అవును కమలం పార్టీ పరిస్ధితి ఏపిలో అలాగే ఉంది. మొన్నటి ఎన్నికల్లో బిజెపి మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోను పోటీ చేసింది. నిజానికి అసెంబ్లీ అయినా పార్లమెంటయినా అన్నీ నియోజకవర్గాల్లోను పోటీ చేసేంత సీన్ బిజెపికి లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఉన్న నియోజకవర్గాల్లో కనీసం సగంచోట్ల కూడా గట్టి అభ్యర్ధులను నిలిపేంత స్ధాయి కూడా పార్టీకి లేదు.
వాస్తవం ఇలావుంటే అన్నీ నియోజకవర్గాల్లోను పోటీ చేసిన పార్టీకి ఎన్ని చోట్ల డిపాజిట్లు (గెలుపు కాదు సుమా ) వస్తాయనే విషయమై పార్టీలో చర్చ జరిగింది. విశ్వసనీయ వర్గాల లెక్కల ప్రకారం ఓ 20 అసెంబ్లీల్లో డిపాజిట్లు వస్తే అదే చాలా గొప్పని తేలింది. ఏదో చంద్రబాబునాయుడు మీద కోపంతో తమను తాము చాలా ఎక్కువగా బిజెపి నేతలు ఊహించుకున్నారు.
ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేయగానే రాష్ట్రంలోని బిజెపి నేతలు పండుగ చేసుకున్నారు. అన్నీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని, సత్తా చాటుతామని సవాలు చేశారు. కానీ తమకు అంతగా సీన్ లేదని చాలామందికి తెలుసు. అందులోను మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన పెద్ద తప్పు కూడా ఉంది. దాంతో పార్టీ పరిస్ధితి మరింతగా దిగజారిపోయిందని పార్టీలోని సీనియర్ నేతలే చెప్పుకుంటున్నారు.
అసలే నాయకుల కొరత. దానికితోడు గెలుపు అవకాశాలున్నాయి అనిపించుకోవాలన్నా గట్టి నేతలు అవసరం. అలాంటిది కన్నా అనాలోచితంగా మొత్తం అభ్యర్ధులను తొందరపడి ముందే ప్రకటించేశారు. దాంతో ఇతర పార్టీల నుండి బిజెపిలో చేరే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు కూడా ఎవరూ రాలేదు. ముందుగా టికెట్లు ప్రకటించకుండా ఉండుంటే ఇతర పార్టీలు కనీసం టిడిపి నుండైనా టిక్కెట్లు దక్కని కొందరు ఎంఎల్ఏలు, ఆశావహులు బిజెపిలో చేరుండేవారనటంలో సందేహం లేదు. దాంతో ఇపుడు డిపాజిట్లు దక్కే స్ధానాలెన్ని అని తీరిగ్గా లెక్కేసుకుంటున్నారు.