ఫిరాయింపులు కూడా  టిడిపి కొంప ముంచాయా ?

ఐదేళ్ళు సిఎంగా ఉన్నపుడు  చంద్రబాబునాయుడు ప్రోత్సహించిన ఫిరాయింపులు కూడా పార్టీ కొంప ముంచాయా ? అవుననే అంటున్నారు టిడిపి నేతలు. తిరుపతి, పలమనేరు నియోజకవర్గాలకు చెందిన నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఫిరాయింపుల విషయాన్ని పలమనేరు నేతలు ప్రస్తావించారట.

ఐదేళ్ళ కాలంలో వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏలు, ఎంపిలను లాక్కోవటం కూడా పార్టీకి బాగా చెడ్డ పేరు తెచ్చిందని పలమనేరు నేతలు చంద్రబాబుతో చెప్పారు. ఎంఎల్ఏలు ఏ పార్టీ తరపున గెలిచి ఏ పార్టీలోకి ఫిరాయిస్తున్నారనే విషయాన్ని జనాలు జాగ్రత్తగా గమనించినట్లు నేతలు చెప్పారు.

వైసిపి తరపున గెలిచిన అమర్నాధరెడ్డి తర్వాత టిడిపిలోకి ఫిరాయించటాన్ని జనాలు అంగీకరించలేదని చంద్రబాబుతో స్పష్టంగా చెప్పారట.  కేవలం మంత్రిపదవి కోసమే అమర్ పార్టీ ఫిరాయించటాన్ని జనాలు చాలా చోట్ల నియోజకవర్గంలో తీవ్రంగా వ్యతిరేకించారని కూడా నేతలు గుర్తు చేశారు.

ఎన్నికల్లో పోటీ చేయటం పార్టీ ఫిరాయించటాన్ని ఏదో పై స్ధాయిలో జరిగే వ్యవహారమని దీన్ని జనాలు పట్టించుకోరని అనుకున్నట్లు నేతలకు  చంద్రబాబు బదులిచ్చారట. అయితే మొన్నటి ఎన్నికల్లో ఫిరాయింపుల్లో అందిరకీ చంద్రబాబు టికెట్లు ఇవ్వలేదు. కానీ పోటీ చేసిన ఫిరాయింపుల్లో  ప్రకాశం జిల్లా అద్దంకి నియోకవర్గంలో మాత్రమే గొట్టిపాటి రవికుమార్ గెలిచిన విషయాన్ని నేతలు చంద్రబాబుకు గుర్తు చేశారట.