రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే. అధికారపక్షంపై ప్రతిపక్షం పోరాటం చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. అలా చేయకపోతే అది ప్రతిపక్షమే కాదు. అధికార పార్టీ ఎంతగా ప్రజల్ని ఉద్ధరించేశామని చెప్పుకుంటున్నా కింది స్థాయిలో అనేక సమస్యలుంటాయి. అందుకే, దశాబ్దాలుగా అభివ్రుద్ధి అనేది మాటలకే పరిమితమవుతోంది. ప్రభుత్వాల వైఫల్యం గురించి విపక్షాలు మాట్లాడటాన్ని తప్పు పట్టలేం. కానీ, చిన్న చిన్న విషయాలకే రాష్ట్రపతి పాలన.. అంటూ విపక్షాలు నినదిస్తే ఎలా.? తెలుగుదేశం పార్టీ, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్‌కి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంతకాలంగా టీడీపీ నేతల మీద, వైసీపీ శ్రేణుల దాడులు, రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు.. వీటితోపాటు, అధికార పార్టీ నేతల ఆగడాలు.. వీటన్నిటినీ ప్రస్తావిస్తూ జగన్ ప్రభుత్వం అధికారంలో వుండడానికి వీల్లేదంటోంది టీడీపీ. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య తదితరులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయినాగానీ, రాష్ట్రపతి పాలన.. అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అదికార పార్టీకి 151 మంది ఎమ్మెల్యేల బలం వుంది. అభివ్రుద్ధి సంగతెలా వున్నా, సంక్షేమ పథకాల అమలులో మాత్రం రాష్ట్రం దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది.
కరోనా కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాల క్యాలెండర్ ఏమాత్రం వెనుకంజ వేయలేదు. అసలు వీటన్నిటికీ నిధులు ఎలా వస్తున్నాయ్.? అని అధికార పార్టీ నేతలు కొందరు ఆశ్చర్యపోయేలా సంక్షేమ పథకాలు అమలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రతిపక్షం బాధ్యతగా వహించాలి తప్ప, అనవసరపు యాగీ చేయడం ఏమాత్రం సబబు కాదు. పైగా, రాష్ట్రపతి పాలన.. అంటూ పెద్ద మాటలు అస్సలేమాత్రం హర్షనీయం కాదు. ఇక, టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేస్తూ, అధికార పార్టీని బెదిరించే ప్రయత్నం చేసిన విషయం విదితమే. దాదాపు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం వున్న టీడీపీ నుంచి ఇలాంటి చవకబారు ప్రకటనలు రావడం హాస్యాస్పదం కాక మరేమిటి.?