వైఎస్ వివేకా మర్డర్ కు పక్కా స్కెచ్.. వెలుగులోకి మరో కోణం

వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తచ్చాడే ఓ కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు. ఆ ప్రాంతంలో కొత్త వ్యక్తులు కనబడితే మొరిగే ఈ శునకాన్ని మర్డర్ ప్లాన్‌లో భాగంగానే హత్య చేసినట్టు చెబుతున్నారు.

అది ఉంటే ఆ ప్రాంతంలోకి వెళ్లడం కష్టమనే ఉద్దేశంతో ముందుగానే దానిని చంపేసినట్టు తెలుస్తోంది. హత్యకు ముందు నిర్వహించిన రెక్కీలో ఈ కుక్కను గమనించిన దుండగులు దాని అడ్డు ముందే తొలగించుకుని హత్యకు పథకం పన్నినట్టు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.

కాగా, పోస్టుమార్టం నివేదిక రావడానికి ముందు వరకు వివేకా గుండెపోటుతో మరణించారన్న ప్రచారం జరిగింది. అయితే, ఆయనది హత్యేనని, గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారని తేలడంతో అందరూ విస్తుపోయారు. ఈ హత్య విషయంలో ఫిర్యాదు చేసేందుకు వైసీపీ అధినేత జగన్ శనివారం సాయంత్రం గవర్నర్‌ను కలవనున్నారు.