విశాఖపట్నం రాజకీయాల్లో చింతకాయల అయ్యన్నపాత్రుడిది దశాబ్దాల అనుభవం. నర్శిపట్నం నుండి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులను నిర్వహించారు ఆయన. అలాంటి అయ్యన్న గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన ఓటమికి జగన్ హవా కంటే తమ్ముడు సన్యాసిపాత్రుడే ప్రధాన కారణమని చెబుతారు. సరిగ్గా ఎన్నికలకు ముందు సన్యాసిపాత్రుడు అన్నకు హ్యాండిచ్చి వైసీపీకి జైకొట్టారు. పార్టీలో చేరకుండానే వైసీపీ అభ్యర్థి గెలుపుకోసం ఆయన పనిచేశారని, కుటుంబ శ్రేణులను చాలావరకు వైసీపీకి అనుకూలంగా తిప్పారని అంటుంటారు. అయ్యన్నలో కూడ అదే అభిప్రాయం ఉండేది.
అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు వేడుకల సమయంలోనే సన్యాసిపాత్రుడు రాజీనామా ప్రకటించారు. దీంతో నర్సీపట్నం టీడీపీ శ్రేణుల్లో అందోళన మొదలైంది. ఒకప్పుడు అన్న మాట జవదాటని తమ్ముడిగా పేరు తెచ్చుకున్న సన్యాసి పాత్రుడు కుటుంబంలో తలెత్తిన వివాదాలతోనే పార్టీని వీడారని లోకల్ లీడర్లు చెప్పేవారు. సన్యాసిపాత్రుడితో పాటు కొందరు కౌన్సిలర్లు కూడా పార్టీని వీడటంతో క్యాడర్ కూడా రెండుగా చీలిపోయాయి. ఈ ఎఫెక్ట్ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా కనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే సన్యాసిపాత్రుడికి మున్సిపాలిటీల్లో మంచి పట్టుంది. అన్నను కాదని వైసీపీకి ఇంత చేసిన సన్యాసిపాత్రుడికి దక్కాల్సిన ప్రతిఫలం దక్కలేదట.
ఎన్నికల అనంతరం వైసీపీలో చేరేటప్పుడు ఆయన ఎమ్మెల్సీ పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. హైకాండ్ సైతం వీలుంటే చూద్దామన్నట్టే చెప్పింది. కానీ రెండేళ్లు గడుస్తున్నా ఆ ఊసే లేదు. ఇక మీదట దక్కుతుందనే ఆశా లేదట. పైపెచ్చు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వర్గం కూడ సన్యాసిపాత్రుడిని పెద్దగా పట్టించుకోవట్లేదని, ఎన్నికల్లో గెలుపు విషయంలో సన్యాసిపాత్రుడు క్రెడిట్ ఏమీ లేదన్నట్టు వ్యవహరిస్తున్నాయని టాక్. దీంతో సన్యాసిపాత్రుడు రానున్న మున్సిపల్ ఎన్నికలకు ఏదో ఒకటి తేల్చుకోవాలని చూస్తున్నారట. పదవి మీద స్పష్టమైన హామీ ఇస్తేనే మున్సిపాలిటీ ఎన్నికల్లో పనిచేస్తానని లేకుంటే వేరే దారి చూసుకుంటానని చెబుతున్నారట. ఒకవేళ ఆయన హెచ్చరికల్ని హైకమాండ్ లెక్కచేయకపోతే సన్యాసిపాత్రుడు తిరిగి అన్న అయ్యన్నపాత్రుడు చెంతకే చేరుకుంటారేమో మరి.