నిజంగానే ములాయం సింగ్ చంద్రబాబునాయుడుకు ఫెద్ద షాకే ఇచ్చారు. ఢిల్లీలోని ఏపి భవన్లో జరిగీన దీక్షలో చంద్రబాబుకు మద్దతుగా ములాయం వచ్చి కలిసిన విషయం తెలిసిందే. ఏపి భవన్లో ఏర్పాటు చేసిన వేదిక నుండి ములాయం మాట్లాడుతూ నరేంద్రమోడిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం అందరూ చూసిందే. అలాంటిది లోక్ సభ సెషన్ చివరిరోజున పార్లమెంటులో ములాయం మాట్లాడుతూ మళ్ళీ మోడినే ప్రధానిగా చూడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ములాయం చేసిన ప్రకటనతో ఎంపిలందరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు.
రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మోడియే ప్రధాని కావాలన్నది తన ఆకాంక్షగా తెలిపారు. దేశప్రజలందరూ మోడినే పిఎంగా చూడాలని అనుకుంటున్నట్లు దేశ ప్రజల తరపున వకాల్తా కూడా పుచ్చుకున్నారు. దాంతో విపక్ష పార్టీల ఎంపిలకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. బిజెపియేతర పార్టీల సమావేశాలకు ములాయం రెగ్యులర్ గా హాజరవుతునే ఉంటారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో బిఎస్సీతో పొత్తు కూడా పెట్టుకున్నారు. అదే సమయంలో రాహూల్ గాంధి నిర్వహించే సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారు. తీరా చూస్తేనేమో మోడినే ప్రధాని కావాలంటూ ఏకంగా పార్లమెంటులోనే ప్రకటించేశారు. అది కూడా సోనియాగాంధి పక్కనే నిలబడి.
ములాయం సింగ్ ప్రకటనకు ఎలా రియాక్ట్ కావాలో సోనియాకు అర్ధంకాక బాగా ఇబ్బంది పడిన విషయం టివిల్లో స్పష్టంగా కనబడింది. ఇక అదే సమయంలో చంద్రబాబు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అంటే చంద్రబాబు దగ్గరకు వచ్చినపుడేమో మోడిని తిడుతు లేనపుడేమో మళ్ళీ ప్రధాని మోడినే అంటూ చెబుతుండటంతో చంద్రబాబుకు కూడా ములాయం ప్రకటన పెద్ద షాక్ అనే చెప్పాలి. రేపటి రోజున బిజెపియేతర సమావేశాల్లో ములాయంను ఆహ్వానించలేరు. అలాగని వదిలిపెట్టి వెళ్ళలేరు. మొత్తానికి అందరినీ ములాయం ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు.
