ఏ.పిని ముందుగానే తాకిన ఎన్నికల తుఫాను 

(యనమల నాగిరెడ్డి)

 

సముద్రాలలో వాయుగుండాలు పుట్టినపుడు తుఫానులు రావడం, వేసవి కాలంలో ఎండలు మండడం సాధారణం. కానీ 2019లో రావలసిన “ఎన్నికల సెగ” ఎన్నికలకు చాలా ముందుగానే ఆంధ్రప్రదేశ్ ను తాకింది. గత రెండు సంవత్సరాలుగా ఆంద్రప్రదేశ్ లో సాగుతున్న ఎన్నికల రాజకీయ గందరగోళం ఇటీవల కొన్ని పత్రికలు టీడీపీ వైస్సార్ పార్టీల నుండి పార్లమెంట్ కు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రచురించి ఎన్నికల సమరానికి తెర తీశాయి.

 

సాధారణంగా ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన చేయడానికి  రెండు, మూడు నెలలకు ముందు ఎన్నికల సందడి ప్రారంభమై అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగానే ప్రజలలో చర్చోపచర్చలదారి తీస్తుంది. దానితో ఎన్నికల వేడి గ్రామ స్థాయికి పాకడం ఆనవాయితీ.

కాలక్రమేణా ఈ పద్దతిలో మార్పు వచ్చింది.1983లో ఎన్.టి.ఆర్. రంగ ప్రవేశంతో 9నెలల పాటు పార్టీలలోను, ప్రజలలోనూ ఎన్నికల కోలాహలం నెలకొనింది. అదే వరవడిని 1989, 1994, 1999 ఎన్నికల వరకూ రాజకీయ పార్టీలు కొనసాగించాయి. 

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పేరుతో 2003 లోనే ఏ.పి లో ఎన్నికల శంఖం పూరించి, 2004 ఎన్నికలకు చాలా ముందుగా శ్రీకారం చుట్టారు. 2009 ఎన్నికలకు ముందు కూడా రాష్ట్రంలో సుమారు రెండు సంవత్సరాల పాటు ఎన్నికల వేడి కొనసాగింది.

2009 ఎన్నికల తరవాత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అకాల మరణం, రాష్ట్ర విభజన అంశం, సమైఖ్య రాష్ట్ర ఉద్యమం, రాష్ట్ర విభజన లాంటి సంఘటనల నేపథ్యంలో 2014 ఎన్నికలకు కొంచెం ముందు వరకూ రెండు ప్రాంతాలలోనూ ఎన్నికల వేడి పుట్టలేదు.

అయితే 2014 ఎన్నికలు ముగిసినప్పటి నుండి రెండు రాష్ట్రాలలో కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతి అంశాన్ని ఎన్నికల దృక్పధంతోనే చూడటం వల్ల 2015 నుంచే ఇక్కడ ఎన్నికల వాతావరణం ఏర్పడిందని చెప్పక తప్పదు.

ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికలలో రాష్ట్రంలో బహుముఖ పోటీ తప్పని స్థితి కనిపిస్తున్నది. తెలంగాణా లో లాగా టీడీపీ ఏ.పి.లో కూడా తన జన్మ విరోధి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలో దిగుతుందని వినిపిస్తుంది. వైస్సార్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలుస్వంతంగాను, కమ్యూనిస్టుల అండ దండలతో జనసేన ఎన్నికల రణరంగంలో నిలిచే స్థితి ఇప్పటికి కనిపిస్తున్నది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తుగడలు, జగన్ రెడ్డి పాద యాత్రలు, జనసేన యాత్రలు, బీజేపీ నిరంతర సమావేశాలు రాష్ట్రంలో ఎన్నికల సునామీని చాలా ముందుగా సృష్టించాయి. 

2014లో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలిచింది.  తృటిలో అధికార పీఠం చేజార్చుకున్న వైస్సార్ అధినేత జగన్ అప్పటి నుండి 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అడుగులు వేశారు. అందుకు ప్రతిగా చంద్రబాబు కూడా అదే పంథాలో పయనించారు. రాష్టానికి, ప్రత్యేక హోదానా, ప్యాకేజీనా అన్న అంశంపై ఇరుపార్టీలు వేసిన ఎత్తుగడలు రాష్ట్రంలో ఎన్నికల సమరానికి ఎపుడో శ్రీకారం చుట్టాయి.

ప్రత్యేక హోదా పేరుతో వైస్సార్ పార్టీ ఎం.పిలతో రాజీనామాలు చేయించి యుద్దభేరి మోగించగా, ఇదే అంశంపై బీజేపీతో తెగతెంపులు చేసుకుని టీడీపీ కూడా వైస్సార్ సవాలుకు సై అంది. 
సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రజలలో ఎన్నికల వేడి పుట్టించి, ఆ ఊపును, తీవ్రతను అలాగే కొనసాగిస్తూన్నారు.
పి.కె టీంతో సర్వేలు, నియోజకవర్గాలలో ఇంఛార్జీలను మార్చడం లాంటి చర్యలతో పార్టీలో కూడా సెగ పెట్టగలిగారు.

“తన 40 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ పరిజ్ఞానాన్ని” పూర్తిగా వినియోగిస్తూ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల పేరుతో ఓట్లు సాధించగల తాయిలలను ప్రకటించడం, బీజేపీ పై యుద్ధం ప్రకటించడం, గెలుపు గుర్రాలను గుర్తించడం, పార్టీలో వర్గ పోరుపై దృష్టి పెట్టడం లాంటి ఎత్తుగడలతో ఈ వేడిని మరింతగా పెంచగలిగారు.
కాగా రాష్ట్రంలో కూడా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాలు ఎన్నికల సెగను మరింత పెంచాయి.

ఈ నేపథ్యంలో రెండు ప్రాంతీయపార్టీలకు చెందిన పార్లమెంటు అభ్యర్థుల జాబితాను ప్రధాన పత్రికలు ప్రకటించడంతో ఎన్నికల వేడి రాష్ట్రాన్ని, ప్రజలను పూర్తిగా సునామీలా చుట్టుముట్టినదని చెప్పవచ్చు. అయితే ఈ వేడిని పోలింగ్ వరకు ఇలాగే కొనసాగించడం, ఆయారాంలకు,గయారాంలకు కళ్లెం వేయడం, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం, సరైన దళపతులను ఎంపిక చేయడం, ప్రజల అభిమానాన్ని ఓట్లుగా వేయించుకోవడం, ఆపైన గద్దె నెక్కడం. ఇవన్నీ పూర్తిచేసి గద్దె నెక్కడం రాష్ట్రంలో బలంగా ఢీ కొంటున్న రెండు పార్టీలకు కత్తి మీద సామే. 

ప్రజా సమస్యలను గాలికి వదలి పదవుల కోసం మాత్రమే జరుగుతున్న ఈ రాజకీయ డ్రామాలు చూడలేక ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ ప్రజలకు కూడా చచ్చే చావే! ఈ సునామి ఎవరిని ముంచుతుందో, ఆ వేడి ఎవరిని కాల్చుతుందో ఎన్నికలు ముగిసేవరకూ వేచి చూడాల్సిందే!