పాల్ పార్టీకి 30 సీట్లు వస్తాయట

రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా తమకు వచ్చే 30 సీట్లే కీలకమవుతాయని కెఏ పాల్ క్యామిడీ మొదలుపెట్టారు. తమ మద్దతు లేకుండా ఇటు టిడిపి అటు వైసిపి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు. ఎందుకంటే రెండు పార్టీల్లో దేనికైనా 100 లోపు సీట్లే వస్తాయట. కాబట్టి తమ పార్టీనే కీలకమంటున్నారు.

ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి పాల్ పంచిన వినోధం జనాలందరికీ గుర్తుండే ఉంటుంది. నరసాపురం ఎంపి, భీమవరం ఎంఎల్ఏగా పాల్ నామినేషన్ వేశారు. అయితే భీమవరంలో నామినేషన్ చెల్లలేదు. ఎన్నికల్లో ఏమి ప్రచారం చేసుకున్నారో ఎవరికీ తెలీదు కానీ పోలింగ్ రోజున భీమవరంలో వైసిపికే ఓటు వేయండంటూ ఓటర్లను బతిమాలుడుకోవటం పాల్ ప్రచారంలోనే హైలైట్ అనే చెప్పాలి.

ఈ విషయాన్ని పక్కనపెడితే పాల్ ఓ విషయం మరచిపోయారు. టిడిపి, వైసిపిలో దేనికైనా 100 సీట్లు లోపే వస్తుందని చెప్పారు.  తమకు 30 సీట్లు వస్తాయనే భ్రమలో పాల్ ఉన్నట్లు అర్ధమైపోతోంది. కాబట్టే ప్రభుత్వం ఏర్పాటుకు తమ 30 మంది ఎంఎల్ఏల మద్దతే కీలకమనే పిచ్చి భ్రమల్లో ఉన్నారు పాల్. ఎందుకంటే, 175 స్ధానాలున్న అసెంబ్లీలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా 88 స్ధానాలు దాటితే చాలు. అలాంటిది ఏ పార్టీకైనా 100 సీట్లు వస్తే ఇక పాల్ మద్దతు ఎందుకు తీసుకుంటారు ?

సరే పాల్ కు పిచ్చి ముదిరిపోయినట్లే ఉంది చూడబోతే. ఎందుకంటే  మొన్నటి ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ లో పోటీ చేసిన పాల్ ఈవిఎంల ట్యాంపరింగ్ పై మాట్లాడారు. ఈవిఎంలో 12వ నెంబరైన హెలికాప్టర్ గుర్తుకు ఓటు వేస్తే 2వ నెంబర్లో ఉన్న ఫ్యాన్ కు పడిందట. అందుకే ఈవిఎంల ట్యాంపరింగ్ కు అమెరికా ఇంటెలిజెన్స్ లేదా రష్యా కుట్ర ఉందని మళ్ళీ మొదలుపెట్టారు పాల్.