పొలిటికల్ సర్వేల ఖర్చు ఎవరిది.?

పలు మీడియా సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహిస్తున్నాయి. నిజానికి, ఈ సర్వేల్ని నిర్వహిస్తున్నది మీడియా సంస్థలు, సర్వేల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థలతో కలిసి ఈ వ్యవహారాలు నడుపుతున్నాయి. సదరు మీడియా సంస్థల వెనకాల, ఆయా సర్వేల సంస్థల వెనకాల మళ్ళీ రాజకీయ పార్టీలే వుంటాయన్నది ఓపెన్ సీక్రెట్.

సాధారణంగా, ఈ తరహా సర్వేల వెనుక నేరుగా రాజకీయ పార్టీలుండవ్. ఆయా రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నేతలు లేదా వారి సన్నహితులు.. ఆర్థికంగా ఆయా సర్వేలకు సాయం అందిస్తుంటారు. అదీ అసలు సంగతి. అందుకే, సర్వేల ఫలితాలు ఆయా పార్టీలకు అనుకూలంగా వస్తుంటాయ్.

జాతీయ సర్వేలదీ ఇదే పరిస్థితి. మరి, సర్వేల విశ్వసనీయత సంగతేంటి.? తప్పుడు సర్వేలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కదా.? పరువు పోతే, వాటిని ముందు ముందు ఎవరూ పట్టించుకోని పరిస్థితి వుండదు కదా.? అంటే, దానికి మళ్లీ వేరే లెక్క వుంటుంది.

ఇది సోషల్ మీడియా యుగం. పెయిడ్ మీడియా యుగం.! దేనికైనా హైప్ ఇవ్వడం ఈ రోజుల్లో పెద్ద కష్టం కాదు. ఆయా సర్వేలకి ఆయా రాజకీయ పార్టీలు లేదా మీడియా ఇచ్చే హైప్‌తో అవి ఆటోమేటిక్‌గా ప్రజల్లో చర్చనీయాంశాలవుతాయి. అద్గదీ అసలు సంగతి. తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోన్న చాలా సర్వేల వెనుక.. చాలా చాలా పెద్ద కథ నడుస్తోంది.

లక్షల్లో కాదు, కోట్లల్లో ఈ సర్వేల కోసం ఆయా పార్టీలు ఖర్చు చేస్తున్నాయి. ఏ సర్వే ఫలితం వచ్చినా, అది ఆయా రాజకీయ పార్టీలకు మైలేజ్ పెంచడం కోసమే. సర్వేల ఫలితాలు, రాజకీయ పార్టీల భవిష్యత్తుపై ఏ మేరకు ప్రభావం చూపుతాయి.? అన్నది వేరే చర్చ.

‘ఫలానా పార్టీ గెలిచే అవకాశం వుంది..’ అని సర్వేల ఫలితాలు వస్తే, న్యూట్రల్ ఓటర్లు.. తమ ఓటు మురిగిపోకూడదన్న కోణంలో గెలిచే పార్టీకే ఓటేస్తారన్నది ఓ వాదన. కానీ, అదెంత నిజం.? అన్నదానిపై మళ్ళీ భిన్నాభిప్రాయాలున్నాయి.