లోకేష్ విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి..కెటియారే కారణమా ?

చంద్రబాబునాయుడుపై ఒత్తిడి పెరిగిపోతోందట. ఏ విషయంలో అంటే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెసియార్ కొడుకు కెటియార్ ను నియమించిన విషయం అందరికీ తెలిసిందే కదా ? ఇపుడా విషయంలోనే లోకేష్ అండ్ కో నుండి చంద్రబాబుపై ఒత్తిడి మొదలైందని సమాచారం. ఏ ముహూర్తంలో రెండు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రలు సిఎంలుగా బాధ్యతలు స్వీకరించారో తెలీదు కానీ వాళ్ళ పుత్రరత్నాల మధ్య మాత్రం ప్రతీ విషయంలోను పోటీ పెరిగిపోయింది. ఇక్కడ పుత్రరత్నాల మధ్య అంటే కెటియార్ ఏమీ లోకేష్ తో పోటీ పడటం లేదు. కెటియార్ తో లోకేషే పోటీ పడుతున్నారు. తనతో  ఏ విషయంలోను లోకేష్ సరిపోడు అన్న విషయంలో స్పష్టత ఉంది కాబట్టే కెటియార్ పట్టించుకోవటం లేదు. కాకపోతే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లే ప్రతీ విషయంలోను లోకేషే పోలిక చూసుకుంటున్నాడు.

 

కెటియార్ మంత్రియిన తర్వాత ఐటి, పంచాయితీ శాఖలను తీసుకున్నారు. తర్వాతెప్పుడో మంత్రయిన లోకేష్ కూడా పట్టుబట్టి అవే శాఖలను తీసుకున్నారు. సరే తీసుకుని ఏమి సాధించారు అనే చర్చ అవసరం లేదు. ఎందుకంటే, ఇద్దరి సామర్ధ్యం జనాలందరికీ తెలిసిందే. ప్రజాక్షేత్రంలో గెలిచి కెటియార్ తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నారు. అదే లోకేష్ మాత్రం దొడ్డిదోవన ఎంఎల్సీ గా మారి మంత్రి పదవిని అందుకున్నారు. కెటియార్ ఉద్యమ సమయంలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే లోకేష్ మాత్రం టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.

 

ఇక, శాఖల నిర్వహణ, పార్టీ నేతలతో సమావేశాలు, బహిరంగసభల్లో మాట్లాడటం, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించటంలో కెటియార్ ఎంతో పరిణతి కనబరుస్తున్నారు. అదే లోకేష్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నట్లుంది పరిస్దితి. కెటియార్ విదేశాలకు వెళితే లోకేష్ కూడా తానేం తక్కువ అంటూ విదేశాలకు వెళ్ళారు. ఒక్క విషయంలో చెప్పుకుంటే కెసియార్ వారసుడి హోదాలోనే కెటియార్ రంగ ప్రవేశం చేసినా సామర్ధ్యాన్ని నిరూపించుకున్నారు. లోకేష్ మాత్రం చంద్రబాబు లేకపోతే అంతే సంగతులు. పార్టీ నేతలే లోకేష్ సామర్ధ్యంపై జోకులేసుకుంటున్నారంటే పరిస్దితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

 

అటువంటిది ఎన్నికలు కాగానే కెటియార్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెసియార్ నియమించగానే అదే విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి పెరిగిపోతోందట. అందులోను త్వరలో ఎన్నికలు వస్తున్నాయి కదా ?  దాంతో కుటుంబంపరంగానే కాకుండా పార్టీలో లోకేష భక్త బృందం నుండి కూడా ఒత్తిడి మొదలైందట. తను లేకపోతే లోకేష్ ను దేకే వాళ్ళు ఎవరూ ఉండరన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. కానీ ఎంత కాలమని చేతులు పట్టుకుని నడిపిస్తారు ? ఆ విషయంలోనే చంద్రబాబులో ఆందోళన పెరిగిపోతోంది. కానీ చేసేదేముంది ? కాబట్టి రేపో మాపో లోకేష్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకుంటారేమో ?