టిడిపి అభ్యర్ధుల ఎంపికకు కెసియార్ ఫార్ములా

రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబునాయుడులో అయోమయం మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని చంద్రబాబుకు మద్దతుగా నిలబడే మీడియానే ప్రముఖంగా చెప్పింది. ఏపి ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులను ఎంపిక  చేయటంలో చంద్రబాబులో అయోమయం కనిపిస్తోందనే అర్ధం వచ్చేట్లుగా కథనాన్ని ఇవ్వటం గమనార్హం. తెలంగాణా ఎన్నికల తర్వాత చంద్రబాబులో అయోమయం మొదలైందని కూడా  కథనంలో స్పష్టంగా ఉంది. మామూలుగా అయితే అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు చాలా కాలంగా సర్వేలు చేయిస్తున్నారు. సర్వేల్లో వచ్చిన ఫలితాల ఆధారంగానే టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలో నిర్ణయిస్తానని కూడా చాలా సార్లు ప్రకటించారు.

 

చంద్రబాబు సర్వేల ప్రకారమైతే 100 మంది టిడిపి ఎంఎల్ఏలతో పాటు 22 మంది ఫిరాయింపు ఎంఎల్ఏల్లో చాలామంది మీద జనాల్లో తీవ్ర అసంతృప్తి పేరుకుపోయింది.  ఆ విషయాన్ని కూడా చంద్రబాబే చెప్పారు. కాబట్టి చాలామందికి టిక్కెట్టు ఇచ్చేది లేదని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఫిరాయింపుల్లో ఐదుగురికి తప్ప మిగిలిన వారికి టిక్కెట్టు దక్కేది డౌటే. అందులో నలుగురు ఫిరాయింపులకు టిక్కెట్లు ఇచ్చేది లేదని చంద్రబాబు ఇఫ్పటికే హెచ్చరించారు. ఒకవైపు సర్వేలు జరుగుతుండగానే మరోవైపు తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి.

 

సెప్టెంబర్ లో ముందస్తు ఎన్నికలకు సిఫారసు చేసిన రోజే కెసియార్ 105 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలకు టిక్కెట్లు ప్రకటించేశారు. అప్పటికి సిట్టింగుల్లో చాలామందిపై నియోజకవర్గాల్లో పార్టీ నేతల నుండే కాకుండా జనాల్లో కూడా విపరీతమైన అసంతృప్తి కనిపిస్తోంది. కాబట్టి అభ్యర్ధులను మారుస్తారని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా ఎవరినీ మార్చకుండా వారికే టిక్కెట్లిచ్చారు. దాంతో టిఆర్ఎస్ ఓడిపోవటం ఖాయమనుకున్నారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ కెసియార్ బంపర్ మెజారిటీతో గెలిచారు.

 

ఆ విషయమే చంద్రబాబును ఇఫుడు అయోమయంలోకి నెట్టేస్తోందట. కెసియార్ ఫార్ములాను ఫాలో అయితే ఎలాగుంటుంది ? లేకపోతే ఆరోపణలున్న వారిని పక్కన పెట్టేస్తే ఫలితం ఎలాగుంటుంది ? అనే విషయంలో సీనియర్లతో చర్చలు జరుపుతున్నారట. ఒక్కొక్కళ్ళు ఒక్కో అభిప్రాయం చెబుతున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మరీ అధ్వాన్నంగా ఉన్న ఓ 30 మందిని మాత్రం మారిస్తే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమైందట. మరి చివరకు ఏం చేస్తారో చూడాలి.