ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి టీడీపీ – జనసేన పొత్తు దాదాపు ఖాయమే. బీజేపీ కూడా కలవనుంది. మొత్తంగా దీన్ని ఎన్డీయే కూటమిగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడో డిసైడ్ చేసేశారు. కానీ, ఏపీ బీజేపీ నేతలు కొందరు జనసేన, బీజేపీ మాత్రమే కలిసి పోటీ చేస్తాయంటున్నారు. టీడీపీ నుంచి ఇంతవరకు పొత్తులపై అధికారిక వ్యాఖ్యలు రాలేదు.
జనసేన మీదకి ఎప్పుడో వలపు బాణాలు విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు, ‘వన్ సైడ్ లవ్’ పేరుతో. ‘కలిసే పోటీ చేస్తాం.. కలిసికట్టుగా పని చేస్తాం.. వైసీపీని గద్దె మీంచి దించుతాం..’ అని పదే పదే జనసేన అధినేత చెబుతున్నారు.
ఇదిలా వుంటే, వారాహి విజయ యాత్ర పుణ్యమా అని మూడు ఉమ్మడి జిల్లాల్లో జనసేన పార్టీకి పొలిటికల్ మైలేజ్ బాగానే పెరిగింది. క్లీన్ స్వీప్.. అని జనసేన చెప్పుకుంటోంది. ఛాన్సే లేదని వైసీపీ అంటోంది. అంతే కాదు, టీడీపీ కూడా, జనసేనకు అంత సీన్ లేదని చెబుతుండడం గమనార్హం.
మరోపక్క, టీడీపీ – జనసేన మధ్య ప్రాథమికంగా సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి.. అదీ అనధికారికంగానే సుమీ.! ఎంపీ సీట్ల సంఖ్యను 8 వరకు పెంచేసుకుందట జనసేన పార్టీ. అందులో ఖచ్చితంగా ఆరు గెలిచేస్తామనీ, ఇంకో రెండిటిని ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నిస్తామనీ చెబుతోందిట.
ఏకంగా విజయవాడ ఎంపీ సీటు మీదనే జనసేన ఫోకస్ పెట్టిందన్నది తాజా ఖబర్. కానీ, టీడీపీ ఈ సీటుని వదులుకోదు. అయితే, విజయవాడ ఎంపీ సీటుని బీజేపీ కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మచిలిపట్నం ఎంపీ సీటు అయితే, జనసేనకు ఇవ్వడానికి టీడీపీ కూడా సుముఖంగానే వుందట.
విశాఖ, అమలాపురం, రాజమండ్రి తదితర ఎంపీ సీట్లను జనసేన కోరుతోంది. నర్సాపురం సీటునీ అడుగుతోంది.. అదీ రఘురామకృష్ణరాజు కోసమట. ఏంటీ.? ఇదంతా నిజమేనా.? అంటే, నిజమేనంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.