అకున్ సభర్వాల్‌కే సవాల్ విసురుతున్న సినీ మల్టిప్లెక్స్‌లు

తూనికలు కొలతల శాఖకు వచ్చీ రాగానే ఐపిఎస్ అధికారి అకున్ సభర్వాల్ హల్ చల్ చేశారు. మల్టిఫ్లెక్స్ లో ఎమ్మార్పీ ధరకంటే ఎక్కువ అమ్మితే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఎక్కడ ఉన్నా అంతే మిగిలినోళ్ల కంటే కొద్దిగా గట్టి ఆఫీసరే అనే పేరుంది. గతంలో డ్రగ్స్ మాఫియా బట్టలూడదీసే ప్రయత్నం చేశారు. డ్రగ్స్ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేసిన క్రమంలో ఆయనకు బదిలీ అయింది. ఇప్పుడు తూనికలు కొలతల శాఖకు వచ్చారు. అసలే పనిచేసే పాణం కదా ఊకుంటదా? అన్నట్లు ఇక్కడ కూడా ఆపరేషన్ మొదలు పెట్టేశారు. మల్టిఫ్లెక్స్ లో దందాలపై కన్నేశారు. కానీ ఆయన మాటను మల్టిఫ్లెక్స్ లు లెక్క చేస్తయా అంటే? డోంట్ కేర్ అంటున్నాయి. ఆ వివరాలేంటో చదవండి.

సినిమా చూడాలంటే తలకు మించిన భారం అయిన రోజులివి. ఎన్నో టెన్షన్స్ తో కాస్త రిలాక్స్ అవుదామని సినిమాకి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యులతో కలిసి సినిమాకు వెళితే ఇప్పుడున్నే పరిస్థితిలో కనీసం 2 వేల రూపాయల ఖర్చు  అవుతుంది. చిన్నా చితక పనుల చేసుకుని బతికేవారు అసలు థియేటర్ల ముఖం చూడాలంటేనే భయపడుతున్నారు. టిక్కెట్లపై దండుకునే యాజమాన్యాలు అంతకు మించిన ధరను కూల్ డ్రింక్స్, తిను బండారాలపై వసూలు చేస్తున్నాయి. సామాన్యులను దోచుకుంటున్న థియేటర్లకు కళ్లేం వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆగష్టు 1 నుంచి ఎమ్మార్పీ రేట్లకే అమ్మాలనే నిబంధనను తెచ్చింది. అన్ని థియేటర్లకు కూడా విషయాన్ని తెలుపుతూ నోటిసులు జారీ చేసింది. కానీ దాని అమలు మాత్రం ఏ థియేటర్లో కూడా కనిపించడం లేదు.

థియేటర్లలో ప్రతి ఉత్పత్తి ధర కూడా బయటి రేటుతో పోల్చితే మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా ఉన్నాయి. 20 రూపాయల విలువైన కూల్ డ్రింక్ ను 120 నుంచి 130 రూపాయలకు అమ్ముతున్నారు. ఆఫ్ లీటర్ అప్పిఫీజా బాటిల్ 30 రూపాయలైతే దానిని 60 రూపాయలకు అమ్ముతున్నారు. హైదరాబాద్ లోని ప్రముఖ మాల్స్ పీవీఆర్, ఐనాక్స్, సినీ మ్యాక్స్ లలో పాప్ కార్న్ ప్యాకెట్ ను రూ. 120 కి విక్రయించారు. ఎల్ బీ నగర్ లోని బివికె మాల్ లో సిని ప్రేక్షకుల నుంచి యాజమాన్యం యధేచ్చగా దోచుకుంటుంది. 30 రూపాయల అప్పి ఫీజా బాటిల్ ను 60 రూపాయలకు అమ్ముతుంది. అదే ప్రతి తిను బండారంపై కూడా డబుల్ పైసలు వసూలు చేస్తూ సినీ ప్రేక్షకుల జేబు గుల్ల చేస్తుంది.

 

బివికె మాల్‌లో ఎమ్మార్పీ రేటు కంటే ఎక్కువ ధరలతో ఏర్పాటు చేసిన బోర్డు 

 సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రం పరిస్థితి కొంత మారి వారు ఎమ్మార్పీ రేటుకే అమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. మల్లిఫ్లేక్సుల్లో అధిక ధరలపై ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నెంబర్ 180042500333. వాట్సాప్ నంబర్ 7330774444 కి ఫిర్యాదు చేయవచ్చని తూనికలు, కొలతల శాఖ ప్రకటించింది. బివికె యాజమాన్యం ధరల పట్టికలో టోల్ ఫ్రీ నంబర్ కూడా ప్రకటించడం గమనార్హం. అంటే బివికె యాజమాన్యంతోటి అధికారులు కుమ్మక్కయ్యారని సినీ ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. అధికారుల సహాకారంతోనే సినీ థియేటర్ల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నాయని సిని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. సివిల్ సప్లయిస్ కమీషనర్ అకున్ సభర్వాల్ ఈ నిబంధనలను అమలు చేయాల్సిందే అని స్ట్రాంగ్ గా చెప్పినా అకున్ సభర్వాల్ కే సవాల్ విసురుతూ సినీ యాజమాన్యాలు యధేచ్చగా తమ దొంగ దందాను చేసుకుంటున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎమ్మార్పీ రేటుకే అమ్మేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.