సిఎం రమేష్  చాలా తెలివైనోడు

తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు, చంద్రబాబునాయుడు బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఎం రమేష్ చాలా తెలివైనోడు సుమా ! ఎందుకంటే, రెండు రోజులుగా తన ఇళ్ళు, కార్యాలయాల్లో ఐటి సోదాలు జరుగుతున్నా ఢిల్లీలోనే కూర్చున్నారు. సోదాల్లో విలువైన డాక్యుమెంట్లు, భారీగా నగలు, నగదు దొరికిందని మీడియాలో వస్తున్నా ఏమాత్రం లెక్క చేయనట్లే కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో తనకున్న పరిచయాల ద్వారా బిజెపి నేతలపై ఒత్తిళ్ళు తేవటానికి ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

అదే సమయంలో రమేష్ ఇంట్లో సోదాలు  చేస్తున్న అధికారులకు కొన్ని లాకర్లు తెరుచుకోవటం లేదు. తీయాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదు. వాటికి తాళాలు లేవు, అలాగని నెంబర్ లకింగ్ సౌకర్యం కూడా కనిపించలేదట. అధికారులు ఇంట్లో వాళ్ళని గట్టిగా అడిగితే ఆ లాకర్లన్నీ వేలిముద్రల ఆధారంగా మాత్రమే తెరుచుకుంటాయని చెప్పారు. మామూలుగానే రమేష్ ఇల్లు చాలా హై సెక్యురిటీ ఏరియాలో ఉంది. అందులోను రాజ్యసభ సభ్యుడి హోదా, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో 24 గంటలూ ఇంటికి భద్రత ఉంటుంది.

అయినా సరే ఇంట్లోని లాకర్లకు వేలిముద్రల స్కానర్ ద్వారా మాత్రమే తెరుచుకునేంత స్ధాయిలో హై సెక్యూరిటీ లాకర్లను వాడుతున్నారంటే ఎంత ముందు జాగ్రత్త, ఎంత తెలివైనోడో అర్ధమైపోతోంది. అంటే తాను ఇంట్లో లేనపుడు ఇంట్లో వాళ్ళు ఎవరు లాకర్లను తెరవాలని ప్రయత్నించినా తెరుచుకోవు. అందుకే ఐటి అధికారులు 36 గంటలుగా ఎంత ప్రయత్నించినా లాకర్లు తెరుచుకోలేదు. ఇక లాభం లేదని ఢిల్లీలో ఉన్న రమేష్ ను వెంటనే హైదరాబాద్ రమ్మంటూ అధికారులు ఆదేశించారు. దాంతో  చేసేది లేక ఢిల్లీ నుండి రమేష్ హైదరాబాద్ కు బయలుదేరారు. ఇంతకీ ఆ లాకర్లలో ఏముందో ?