తెలంగాణ మంత్రి పేషిలో డిష్యుం డిష్యుం

తెలంగాణ అధికార పార్టీ లో విబేధాలు రచ్చకెక్కడం కాదు ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైనటువంటి సచివాలయంలో ఇద్దరు నేతల మధ్య డిష్యుం డిష్యుం జరిగిందట. వారు మాములు నేతలు కాదు. ఒకరేమో కీలకమైన శాఖకు మంత్రి మరొకరు ఎమ్మెల్యే. ఈ ఇద్దరు నేతలు కొట్టుకున్నారని సచివాలయమే కాదు రాష్ట్రమంతా కోడై కూస్తుంది.

వారిద్దరు పాలమూరు జిల్లా నేతలే. ఒకరు మంత్రి, మరొకరు ఎమ్మెల్యే. వారి మధ్యకు ఓ భూమి పంచాయతీ వచ్చింది. దానిని సెటిల్ చేసేందుకు ఇరువర్గాలు మంత్రి చాంబర్ కు వచ్చాయి. ఎమ్మెల్యే కూడా అక్కడికి వచ్చారు. భూమిపై హక్కులు కోరుతున్న వారిలో ఒక వర్గానికి మంత్రి సపోర్టు చేస్తే మరొక వర్గానికి ఎమ్మెల్యే సపోర్టు చేశాడు. ఇగ గీడనే వారిద్దరి మధ్య లొల్లి పుట్టింది. ఒకరి మీద ఒకరికి కోపం పెరిగి గల్లాలు పట్టుకొని కొట్టుకున్నారట.

ముందుగా మంత్రి ఎమ్మెల్యేపై అరవగా తానేం తక్కువ కాదంటూ ఎమ్మెల్యే కూడా అంతే తీరుగా మంత్రిపై  తిట్లదండకం  అందుకున్నారట. మంత్రి మరింత రెచ్చిపోయి ఈ సారి నువ్వు ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తావో చూస్తారా అంటే ఎమ్మెల్యే కూడా నిన్ను ఓడిస్తానురా అంటూ విరుచుకుపడ్డారట. అక్కడ ఉన్న అధికారులు, నాయకులు వారికి సర్ది చెప్పినా వారు ఏ మాత్రం వినలేదట.

ఈ మధ్య ఫోనులలో వాయిస్ రికార్డులు ఎక్కువవుతుంటే ప్రజలలో పరువు పోతుందని ఏదైనా ఉంటే  కూర్చొని మాట్లాడాలంటూ సీఎం కేసీఆర్ నేతలకు సూచించారు. ఇలా కూర్చొని మాట్లాడితే తన్నుకునే కాడికి వస్తుందని ఫోన్ సెటిల్ మెంటే బాగుండే అని పలువురు నేతలంటున్నారు. మొత్తానికి మంత్రి, ఎమ్మెల్యేల కొట్లాట తెలంగాణ వ్యాప్తంగా రచ్చరచ్చ అవుతుంది. ఈ సంఘటన గత ఆరు నెలల క్రితం జరిగింది. కానీ ఈ మధ్యే వెలుగులోకి వచ్చింది.