స్కూళ్ళు దోచేస్తున్నాయ్.. కేసీయార్, జగన్ పట్టించుకోరెందుకు.!

KCR and Jagan

KCR and Jagan

2020 విద్యా సంవత్సరం దాదాపుగా అటకెక్కేసింది.. కొత్త విద్యా సంవత్సరం షురూ అవుతోంది. గత ఏడాది ఈ సమయానికి కరోనా సెగ పెద్దగా లేదు. 2020 మార్చి నెలాఖరు నుంచి కరోనా పాండమిక్ కారణంగా లాక్ డౌన్ మొదలైంది. ఈ దెబ్బకి విద్యాసంవత్సరం నీరుగారిపోయింది.

కొన్ని ప్రైవేటు సంస్థలు తూతూ మంత్రంగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించినమాట వాస్తవం. ప్రభుత్వాలేమో ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోంవాలని ఆదేశాలు జారీ చేశాయి. కానీ, స్కూళ్ళ యాజమాన్యాలు మొత్తం ఫీజుని, నెలవారీ చెల్లింపు విధానంలోకి తీసుకొచ్చాయి. దాదాపుగా మొత్తం విద్యా సంవత్సరం సర్వనాశనమైపోయిందాయె. కానీ, విద్యా సంస్థలు మాత్రం, విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ‘ఫీజులు చెల్లించారా సరే సరి.. లేదంటే, స్కూళ్ళు వదిలి పోండి..’ అని తెగేసి చెబుతున్నాయి స్కూళ్ళ యాజమాన్యాలు. కాలేజీల పరిస్థితీ అంతే. ఇంతకీ, ప్రభుత్వంలో వున్నవారు ఏం చేస్తున్నట్లు.? ప్రభుత్వ స్కూళ్ళను ఉద్ధరించడం వరకూ పాలకుల్ని కొంతమేర అభినందించాల్సిందే.

ఎందుకంటే, తెలంగాణతోపాటు ఆంధ్రపదేశ్‌లోనూ ప్రభుత్వ స్కూళ్ళలో చాలా చాలా మార్పులొచ్చాయి. ఆంధ్రపదేశ్‌లో అయితే, ప్రభుత్వ స్కూళ్ళను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. కానీ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్నవారి పరిస్తితేంటి.? విద్యార్థులకు స్కూళ్ళ యాజమాన్యాల బెదిరింపుల కారణంగా మానసిక సమస్యలు తలెత్తతున్నాయి. వాంతో, వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఓ వైపు ప్రైవేటు స్కూళ్ళ నిర్వహణ భారంగా మారుతోందంటే, టీచర్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు.. అలాగని ఫీజులు వసూలు చేయడంలేదా.? అంటే అదీ లేదు. ఫీజులు వసూలు చేస్తున్నారు, టీచర్లను తొలగిస్తున్నారు.. ఇదీ కొన్ని స్కూళ్ళలో పరిస్థితి. ప్రభుత్వంలో వున్న చాలామంది పెద్దలకు విద్యా సంస్థలు ప్రధాన ఆదాయ వనరుగా మారడం వల్లే, ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట పడటంలేదన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ.