గడ్డేస్తే నంది ఇంటికొస్తుంది!

చంద్రబాబు పేరు చెబితే అంతెత్తున లేచే పోసాని కృష్ణమురళి.. మరోసారి బాబు కేంద్రంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డులు, టాలీవుడ్ లో వెర్రితలలు వేస్తున్న కుల పోకడలపై పోసాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ “ఫస్ట్ డే ఫస్ట్ షో” సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నటుడు, దర్శకుడు, ఏపీ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ పోసాని కృష్ణ మురళి.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందజేసే “నంది” అవార్డులను గ్రూపులు, కులాలవారీగా పంచుకునే వారని పోసాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న సమయంలో అవార్డుల పంపకాలు ఇలాగే జరిగేవని ఆయన ఆరోపించారు. పోసాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం… సినీ ఇండస్ట్రీలో పెను దుమారం సృష్టిస్తున్నాయి.

ఇక నందులతో తనకున్న అనుభవాన్ని పంచుకున్న పోసాని… “టెంపర్” సినిమాలో నటించినందుకు తనకు కర్మకాలి నంది అవార్డు ఇచ్చారని చెప్పారు. ఆ సినిమాలో తాను బాగా నటించడంతో.. గత్యంతరం లేని పరిస్థితిలో తనకు అవార్డు ఇచ్చారన్నారు. తాను కూడా నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరై అవార్డు అందుకున్నానని చెప్పారు. ఆ సమయంలో ఎవరెవరికి ఏ అవార్డులు ఇచ్చారో గమనించినట్లు చెప్పిన పోసాని.. అవార్డుల కమిటీలో 12 మంది ఉంటే.. వారిలో 11 మంది ఒక కమ్మసామాజికవర్గం వారే ఉన్నట్లు గుర్తించానని షాకింగ్ కామెంట్లు చేశారు.

ఫలితంగా… నంది అవార్డులను సైతం గ్రూపులు, కులాలవారీగా పంచుకున్నట్లు అర్థమై తనకు వచ్చిన అవార్డును కూడా వద్దని చెప్పినట్లు పోసాని తెలిపారు. అవార్డులను కులాలు, మతాలకు అతీతంగా అందించాలని, కేవలం టేలెంట్ చూసి అవార్డు ఇవ్వాలే కానీ.. రికామండేషన్లతో ఇవ్వకూడదని పోసాని పేర్కొన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీని డబ్బు, కులమే శాసిస్తోందని పోసాని చెప్పారు.

కాగా, పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలను ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ ఖండించారు. నంది అవార్డుల పంపకంపై పోసాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమం కాబట్టి.. పార్టీ పరంగా ఆయన మాట్లాడి ఉండవచ్చని అభిప్రాయపడిన ఆయన… నంది అవార్డుల ఎంపిక ఎంతో పారదర్శకంగా జరుగుతుందని అంటున్నారు. ఇక “టెంపర్” సినిమాలో పోసాని నటనకు నంది అవార్డు వచ్చిందేతప్ప… కులం, మతం చూసి ఇవ్వలేదని స్పష్టం చేశారు.

పోసాని అన్నారని కాదు కానీ… ఈ విషయంలో మెజారిటీ సినీ జనాలు ఆఫ్ ద రికార్డ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో జర్నలిస్టులతో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడిన సందర్భంలో చాలా మంది నటీనటులు ఒక్కమాటతో నంది అవార్డుల గురించి చెప్పారు. అదేమిటంటే… అవార్డులదేముంది సోదరా… “గడ్డేస్తే నంది ఇంటికొస్తుంది” అని! ఈ ఒక్క మాట చాలు… నంది అవార్డులపై సినీజనాల్లోనే ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పడానికి!

Posani Krishna Murali Comments On Nandi Awards | V6 News