ట్విట్టర్లో అసలు గుట్టు విప్పిన జూనియర్, కల్యాణ్

సోదరి నందమూరి సుహాసిని నామినేషన్ సందర్భంగా చేసిన ట్వీట్ తో జూనియర్, కల్యాణ్ రామ్ అసలు గుట్టు విప్పేశారా ? ట్వీట్ చూసిన వారందరికీ ఇపుడదే సందేహం వస్తోంది. ఇంతకీ సుహాసిని నామినేషన్ సందర్భంగా జూనియర్, కల్యాణ్ చేసిన ట్వీట్లో ఏముంది ? ఇంతకీ విషయం ఏమిటంటే తెలుగుదేశంపార్టీ తరపున కుకట్ పల్లి నియోజకవర్గంలో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని నామినేషన్ వేశారు. ఆ సందర్భంగా జూనియర్, కల్యాణ్ రామ్ ఇద్దరూ శుభాకాంక్షలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. అదికూడా ఇద్దరూ జూనియర్ అకౌంట్ లో నుండి ట్వీట్ చేయటం గమనార్హం.

ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే, తమ తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు స్ధాపించిన తెలుగుదేశంపార్టీ తమకెంతో పవిత్రమైనదన్నారు. ప్రస్తుతం టిడిపి ఎవరి చేతుల్లో ఉందో అందరికీ తెలుసు. నందమూరి తారకరామారావు  స్ధాపించిన పార్టీ నారావారి ఏలుబడిలోకి ఎలా వెళ్ళింది ? టిడిపిని స్ధాపించింది తమ తాత ఎన్టీయారే అన్న విషయాన్ని మనవళ్ళిద్దరూ గుర్తుచేస్తున్నారు. పైగా తమ నాన్న స్వర్గీయ నందమూరి హరికృష్ణ సేవలందించిన తెలుగుదేశంపార్టీ అని మాత్రమే చెప్పారు. తమ తండ్రి సేవలందించిన తెలుగుదేశంపార్టీ తరపున తమ సోదరి సుహాసిని పోటీ చేస్తోందని స్పష్టం చేశారు.

ఇక చివరగా తమ సోదరి సుహాసినికి విజయం వరించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అంతే కానీ ఎక్కడా నందమూరి అభిమానులు సుహాసిని విజయానికి కృషి  చేయాలని కానీ ఓట్లు వేసి గెలిపించండని కానీ విజ్ఞప్తి చేయలేదు. చివరలో జై ఎన్టీయార్..జోహార్ హరికృష్ణ అని ముగించారు. ట్వీట్ మొత్తం మీద చంద్రబాబునాయుడు పేరుకానీ బాబాయ్ బాలకృష్ణ పేరుకానీ ఎక్కడా కనీసం ప్రస్తావన కూడా తేలేదు. మామూలుగా అయితే టిక్కెట్టిచ్చిన పార్టీ అధ్యక్షుడుకి కృతజ్ఞతలో ధన్యవాదాలు చెప్పటం సహజం. ఇక్కడ సోదరులు అది కూడా చేయలేదు ఇంత జాగ్రత్తగా ట్విట్టర్లో మ్యాటర్ ట్వీట్ చేశారంటే దాని వెనుక పెద్ద కథే నిడిచుంటుందని ఎవరికైనా అర్ధమైపోతుంది.

ఎందుకంటే, ఈ నియోజకవర్గంలో మొదటి కల్యాణ్ రామ్ నే పోటీ చేయించాలని చంద్రబాబు ప్లాన్ వేశారు. అయితే, ప్లాన్ పారలేదు. కుటుంబపరంగా హరికృష్ణ ఫ్యామిలీ నుండి పోటీ దింపటం కష్టమని భావించిన చంద్రబాబు పార్టీ పరంగా నరుక్కుని వచ్చారు. హరికృష్ణ కూతురు సుహాసిని టిడిపి మాజీ ఎంపి చుండ్రు శ్రీహరి కోడలు. కాబట్టి శ్రీహరి కుటుంబం ద్వారా చెప్పించి పోటీలోకి దింపారు.

తమ సోదరి పోటీచేయటం బహుశా జూనియర్, కల్యాణ్ కు ఇష్టం ఉన్నట్లు లేదు. అలాగని ఆమెను పోటీ చేయనీకుండా ఆపలేరు. అందుకనే పోటీ చేస్తున్నది కాబట్టి తప్పని స్ధితిలో ఓ ట్వీట్ పెట్టారు. అంతేకానీ నామినేషన్ వేసేటప్పుడు కానీ అంతకుముందు ఎన్టీయార్, హరికృష్ణలకు నివాళుర్పించే సమయంలో కూడా హాజరుకాలేదు. సో, సోదరులిద్దరు పెట్టిన ట్వీట్ తో చంద్రబాబుకు తాము దూరమే అని చెప్పకనే చెప్పినట్లైంది.