అధికారంలో ఉన్నది చంద్రబాబునాయుడు. జగన్మోహన్ రెడ్డేమో ప్రధాన ప్రతిపక్ష నేత. ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రాష్ట్రప్రభుత్వ పాలనా పగ్గాలు మొత్తం చంద్రబాబు చేతిలో ఉంటాయనటంలో సందేహం అవసరంలేదు. పాలనాపగ్గాలు చంద్రబాబు చేతిలో ఉండగా శాంతిభద్రతలు అదుపు తప్పాయంటే అందుకు చంద్రబాబే బాధ్యత వహించాలి. అలాంటిది ఏపిని జగన్ మరో బీహారుగా మార్చాలని చూస్తున్నారంటూ చెప్పటమే విచిత్రంగా ఉంది.
చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రత్యేకంగా వైసిపి నేతలను టార్గెట్ గా చేసుకుని పోలీసులను పెట్టి చంద్రబాబు వాయించేస్తున్నారు. అయినదానికి కానిదానికి వైసిపి నేతలను అరెస్టులు చేయిస్తున్నారు. అదే సమయంలో మామూలుగా జనాలపైన, అధికారులపైన కూడా టిడిపి నేతల దాడులు పెరిగిపోతున్నాయి. పోలీసులను అడ్డం పెట్టుకుని తమకు గిట్టని వాళ్ళపైన టిడిపి నేతలు రెచ్చిపోయి దాడులు చేస్తున్నా అడిగే వాళ్ళు లేరు.
అనేక చోట్ల మహిళలను నడిరోడ్డుపై బట్టలూడబీకి చావ కొట్టినా ఎవరిపైనా చర్యలుండటం లేదు. ఎంపి కేశినేని నాని, ఎంఎల్ఏ బోండా ఉమా మహేశ్వరరావు రవాణా శాఖ కమీషనర్ బాలసుబ్రమణ్యం ముందే ఆయన గన్ మెన్ పైన చేయి చేసుకున్న విషయం తెలిసిందే. మరో ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ఎంఆర్ఓ వనజాక్షిని జుట్టుపట్టుకుని కొట్టినా అదేమని అడగలేదు ఎవరూ.
నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు ఎలాగుందనటానికి పై ఉదాహరణలు కొన్నిమాత్రమే. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో కూడా టిడిపి ప్రజాప్రతినిధులదే ప్రముఖ పాత్ర. అంతెందుకు ఎక్కడ గొడవలున్నా టిడిపి నేతలే ఉంటున్నారు. అలాంటిది ఏపిని జగన్ మరో బీహార్ లాగ మారుస్తున్నారని చెప్పటంలో అర్ధమేమన్నా ఉందా ? నిజంగానే జగన్ ఏపిని బీహార్ లాగ మారుస్తుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేస్తున్నట్లు ? అంటే తన చేతకాని తనాన్ని చంద్రబాబే ఒప్పకున్నట్లేగా ?