెట్లు దక్కాయి. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు విజయనగరం నుంచే పోటీ చేస్తారు. . చలమలశెట్టి సునీల్‌కి కాకినాడ సీటు ఇచ్చారు.

రాష్ట్ర మంత్రులకు సంబంధించి, కడప జిల్లా కు చెందిన జమ్మలమడుగు మంత్రి సీహెచ్‌ ఆదినారాయణరెడ్డికి కడప సీటు గతంలోనే ఖరారయింంది. మరొక మంత్రి శిద్దా రాఘవరావును ఒంగోలు లోక్‌సభ నుంచి లోక్ సభ కు తలపడతారు. ఆయనను ఒప్పించడం కూడా  జాప్యానికి కారణమని చెబుతారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజుకి నర్సాపురం సీటును కేటాయించారు.

అభ్యర్థులు వీరే: 

శ్రీకాకుళం- కె.రామ్మోహన్‌నాయుడు
విజయనగరం- అశోక గజపతిరాజు
విశాఖపట్నం- భరత్‌ (ఎమ్ వి విఎస్ మూర్తి కుమారుడు)
అనకాపల్లి – అడారి ఆనంద్‌
అరకు (ఎస్టీ)- వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌
కాకినాడ- చలమలశెట్టి సునీల్‌
అమలాపురం(ఎస్సీ) -గంటి హరీష్‌
రాజమహేంద్రవరం- మాగంటి రూప
నర్సాపురం- వి.వెంకట శివరామరాజు
ఏలూరు- మాగంటి బాబు
మచిలీపట్నం- కొనకళ్ల నారాయణ
విజయవాడ- కేశినేని వెంకటేశ్వర్లు (నాని)
గుంటూరు – గల్లా జయదేవ్‌
నరసరావుపేట- రాయపాటి సాంబశివరావు
బాపట్ల(ఎస్సీ)- శ్రీరామ్‌ మాల్యాద్రి
ఒంగోలు- శిద్దా రాఘవరావు
కడప- సీహెచ్‌ ఆదినారాయణరెడ్డి
నెల్లూరు- బీదా మస్తాన్‌రావు
నంద్యాల- ఎం.శివానందరెడ్డి
కర్నూలు- కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
రాజంపేట- డీకే సత్యప్రభ
అనంతపురం- జేసీ పవన్‌కుమార్‌రెడ్డి
హిందూపురం- నిమ్మల కిష్టప్ప
తిరుపతి-(ఎస్సీ) పనబాక లక్ష్మి
చిత్తూరు(ఎస్సీ)- ఎన్‌.శివప్రసాద్‌