జగన్ తో నార్నే భేటీ…జూనియర్ ఎన్టీయార్ ఎటువైపు ?

రాబోయే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీయార్ ఎవరికి ప్రచారం చేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూనియర్ మమగారు నార్నే శ్రీనివాస్ లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డితే భేటీ అవటంతో ఊహాగానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మామూలుగా అయితే జూనియర్ తెలుగుదేశంపార్టీకే ప్రచారం చేయాలి. కానీ మారిన రాజకీయ పరిణామాల్లో జూనియర్ ప్రచారం విషయంలో చర్చ ఊపందుకుంది. మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో కుకట్ పల్లి నుండి సోదరి సుహాసిని టిడిపి తరపున పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. స్వయానా సోదరే పోటీ చేసినా జూనియర్ ప్రచారం చేయలేదు.

మొదటి నుండి కూడా చంద్రబాబునాయుడు, బాబాయ్ నందమూరి బాలకృష్ణతో జూనియర్ కు వ్యక్తిగత విబేధాలున్నాయి. అయితే తండ్రి నందమూరి హరికృష్ణ కారణంగా ఇష్టం లేకపోయినా టిడిపికి ప్రచారం చేశారు. ఎప్పుడైతే తండ్రి చనిపోయారో అక్కడి నుండి చంద్రబాబు, బాబాయ్ తో దూరం పెరిగిపోయింది. అందుకే సోదరి సుహాసిని పోటీ చేసినా కనీసం అటువైపు తొంగికూడా చూడలేదు.

తండ్రి మరణం తర్వాత ఏపిలో రాబోయే ఎన్నికల్లో జూనియర్ ప్రచారం సంగతిపై పార్టీలోనే కాకుండా జనాల్లో కూడా చర్చలు మొదలయ్యాయి. టిడిపికి జూనియర్ ప్రచారం చేసిన రోజుల్లో కూడా పెద్దగా ఉపయోగం కనబడలేదనుకోండి అది వేరే సంగతి. అభ్యర్ధులు గెలిచినా ఓడిపోయినా ప్రచారం ప్రచారమే కదా ? అందుకే ఏరి కోరి మరీ జూనియర్ తో  ప్రచారం చేయించుకుంటుంటారు. 

అలాంటిది తాజాగా జూనియర్ ఎన్టీయార్ మామగారు నార్నే శ్రీనివాస్ లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డితే భేటీ అయ్యారు. జగన్ తో భేటీ అంటేనే వైసిపిలో చేరుతున్నట్లు అర్ధమైపోతుంది. రాబోయే ఎన్నికల్లో నార్నే కూడా వైసిపి తరపున పోటీ చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఎంపిగానో లేకపోతే చిలకలూరిపేట అసెంబ్లీ నుండో పోటీకి అవకాశం ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది.  మరి అదే నిజమై జగన్ గనుక టికెట్ ఇస్తే జూనియర్ ఏం చేస్తారు ? అన్నదే ప్రధాన ప్రశ్న.  నార్నే పోటీచేస్తే  సోదరి ఎన్నికకు దూరంగా ఉన్నట్లే మామగారి ఎన్నికకు కూడా దూరంగా ఉంటారా ? లేకపోతే ప్రచారం చేసి గెలుపు బాధ్యతలు తీసుకుంటారా చూడాల్సిందే.