నెల్లూరు జిల్లాలో టిడిపికి ఇద్దరి షాక్ ?

సంవత్సరాల తరబడి తెలుగుదేశంపార్టీకి మద్దతుగా నిలబడిన వెంకటగిరి రాజా కుటుంబం తాజాగా పార్టీకి షాక్ ఇవ్వనున్నట్లు  పార్టీలో ప్రచారం మొదలైంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయ్. వెంకటగిరి ఎంఎల్ఏ కురుగుండ్ల రామకృష్ణ, మున్సిపల్ ఛైర్ పర్సన్ శారద మధ్య ఏర్పడిన గొడవలతో పార్టీ ఇమేజి మొత్తం నాశనమైపోయింది.

గడచిన నాలుగేళ్ళుగా పై ఇద్దరి వర్గాలమధ్య ప్రతీ విషయంలోను కీచులాటలే. వీరిద్దరి మధ్య రాజీ కుదుర్చేందుకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అండ్ కో ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో చాలామంది నేతలు వారి వైఖరితో విసిగిపోయారు. ఇటువంటి పరిస్ధితుల్లోనే గూడూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ కూడా టిడిపిని వదిలేసి వైసిపిలో చేరారు. ఇప్పుడు వెంకటగిరి ఛైర్ పర్సన్ శారద కూడా టిడిపిని వదిలేసేట్లున్నారు.

అందులో భాగంగానే వెంకటగిరి రాజు సర్వజ్ఞకుమార్ యాచేంద్ర కూడా నేతల వైఖరితో విసిగిపోయారట. అందుకనే పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. విషయం తెలియగానే ఎంఎల్ఏ కురుగుండ్లతో పాటు చాలామంది సీనియర్ నేతలు యాచేంద్రను వెళ్ళి కలిశారు. అదే సమయంలో వైసిపి నేతలు కూడా యాచేంద్ర ప్యాలెస్ కు వెళ్ళి మాట్లాడారు. దాంతో టిడిపిలో పెద్ద కలకలం మొదలైంది. రెండు పార్టీల నేతలు యాచేంద్రతో చర్చలు జరుపుతున్న విషయం బయటకు పొక్కింది.

నిజానికి యాచేంద్రతో టిడిపి నేతలు కలవటంలో, మాట్లాడటంలో పెద్ద వింతేమీ లేదు. ఎందుకంటే, అంతా ఒకే పార్టీనే కాబట్టి. కానీ యాచేంద్రతో వైసిపి నేతలు కూడా మాట్లాడ్డంతోనే అందరిలోను ఉత్కంఠ మొదలైంది. అదే విషయమై మీడియాతో యాచేంద్ర మాట్లాడుతూ ఈరోజుకు తెలుగుదేశంపార్టీలోనే ఉన్నానని, రేపటి ఎన్నికల్లో ఏ పార్టీకి పనిచేయాలనే విషయం డిసైడ్ చేయలేదన్నారు. తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయం వెంకటగిరి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పటంతో టిడిపి నేతల్లో కలవరం మొదలైంది. ఒకవేళ వెంకటగిరి రాజకుటుంబం గనుక తటస్తంగా ఉన్నా లేకపోతే వైసిపికి మద్దతుగా నిలబడినా మూలిగే నక్కపై తాటిపండు పడినట్లవుతుంది తెలుగుదేశంపార్టీ పరిస్ధితి.