రాజకీయ నాయకులు తమ సొంత ప్రయోజనం కోసం, తమ పార్టీకి ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసం ఎన్ని తప్పులైనా చేస్తారు. అవసరమైతే రాష్ట్రాన్ని కూడా అమ్మకానికి పెడతారు. అమ్మకానికి పెట్టడం అంటే రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టడం. అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలోకి రావాలకున్న నాయకులు ప్రజలయొక్క అవసరాలను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లకు అవసరం ఉన్నా లేకున్నా ఉచిత పథకాలను ప్రకటిస్తూ వాటికి తాత్కాలిక ఆనందాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తు రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు.
రాజకీయ నాయకులు ఇచ్చే ఉచిత పథకాల వల్ల రాష్ట్రం అప్పుల్లో కురుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ ఉచిత పథకాల హవా వేరే రేంజ్ లో ఉంటుంది. ఈ ఉచిత పథకాల వల్ల రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టింది వైసీపీ ప్రభుత్వం.
ఈ అప్పుల్లో టీడీపీ పాత్ర కూడా ఉంది. ఓటు బ్యాంక్ సంపాదించుకోవడం కోసం విచ్చలవిడిగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారు. గడచిన మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఆదాయం 19 వేల కోట్లు. ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పులేమో 39 వేల కోట్లు. అంటే, రూపాయి ఆదాయానికి రెండ్రూపాయల అప్పు అన్నమాట. ఇవి కొత్త అప్పులు. పాత అప్పుల కథ వేరే వుంది. మొత్తంగా రాష్ట్రం నెత్తిన కనీ వినీ ఎరుగని రీతిలో అప్పుల కుప్ప కన్పిస్తోంది. ఇంకొన్నాళ్ళు ఆగితే, రాష్ట్ర ఆదాయం ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలకు కూడా సరిపోదేమో. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో ధరలు ఎక్కువే. ఇతరత్రా పన్నులూ క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. మద్యం ధరల సంగతి సరే సరి. అయినాగానీ, రాష్ట్రం అదనంగా అప్పులు ఎందుకు చేయాల్సి వస్తోంది. ఈ అప్పుల పురాణం కేంద్రం దాకా వెళ్లిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వం యొక్క అప్పుల పురాణంపై దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అసంతృప్తి వ్యక్తంచేశారని సమాచారం. ఉచిత వ్యవసాయ కరెంట్ కు మోటార్స్ బిగించడం కూడా రాష్ట్రం యొక్క అప్పులు కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు తాత్కాలిక ఉచిత పథకాలను ప్రవేశపెట్టకుండా ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేయాలని కోరుకుందాం