Jagan: ‘పరీక్షలు రాయకపోతే నష్టమేమీ లేదు.. ప్రాణాల కంటే మార్కులు ఎక్కువేమీ కాదు..’ అని చెబుతుంటాం. నిజమే, పరీక్షలంటే, నేటితరం విద్యార్థులకు అదో పెద్ద టెన్షన్. సాధారణ పరిస్థితుల్లో కూడా టెన్షన్ తట్టుకోలేక విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. అలాంటిది, బయటకు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితుల్లో, బలవంతంగా తమను బయటకు రప్పించి, పరీక్షలు రాయాల్సిందేనని ప్రభుత్వం తెగేసి చెబితే, విద్యార్థుల మానసిక స్థితి ఎలా వుంటుంది.? పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్ని నిర్వహించి తీరాల్సిందేనని, ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ఎందుకు అంత మొండిగా ప్రవర్తిస్తోంది.? అన్నదానిపై భిన్నవాదనలు వున్నాయి.
కరోనా నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప, ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వమే చెబుతోంది. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ మినీ లాక్ డౌన్లు.. ఇంకా చాలానే నడుస్తున్నాయి. జనం పిట్టల్లా రాలిపోతున్నారు ప్రతిరోజూ కరోనాతో. ఆసుపత్రులన్నీ కోవిడ్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. న్యూస్ ఛానళ్ళు చూస్తే కోవిడ్, పత్రికలు తిరగేస్తే కోవిడ్. వాట్సాప్ మెసేజ్, స్టేటస్ మాత్రమే కాదు, ఎవరికన్నా ఫోన్ చేసినా కరోనా గురించిన విషయాలే ప్రస్తావనకు వస్తున్నాయి. ఇంతటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో, విద్యార్థుల పరీక్షలు రాయగలరా.? విద్యార్థుల భద్రత, మా బాధ్యత.. అని ప్రభుత్వ పెద్దలు చెబుతుండడాన్ని స్వాగతించాల్సిందే. కానీ, ప్రాక్టికల్ కోణంలో చూస్తే, అది సాధ్యమయ్యే పని కాదు.
ప్రతిరోజూ రాష్ట్రంలో 50 మందికి పైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది అధికారిక లెక్క. అలాంటప్పుడు, పరీక్షల విద్యార్థులకు కరోనా సోకి, ఎవరైనా ప్రాణాలు కోల్పోతే, ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది.? కీడెంచి మేలెంచాలి.. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా వుంది. దాదాపు 15 వేల కరోనా పాజిటివ్ కేసులు ప్రతి నిత్యం రాష్ట్రంలో నమోదవుతున్న పరిస్థితిని చూస్తున్నాం. మరెలా పరీక్షల నిర్వహణ సజావుగా సాగుతుంది.? ఎందుకీ పంతం.?