యాత్రతో జగన్ ప్రతిష్ఠ పెరిగిందా? తగ్గిందా?

(మల్యాల పళ్లం రాజు*)

 

ఆరు అడుగులు, మూడు సెల్ఫీలు.. ఓదార్పులు, ఆలింగనాలు, లక్ష విమర్శలు, టన్నులకొద్దీ హామీలు..శుక్రవారాలు ఆఫ్టర్ ద బ్రేక్… అంటూ..సాగుతోంది దాదాపు 250 రోజులుగా వైఎస్ ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర…ఈ సంకల్పయాత్రతో జగన్ రాజకీయంగా ఏ మేరకు మైలేజీ సాధించారు. జనంలో తన ప్రతిష్ఠను ఏమేరకు పెంచుకున్నారన్నది చర్చనీయాంశమైంది.

 

పాదయాత్ర అంటే.. మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి యాత్రే గుర్తుకువస్తుంది. మహానేత పాదయాత్రతో 9 ఏళ్లుగా అధికారంలో ఉన్న సర్కార్ ను శంకరగిరి మాన్యాలు పట్టించాడు. ప్రపంచంలో ఎవరూ ఇవ్వని  రైతులకు ఉచిత కరెంట్, పేదలకు ఉచితంగా పెద్ద ఆపరేషన్లు కూడా చేయించి ఆరోగ్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సౌకర్యం, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఉచితంగా కాలేజీ చదువులు కల్పించే… ఫీజు రీ ఇంబర్స్ మెంట్ వంటి హామీలు ఇచ్చి, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడమే కాక, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా చచ్చినట్లూ ఈ పథకాలు అమలు చేయక తప్పని పరిస్థితి నెలకొల్పారు. దాంతో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ పథకాలను అమలు చేస్తున్నాయి. ఇక చంద్రబాబు పాదయాత్ర కూడా ఆయనకు అధికారాన్ని అందించింది.

 

జగన్ మోహన్ రెడ్డి తన తండ్రిని హెలికాప్టర్ ప్రమాదంలో కోల్పోయిన తర్వాత  కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం నుంచి అవమానాల పాలై.. పార్టీకి దూరమై ప్రత్యేక పార్టీ పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓదార్పు యాత్రల పేరిట జనాలకు దగ్గరయ్యేందుకు విస్తృతంగా పర్యటించారు. తన తండ్రి మరణంతో ఆవేదనతో కుమిలిపోతూ మరణించిన వారి చాలా కుటుంబాలను  ఆర్థికంగా కూడా ఆదుకున్నారు. కొత్త పార్టీ వేళ్లూనుకునే లోగానే, జైలు జీవితం.. తర్వాత మళ్లీ ఓదార్పు యాత్రలు… విభజన సమస్యల నేపథ్యంలో సమైక్యఆంధ్ర ఉద్యమం.. విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి..తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమం, ఆందోళనలు, ధర్నాలు, దీక్షలు.. ఇప్పుడు సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర… దాదాపు పదేళ్లుగా ప్రజలతో మమైకం అవుతూ.. అవిశ్రాంతంగా తనదైన శైలిలో పోరు సాగిస్తున్నారు. ప్రజలకు  తిరిగి రాజన్న పాలన అందించాలన్న ఏకైక సంకల్పమే ఆయనను ముందుకు నడుపుతోంది. ఈ పదేళ్లలో తన కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదు. నిండు యవ్వనంలో కుటుంబ సౌఖ్యానికి కూడా దూరమై.. ప్రజలకోసం పోరు సాగిస్తున్నారు. అవినీతి పాలనపై తనదైన శైలిలో యుద్ధం చేస్తున్నారు. ఈ మహత్తర కృషిని ప్రజలు గుర్తిస్తారా… ఏమేరకు ప్రజలు స్పందిస్తారు.. వైఎస్ ఆర్ పార్టీని అక్కున చేర్చుకుంటారో చూడాలి.

 

జగన్ తనకు తోచిన పంథాలో సాగుతున్నా.. ప్రతిపక్ష నాయకుడుగా విఫలమయ్యారనే విమర్శ ప్రజల్లో ఉంది. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ, వారి సమస్యలను చర్చించేందుకు వచ్చిన అవకాశాలను జారవిడవడం, ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలన్న నిర్ణయం ప్రజాస్వామిక వాదులకు ఆవేదన కల్గించింది.  అందుకు ముఖ్య కారణం అధికార పక్షం వ్యవహరించిన తీరే. పూర్తి మెజారిటీ ఉన్నా.. ప్రతి పక్ష పార్టీలో ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎరవేసి, తమ వైపు తీసుకోవడం, పార్టీ ఫిరాయింపు చట్టం ఉన్నా.. స్పీకర్ స్పందించక పోవడం, ప్రజాస్వామిక వాదులెవరూ హర్షించరు. తమ పార్టీ సభ్యులు అధికార పక్షంలో చేరిమంత్రి పదవులు చేపట్టి తమకే సమాధానం చెప్పే స్థితిలో ఉండడం ప్రతిపక్షనాయకుడికి సహించరాని విషయమే.. అయినా మూడేళ్లుగా అసెంబ్లీ బహిష్కరణ తీవ్రమైన నిర్ణయం.. ప్రజలు హర్షించడం లేదు. ఇదీ, ప్రత్యేక హోదా కోసం అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నా, పార్లమెంటులో సభ్యులచేత రాజీనామా చేయించాలన్న నిర్ణయాన్ని కూడా ప్రజాస్వామిక వాదులు హర్షించడం లేదు. ఈ రెండు నిర్ణయాల వల్ల  జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠకు కొంత భంగం వాటిల్లిందన్నది నిజం. జగన్ తన ఇగో కారణంగా కొందరు సీనియర్ నాయకులు పార్టీని విడనాడవలసి వచ్చింది. ఆ విధంగానూ జగన్ ఆ నాయకుల అనుచరగణాలకు దూరమయ్యారు.

 

జగన్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న అంశాలు

 

జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రజల మధ్యనే ఉంటూ తన తొందర పాటు నిర్ణయాలవల్ల ప్రజలకు దూరమయ్యారనిపిస్తోంది. అసెంబ్లీ బహిష్కరణ,  విభజన హామీలను నెరవేర్చని చంద్రబాబును దుమ్మెత్తి పోస్తూనే కేంద్ర ప్రభుత్వం పై, మోడీపై పెద్దగా స్పందించకపోవడం, చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లపై వ్యక్తిగత విమర్శలు, పార్లమెంటులో మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం విషయంలో వ్యవహరించిన తీరు, తమ పార్లమెంటు సభ్యుల రాజీనామాల వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదని తెలిసి, వారితో రాజీనామాలు చేయించడం ద్వారా, పార్లమెంటులో తమ వాదన వినిపించే ఛాన్స్ పోగొట్టుకోవడం వంటి నిర్ణయాల వల్ల జగన్ రాజకీయ అవగాహనా రాహిత్యం బయట పడింది. ఫలితంగా  జగన్ వ్యవహార శైలి, నాయకత్వం పటిమ పై ప్రజలలో సందేహాలు తలెత్తాయి. ఎన్నికల సమయంలో కాపు కమ్యునిటీ రిజర్వేషన్ల విషయంలో తన ప్రకటన ద్వారా జగన్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారనే భావన ప్రజల్లో, ఆ కమ్యునిటీలో వ్యక్తమయింది.

 

  జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగాల్లో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లపై విమర్శలు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టకున్నా… వ్యక్తిగత దూషణల వల్ల ఆయన మైలేజీ దెబ్బతిన్నదని  చెప్పవచ్చు. ఈ కారణంగా జగన్ మోహన్ రెడ్డి పట్ల ప్రజలలో , ప్రజాస్వామిక వాదుల్లో వ్యతిరేక భావన పెరిగింది. అది ఏమేరకు అంటే, పాదయాత్ర ద్వారా ప్రజల్లో పెంచుకున్న ప్రతిష్ట కన్నా.. తన తొందరపాటు నిర్ణయాల వల్ల పోగొట్టుకున్న ప్రతిష్ఠ ఎక్కువే నేమో.. వైసీపీ అధినేత స్వయంగా బేరీజు వేసుకోవాలి.

 

 కాపు రిజర్వేషన్ల విషయంలో  జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా చేసిన ప్రకటన కారణంగా ఆ కమ్యునిటీలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వాటిని తమకు అనుగుణంగా మార్చుకునేందుకు తెలుగుదేశం, జనసేన ఇతర పార్టీలు యత్నిస్తున్నాయి. ఈ ప్రకటన బీసీ వర్గాలలో పునరాలోచనలకు నాంది పలికింది. ఈ నేపథ్యంలో బీసీలు వైఎస్ ఆర్ పార్టీ వైపు ఏ మేరకు మొగ్గుతారో చూడాలి.

 

దాదాపు 250 రోజులుగా సాగుతున్న సంకల్పయాత్ర క్లైమాక్స్ కు వచ్చింది. ఈ యాత్ర అనంతరం జగన్ మోహన్ రెడ్డి  ఇప్పటి వరకూ జరిగిన పొరపాట్లను సరిదిద్దు కుని, విస్తృత స్థాయిలో పార్టీ బలో పేతానికి నడుం బిగించాల్సిన అవసరం ఉంది. సంకల్పయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల కార్యాచరణకు ఓ మాస్టర్ ప్లాన్ రూపొందించి, రానున్న ఎన్నికల సమయంలోనే ప్రజల ముందు ఉంచి, హామీలన్నీ, నెరవేరుస్తానని బలమైన నమ్మకం కల్గించిన పక్షంలోనే 2019 ఎన్నికలలో  ప్రజలు బ్రహ్మరథం పడతారు..

 

(*మల్యాల పళ్లంరాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్)