ప్రజలకి పెట్రో మంట.. పాలకులకి ఖజానా పంట.!

పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయ్. డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతాయా.? ఏమో.. వెళ్లేలానే ఉన్నాయి. ఇంతకీ ఇలా పెట్రో ధరలు పెంచేసి వాహనదారుల జేబులకు చిల్లులు పెట్టి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఎవర్ని ఉద్ధరిస్తున్నట్టు.? ఓ రాజకీయ విశేషకుడి వాదన ప్రకారం, ఇలా ప్రభుత్వాలు, ప్రజల్ని దోచేయడాన్ని రాజ ద్రోహమనీ, దేశ ద్రోహమనీ అనగలమా.?

కర్ణుడి చావుకు ఎన్ని కారణాలున్నాయో కానీ, పెట్రో దోపిడీకి చాలా కారణాలున్నాయి. ప్రధానమైనది పాలనా వైఫల్యం. కరోనా కుంటి సాకు చూపి, ఖజానా నింపుకోవడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి కట్టుగా దోపిడీకి పాల్పడుతున్నాయ్.

వేల కోట్ల రూపాయలు.. లక్షల కోట్ల రూపాయలు ఖజానాకి చేరుతున్నాయ్ పెట్రో ధరల పెంపు కారణంగా. కేంద్రం చెప్పే మాటలకి, చేస్తున్న పనులకీ అస్సలు పొంతన ఉండడం లేదు. ఈ పెట్రో వాతతో నిండుతున్న ఖజానా నుంచి పెట్రో బాకీలైనా తీరుతున్నాయా.? అంటే అదీ లేదు. అక్కడి బాకీలు అలాగే ఉన్నాయి. వాటి వడ్డీలూ పెరిగిపోతున్నాయ్.

వాస్తవానికి వామ పక్షాలూ ఇతర రాజకీయ పార్టీలు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలని ఈ విషయమై నిలదీయాల్సి ఉన్నా అంతా చేష్టలుడిగి చూస్తున్నారు. రాష్ర్టాల స్థాయిలో అధికార, విపక్షాల మధ్య నాటకీయ కోణంలో రాజకీయ విమర్శలు తప్ప సమస్య పరిష్కారం దిశగా ఎవరూ బాధ్యతా యుతంగా వ్యవహరించడం లేదు.

150 రూపాయలకి లీటరు పెట్రోల్ ధర చేరితే.? అది 200 వరకూ వెళితే.. దేశం తట్టుకోగలుగుతుందా.? దేశ ఆర్ధిక వ్యవస్థ ఏమైపోతుంది.? పెట్రో ధరల పెంపు అంటే, రవాణా రంగంపై తీవ్రమైన భారం పడుతుంది. అన్ని ధరలూ పెరుగుతాయ్. ఆల్రెడీ పెరిగిపోయాయ్. ఇంకా పెరిగిపోతే అది అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లోకి దేశ ప్రజల్ని నెట్టేస్తుంది.