పంచాయతీ ఎన్నికలు కావాలి కావాలి అని ఎగిరిన చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నట్టు ఉన్నాయి. వైసీపీ మీద జనంలో తెగని వ్యతిరేకత ఉందని, ఇదే సరైన సమయమని ఎన్నికలకు కాలుదువ్వారు ఆయన. అనుక్షణం నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెంట నిలిచి పంచాయతీ ఎన్నికల కోసం పట్టుబట్టారు. అసలు ఈ ఎన్నికలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరగాల్సింది. కానీ క్షేత్ర స్థాయిలో ఉన్న వ్యతిరేకతను పసిగట్టి వాయిదావేశారు. తీరా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికలు డిమాండ్ చేశారు. అది కూడ జగన్ మీద ఎక్కడో వ్యతిరేకత మొదలైందని సంకేతాలు రాగానే ఎన్నికల రాగం అందుకున్నారు.
ఎలాగైతేనేం.. ఆయన కోరుకున్నట్టు పంచాయతీ ఎన్నికలు రానేవచ్చాయి. పోలింగ్ కంటే ముందు ఏకగ్రీవాలు ఉంటాయి. వీటిలోని పార్టీల బలాబలాల మీద ఒక అంచనా వచ్చేస్తుంది. ఏకగ్రీవాలు ఎన్ని ఎక్కువ జరిగితే అధికార పార్టీకి అంత బెనిఫిట్ అనుకోవాలి. ఎప్పటికిలాగే ఈసారి కూడ పాలపక్షం ఏకగ్రీవాలను ప్రోత్సహించింది. పెద్ద ఎత్తున నజరానాలు ప్రకటించింది. ముప్పేశాతం స్థానాలను ఏకగ్రీవాలు చేయాలని జగన్ భావించారు. చంద్రబాబు నాయుడేమో వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతోందని, వాటిని అడ్డుకుని తీరుతామని శపథం చేశారు. కానీ వాస్తవంలో ఆ సీన్ కనబడలేదు. జగన్ ఆశించిన స్థాయిలో ఏకగ్రీవాలు లేకపోయినా చంద్రబాబు షాకయ్యే సంఖ్యలో మాత్రం ఉన్నాయి.
3,249 పంచాయతీల్లో 500లకు పైగా సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో అత్యధికం చిత్తూరు జిల్లా నుండే ఉండటం గమనార్హం. జిల్లాలోని 454 గ్రామ పంచాయతీల్లో 110 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో షాక్ తినడం బాబుగారి వంతైంది. ఎందుకంటే చిత్తూరు చంద్రబాబు సొంత జిల్లా. ఏకగ్రీవాలను అడ్డుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికిన బాబుగారు సొంత జిల్లాలోనే అత్యధికంగా ఏకగ్రీవాలు జరిగితే ఏమీ చేయలేకపోయారని, ఇక రాష్ట్రం మొత్తం మీద వైసీపీని ఎలా నిలువస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏకగ్రీవల్ సంఖ్య చూసిన టీడీపీ శ్రేణులు సైతం కథ అడ్డం తిరిగినట్టుగా ఉందే అని ఆందోళనపడుతున్నారు.