మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి మహిళా రైతులు ఎందుకు రోడ్డెక్కారు.? అన్న చర్చ పక్కన పెడితే, రోడ్డెక్కిన మహిళల్ని పోలీసులు ఈడ్చి పడెయ్యడం మాత్రం అత్యంత దారుణం. మహిళా దినోత్సవం నేపథ్యంలో యావత్ మహిళా లోకానికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు చెప్పడం.. ‘జెండర్ బడ్జెట్’ అంటూ కొత్త ప్రతిపాదన చేయడం.. ఇంకేవేవో కార్యక్రమాల్ని ప్రకటించడం.. ఇవన్నీ శుద్ధ దండగ వ్యవహారాలుగా మారిపోయాయి.. అమరావతి మహిళా రైతులపై పోలీసుల దాష్టీకం తర్వాత. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికల సందర్భంగా పెద్దయెత్తున ఏకగ్రీవాలు జరిగాయి. అలాంటిది, అమరావతి పరిధిలో వున్న కొన్ని గ్రామాల్లో ప్రజల్ని జగన్ సర్కార్ ఒప్పించలేకపోతోందా.? ఈ ప్రశ్న ఎవరికైనా కలగడం సహజమే. 151 మంది ఎమ్మెల్యేలున్నారు.. మహిళా మంత్రులున్నారు.. బోల్డంతమంది అదికారులున్నారు.. ఏం లాభం.? అమరావతిలో దాదాపు 450 రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు ప్రభుత్వం తరఫున సరైన సమాధానం రావడంలేదు.
ఎంపీలు వెళ్ళి ఆందోళనకారులతో మాట్లాడొచ్చు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రంగంలోకి దిగొచ్చు. పార్టీ పరంగా, ప్రభుత్వం పరంగా చర్చలు జరిగితే, సమస్యకు పరిష్కారం లభించడం పెద్ద కష్టమేమీ కాదు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సరికొత్త సంక్షేమ పథకాల్ని.. ప్రత్యేకంగా క్యాలెండర్ రూపొందించి మరీ అమలు చేస్తున్నామని చెబుతున్న జగన్ సర్కార్, రాజధాని అమరావతి పరిధిలో వినిపిస్తున్న ‘నిరసన గళాన్ని’ చల్లార్చలేకపోతోంది. ఆ గ్రామాల మీదుగానే అసెంబ్లీకి వెళ్ళాలి.. సచివాలయానికి వెళ్ళాలి. కానీ, వారి గోడు ప్రభుత్వం పట్టించుకోలేకోతోంది. మిగతా రోజుల్లో ఓ లెక్క. మహిళా దినోత్సవంనాడు ప్రత్యేకమైన లెక్క. ప్రపపంచమంతా చూసింది.. ఇది ఎవరి వైఫల్యం. అక్కడ ఏం జరుగుతుందో అంచనా వేయలేకపోవడం ముమ్మాటికి పోలీసు వ్యవస్థ వైఫల్యమే.